వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

దేశంలో లాక్ డౌన్ సమయంలో ఆహారధాన్యాల పంపిణీపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆహార మంత్రులతో సమీక్షించిన శ్రీ రాం విలాస్ పాశ్వాన్

లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల దొంగ నిలవాలను అరికట్టి చౌక ధరలకు సరుకులు అమ్మేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిన కేంద్రం
2020-21 రబీ మార్కెట్ సీజనుకు గోధుమ సేకరణ 15 ఏప్రిల్,2020 నుంచి ప్రారంభం

Posted On: 13 APR 2020 8:22PM by PIB Hyderabad

లాక్ డౌన్ సమయంలో సరుకుల దొంగ నిల్వలు చేయకుండా,ధరలు పెంచకుండా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.   రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆహార, ప్రజాపంపిణీ మరియు పౌర సరఫరాల మంత్రులతో సోమవారం జరిపిన వీడియో కాన్ఫరెన్సులో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ రాం విలాస్ పాశ్వాన్ ఈ మేరకు కేంద్ర అభిప్రాయాన్ని తెలియజేశారు.  స్థానిక మార్కెట్లలో నిత్యావసర సరుకులు చౌక ధరలకు లభ్యమయ్యేలా చూసేందుకు సూక్ష్మస్థాయి ప్రణాళికను అమలు చేయాలని ఆయన ఆదేశించారు. నిత్యావసర సరుకుల చట్టం సక్రమంగా అమలు జరిగేలా చూసే బాధ్యత, అధికారాలు రాష్ట్రాలకు అప్పగించడం జరిగిందని శ్రీ పాశ్వాన్ తెలిపారు. 

ఏప్రిల్ 15, 2020 నుంచి 2020-21 రబీ మార్కెట్ సీజనుకు గోధుమ సేకరణను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా శ్రీ పాశ్వాన్ ఆదేశాలు జారీచేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆదేశాలకు అనుగుణంగా ధాన్యం సేకరణ సందర్భంగా సామాజిక దూరం నియమాలను ఖచ్చితంగా పాటించాలని శ్రీ పాశ్వాన్ నొక్కిచెప్పారు.  ధాన్యం సేకరణ సందర్భంగా శ్రామికుల కొరత లేకుండా చూసేందుకు అన్ని సేకరణ కేంద్రాలు, గోదాంలు, ఆఫీసుల వద్ద అన్నిరకాల సిబ్బందికి డ్యూటీ రోస్టర్  తయారుచేయాలని మంత్రి తెలిపారు. 

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయడానికి అవసరమైనన్ని ఆహార ధాన్యాల నిల్వలను అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవ్వడం జరిగిందని శ్రీ పాశ్వాన్ తెలిపారు.  పిఎంజికెఎవై కింద ప్రజాపంపిణీ వ్యవస్థ లబ్ధిదారులందరికీ ప్రతి వ్యక్తికీ 5 కిలోల (బియ్యం లేదా గోధుమ) చొప్పున ఉచితంగా ఆహార ధాన్యాలను వచ్చే మూడు నెలల పాటు ఇస్తామని ఆయన తెలిపారు. అంతేకాక ప్రతి కుటుంబానికి /కార్డుకు ఉచితంగా ఒక్కొక్క కిలో చొప్పున పప్పులు ఇస్తామని, ఇందుకోసం నాఫెడ్ ను కేంద్ర సంస్థగా నియమించడం జరిగిందని మంత్రి తెలిపారు.  ఈ పథకం గురించి ప్రజలకు తెలియజెప్పడానికి ప్రచారం నిర్వహించాలని ఆయన రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సంక్షోభ సమయంలో పేదలు, అన్నార్తుల ఆకలి తీర్చాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశంసించారు. వచ్చే మూడు నెలల పాటు ఆహార ధాన్యాలు, పప్పులను ఉచితంగా పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర భరిస్తుందని శ్రీ పాశ్వాన్ తెలిపారు. 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ)  భారీ మొత్తంలో ఆహారధాన్యాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తోందని చెప్తూ ఆహార ధాన్యాలు, పప్పుల పంపిణీ వేగవంతం చేయాలనీ శ్రీ పాశ్వాన్ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు.  జాతీయ ఆహార భద్రతా చట్టం కింద తమకు కేటాయించిన నిల్వలను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తమ వీలునుబట్టి వచ్చే ఆరు నెలలకు సరిపడినన్ని తీసుకోవచ్చునని, మూడు నెలలకు సరిపడే ఆహార ధాన్యాలను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు భారత ప్రభుత్వం అప్పుగా ఇస్తుందని వెల్లడించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు చేస్తున్న ఈ తరుణంలో ఏ ఒక్క పురుషుడు/స్త్రీ ఆకలితో అలమటించ కూడదని,  అలాంటి వారెవరైనా ఉంటె వారిని వెంటనే లభ్దిదారుల జాబితాలో చేర్చాలని శ్రీ పాశ్వాన్ అన్నారు.  

బహిరంగ మార్కెట్లో అమ్మకం కోసం కిలో బియ్యం ధర రూ. 22గా, కిలో గోధుమ ధర రూ.21గా నిర్ణయించడం జరిగిందని మంత్రి తెలిపారు.  సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే సంస్థలు లాక్ డౌన్ సమయంలో ఎఫ్ సి ఐ నుంచి నేరుగా అదే ధరకు కొనడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు.    

ఆహార ధాన్యాల సేకరణ, పంపిణీ సందర్భంగా సామాజిక దూరం నియమాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను శ్రీ పాశ్వాన్ కోరారు. 

 

*****


(Release ID: 1614265) Visitor Counter : 333