రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 సవాలును ఎదుర్కోవటానికి భార‌తీయ రైల్వేకు చెందిన 2500 మందికి పైగా వైద్యులు మరియు 35000 మంది పారామెడిక్ సిబ్బంది సిద్ధం

- వివిధ జోన్ల‌లో వైద్యులు మరియు పారామెడిక్ సిబ్బంది తాత్కాలిక ప్రాతిపదికన నియామ‌కం
- కోవిడ్‌ రోగుల చికిత్సకు 17 ప్ర‌త్యేక ఆసుపత్రులలో 5,000 పడకలు, రైల్వే ఆసుపత్రులలో 33 హాస్పిటల్ బ్లాక్‌ల గుర్తింపు
- వేగంగా 5000 రైల్వే బోగీల‌ను క్వారంటైన్, ఐసోలేష‌న్ కోచ్‌లుగా మార్పిడి ప‌నులు
- ఇప్ప‌టికే దాదాపు 3250 బోగీల మార్పిడి ప‌నులు పూర్తి

Posted On: 08 APR 2020 5:34PM by PIB Hyderabad

కోవిడ్‌-19 నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వ చేప‌డుతున్న ఆరోగ్య సంర‌క్ష‌ణ ప్ర‌య‌త్నాల‌కు భార‌తీయ‌ రైల్వే త‌న‌వంతు స‌హ‌కారాన్ని అందించేలా ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇందులో భాగంగా కోవిడ్ అవసరాలను తీర్చడానికి వీలుగా ప్రస్తుత రైల్వే ఆస్పత్రులను సన్నద్ధం చేస్తోంది. అత్య‌వ‌స‌ర‌ పరిస్థితులను తీర్చడానికి త‌న ఆసుపత్రుల‌లో పడకలను కేటాయించడం, అదనపు వైద్యులు, పారామెడిక్స్‌ను నియమించడం వంటి చ‌ర్య‌లు చేప‌డుతోంది. ప్రయాణీకుల కోచ్‌లను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చే ప‌నుల‌ను కూడా వేగ‌వంతంగా పూర్తి చేస్తోంది. దీనికి తోడు వైద్య పరికరాలు, పీపీఈలు వెంటిలేటర్స్ మొదలైన వాటి అంత‌ర్గ‌త‌ ఉత్ప‌త్తిని కూడా చేప‌ట్టింది.
భార‌తీయ రైల్వేకు దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 586 ఆరోగ్య యూనిట్లు, 45 సబ్ డివిజనల్ హాస్పిటల్స్, 56 డివిజనల్ హాస్పిటల్స్, 8 ప్రొడక్షన్ యూనిట్స్ హాస్పిటల్స్ మరియు 16 జోనల్ హాస్పిటల్స్ నందు ప్ర‌ధాన భాగాల్ని ఇప్పుడు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి కేటాయించ‌నున్నారు. 2546 మంది వైద్యులతో పాటు 35153 నర్సింగ్ సిబ్బంది, ఫార్మసిస్ట్ మరియు ఇతర పారామెడిక్ సిబ్బంది కోవిడ్‌-19 వైర‌స్ క‌ట్ట‌డికి చేస్తున్న పోరుకు సిద్ధంగా ఉంచారు. రైల్వే హెల్త్ సర్వీసెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉంచుతూ కొత్త చొర‌వ తీసుకుంది.
కోవిడ్‌-19కు వ్య‌తిరేకంగా పోరాటంలో భారత రైల్వే ఈ క్రింది కార్యక్రమాలు చేపట్టింది:

1. బోగీల‌ను క్వారంటైన్, ఐసోలేషన్ కోచ్‌లుగా తీర్చిదిద్ద‌డంః కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా 5000 రైలు బోగీల‌ను క్వారంటైన్, ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చే ప‌నుల‌ను భార‌తీయ రైల్వే యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌డుతోంది. 5000 బోగీల‌ను క్వారంటైన్, ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చ‌డం ద్వారా అత్య‌వ‌స‌ర‌మైతే వైద్యం అందించే దాదాపు 80,000 ప‌డ‌క‌లు అందుబాటులోకి రానున్నాయి. భార‌తీయ‌ రైల్వే ఇప్ప‌టికే 3250 బోగీల మార్పిడి ప‌నుల‌ను పూర్తి చేసింది.

2. కోవిడ్‌-19 రోగుల చికిత్స‌కు 5000 ప‌డక‌ల కేటాయింపుః కోడిడ్‌-19 రోగుల‌కు చికిత్స‌ను అందించేందుకు వీలుగా భార‌తీయ రైల్వే త‌మ‌కు చెందిన 17 ప్ర‌త్యేక ఆసుపత్రులలో 5,000 పడకలు మరియు రైల్వే ఆసుపత్రులలో 33 హాస్పిటల్ బ్లాకులను గుర్తించి సిద్ధంగా ఉంచారు.
కోవిడ్ చికిత్స‌కు అనుగుణంగా ఉండేలా ఈ ఆస్పత్రులను, బ్లాకులను సిద్ధం చేస్తున్నారు.

3. క్వారంటైన్ కు వీలుగా 11,000 పడకలు: కోవిడ్‌-19 పోరాటానికి గాను భార‌త రైల్వే త‌మ సంస్థ‌ల‌లోని దాదాపు 11,000 ప‌డ‌క‌ల‌ను క్వారంటైన్‌కు వీలుగా అందుబాటులో ఉంచింది.

4. వైద్య పరికరాల లభ్యత-వెంటిలేటర్లు మరియు పీపీఈల అంత‌ర్గ‌త త‌యారీ: కోవిడ్‌-19 వ్యతిరేక‌ పోరాటానికి తగిన సంఖ్యలో వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ), వెంటిలేటర్లు మొదలైనవి అందుబాటులో ఉంచ‌డం చాలా కీలకం. ఈ నేప‌థ్యంలో వెంటిలేటర్లు, పీపీఈలు మరియు వైద్య పరికరాలను అవ‌స‌ర‌మైన‌న్ని సేకరించడానికి రైల్వే జోన్లు, రైల్వే ఉత్పత్తి యూనిట్లు ప‌లు చర్యలు తీసుకున్నాయి.

5. భార‌తీయ రైల్వే ఇప్పటికే వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) యొక్క అంతర్గత ఉత్పత్తిని ప్రారంభించింది. రోజుకు సుమారు 1000 పీపీఈలను ఉత్పత్తి చేసేందుకు గాను అస‌వ‌ర‌మైన స‌న్నాహ‌కాలు చేస్తోంది.

6. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కు రైల్వే ఆరోగ్య సేవలు: రైల్వే ఆసుపత్రులు / ఆరోగ్య కేంద్రాలలో వారి గుర్తింపు కార్డులు చూపించి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు  రైల్వే ఆరోగ్య సేవలు పొందేలా చొర‌వ తీసుకుంది. ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాలకు అనుబంధంగా కోచ్ ఫ్యాక్టరీలు, రైల్వే వర్క్‌షాప్‌లు, కోచింగ్ డిపోలలో స్థానికింగా పీపీఈల త‌యారీని చేప‌డుతున్నారు. దీనికి తోడు శానిటైజర్లు మరియు మాస్క్‌లు ఉత్పత్తిని కూడా చేప‌డుతున్నారు.(Release ID: 1612334) Visitor Counter : 204