పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
జి20 ఇంధన మంత్రుల అసాధారణ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
10 APR 2020 8:02PM by PIB Hyderabad
కోవిడ్-19 నేపథ్యంలో ఇంధన సరఫరా అంశాలను సమీక్షించేందుకు గాను జి20 ఇంధన మంత్రుల అసాధారణ సమావేశం శుక్రవారం జరిగింది. జి20 ఇంధన దేశాల అధ్యక్ష హోదాలో సౌదీ అరేబియా ఈ మీటింగ్ను వర్చువల్ పద్ధతిలో నిర్వహించింది. సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్ అబ్దులాజీజ్ అధ్యక్షతన జరిగిన అ సమావేశంలో భారత తరఫున పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒపెక్, ఐఈఏ, ఐఈఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన అధినేతలతో పాటు సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఇంధన డిమాండ్ తగ్గినందున స్థిరమైన ఇంధన మార్కెట్లను నిర్ధారించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు, మిగులు ఉత్పత్తికి సంబంధించిన విషయాలపై కూడా ఈ సమావేశంలో ఇంధన మంత్రులు ప్రధానంగా
దృష్టి సారించారు.
ఇంధన డిమాండ్ కేంద్రంగా భారత్..
ఈ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎదురువుతున్న కఠిన సవాళ్లను అధిగమించేందుకు మానవ సంక్షేమ కేంద్రీకృత విధానాల్ని ఎంచుకొని ముందుకు సాగుదామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల జి20 దేశాలకు ఇచ్చిన పిలుపును పునరుద్ఘాటించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో భారత సర్కారు ప్రకటించిన 23 బిలియన్ డాలర్ల ఉపశమన ప్యాకేజీలో భాగంగా ఉజ్జ్వల పథకం కింద దాదాపు 80.3 మిలియన్ల పేద కుటుంబాల వారికి ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లను అందించాలంటూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రధానంగా గుర్తు చేశారు. భారత్ ప్రపంచ ఇంధన డిమాండ్ కేంద్రంగా ఉందని, ఇకపై కూడా కొనసాగుతుందని ఆయన ఉద్ఘాటించారు. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను పూరించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
సుస్థిరమైన ఇంధన మార్కెట్‌తోనే మేలు..
ఇంధన మార్కెట్లో ఒడిదుడుకులను గురించి మంత్రి ప్రధాన్ మట్లాడుతూ భారతదేశం ఎల్లప్పుడూ స్థిరమైన చమురు మార్కెట్ పక్షాన నిలుస్తుందన్నారు. ఉత్పత్తిదారులకు సహేతుకంగా ఉంటూనే వినియోగదారులకు సరసమైన ధరల్లో ఇంధనం లభింపజేసేలా మార్కెట్లుండాలన్నది భారత్ అభిమతమని ఆయన అన్నారు. దీర్ఘకాలిక సుస్థిరత కోసం ఇంధన సరఫరాలో సమతౌల్యత దిశగా ఒపెక్ మరియు ఒపెక్-ప్లస్ దేశాలు చేస్తున్న సమిష్టి కృషిని మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. వినియోగపు డిమాండ్ పుంజుకునేందుకు వీలుగా చమురు ధరలను సరసమైన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో ఇదే విషయమై ఇంధన మంత్రులకు మెరుగైన సలహాలను ఇవ్వడానికి టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించారు. రానున్న రోజుల్లోనూ కలిసి ముందుకు సాగాలని సభ్య దేశాలు అంగీకరించాయి.
(Release ID: 1613126)
Visitor Counter : 208