వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

సహాయ కార్యక్రమాల కోసం ఎఫ్.సి.ఐ. నుండి నేరుగా ఆహారధ్యానాల కొనుగోలుకు స్వచ్చంద సంస్థలకు అనుమతి.

Posted On: 08 APR 2020 8:47PM by PIB Hyderabad

దేశవ్యాప్త లాక్ డౌన్ సమయంలో వేలాది మంది పేద ప్రజలకు భోజనం అందించడంలో స్వచ్చంద సంస్థలు, ధార్మిక సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.   ఈ సంస్థలకు నిరంతరాయంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయడానికి వీలుగా, ఈ-వేలం ప్రక్రియ ద్వారా పోకుండా, బహిరంగ మార్కెట్ విక్రయ పధకం (ఓ.ఎం.ఎస్.ఎస్.) ధరలకే ఈ సంస్థలకు గోధుమలు, బియ్యం నేరుగా ఎఫ్.సి.ఐ. నుండి అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఇంతవరకు, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రోలర్ ఫ్లోర్ మిల్లులు వంటి  నమోదు చేసుకున్న భారీ వినియోగదారులు మాత్రమే ఓ.ఎం.ఎస్.ఎస్. ధరలకు  ఎఫ్.సి.ఐ. నుండి స్టాక్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.  ఈ సంస్థలు ఒకటి  నుండి పది మెట్రిక్ టన్నుల వరకు ఒకే సారి ఎఫ్.సి.ఐ. నుండి ముందుగా నిర్ణయించిన రిజర్వ్ ధరలతో కొనుగోలు చేసుకోవచ్చు.  

ఎఫ్.సి.ఐ. కి దేశవ్యాప్తంగా 2,000 గోడౌన్లు ఉన్నాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎఫ్.సి.ఐ ఈ గోడౌన్ల ద్వారా ఈ సంస్థలకు సజావుగా సరఫరా చేయడానికి అవకాశం ఉంది.   దేశంలో ఉన్న పేద మరియు వలస కార్మికులకు ధార్మిక సంస్థలు నిర్వహించే సహాయ శిబిరాల ద్వారా ఆహారం అందించడానికి ఈ విధానం ఎంతగానో సహాయపడుతుందిఈ సంస్థలు తీసుకు వెళ్లే ఆహారధాన్యాలు ఉద్దేశించిన ప్రయోజనకోసం ఉపయోగపడుతున్నాయని నిర్ధారించుకోడానికి వీలుగా వాటి వివరాలను సంబంధిత డి.ఎం.లకు తెలియజేయవలసి ఉంటుంది.   దేశవ్యాప్తంగా ఆహారధాన్యాల నిల్వలు అందుబాటులో ఉంచడానికి వీలుగా, లాక్ డౌన్ ప్రారంభం కావడానికి ముందే మిగులు రాష్ట్రాల నుండి 2.2 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను ఎఫ్.సి.ఐ. తరలించింది.  పి.ఎం.జి.కె.ఏ.వై. పధకం కింద ఎఫ్.సి.ఐ. ఇప్పటికే ఒక మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది.  

2020 మార్చి 24వ తేదీనుండి ఇప్పటి వరకు సాధారణ ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కేటాయింపు కింద అవసరాలను తీర్చడానికి ఎఫ్.సి.ఐ. 3.2 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేసింది.  అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా నిల్వలు ఉండాలనే ఉద్దేశ్యంతో, దేశంలోని ప్రతి రాష్ట్రం / కేంద్ర పాలితప్రాంతంలో ఉన్న ఆహ్యాధాన్యాల నిల్వల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.  2020 ఏప్రిల్ 7వ తేదీ నాటికి ఎఫ్.సి.ఐ. వద్ద 54.42 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎమ్.ఎమ్.టి.) ఆహార ధాన్యాలు ఉన్నాయి.   (వీటిలో 30.62 ఎమ్.ఎమ్.టి. ల బియ్యం, 23.80 ఎమ్.ఎమ్.టి. ల గోధుమలు ఉన్నాయి).  

పి.డి.ఎస్. మరియు ఇతర ప్రభుత్వ పధకాలకు సమృద్ధిగా ఆహారధాన్యాలు సరఫరా అయ్యే విధంగా చూస్తూనే, మార్కెట్లో ధరలు పెరగకుండా అరికట్టాలని ఉద్దేశ్యంతో, బహిరంగ మార్కెట్లో కూడా తగిన స్థాయిలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.    ఓ.ఎం.ఎస్.ఎస్. పధకం కింద ఎఫ్.సి.ఐ. నేరుగా రాష్ట్రప్రభుత్వాలకు బియ్యం, ఫ్లోర్ మిల్లులకు గోధుమలు సంబంధిత డి.ఎం./డి.సి. ల సిఫార్సుల కనుగుణంగా క్రమం తప్పకుండా సరఫరా చేస్తుంది.  ఇంతవరకు 1.45 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 1.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించింది. 

లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఆహారధాన్యాల సరఫరా స్థిరంగాసజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది. 

*****


(Release ID: 1612407) Visitor Counter : 299