ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కోవిడ్ -19 విషయంలో తప్పుడు, సంచలన సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం తక్షణావసరం – ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు

· మూఢనమ్మకాలు మరియు పుకార్ల కారణంగా నావల్ కరోనాపై చేస్తున్న పోరాటం బలహీన పడుతుంది

· వివిధ మతాల ప్రజలు, సామాజిక దూరం నిబంధన విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.

· వైద్య సేవలు అందిస్తున్న వారి భద్రత విషయంలో రాజీ పడకూడదు.

Posted On: 06 APR 2020 1:34PM by PIB Hyderabad

కోవిడ్ 19 కు వ్యతిరేకంగా మనం చేస్తున్న యుద్దాన్ని బలహీన పరిచేందుకు కారణమయ్యే మూఢ నమ్మకాలను గానీ, పుకార్లను గానీ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించకూడదని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని వైరస్ గా అభివర్ణించిన ఆయన, ఈ విషయంలో వెంటనే అప్రమత్తం కావలసిన అవసరం ఉందని, ప్రామాణిక సమాచారాన్ని విరివిగా వ్యాప్తి చేయడమే దీనికి పరిష్కారమని ఫేస్ బుక్ వేదికగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. సమస్య గురించి మన తప్పుడు అవగాహన ఉంటే వైరస్ మీద చేస్తున్న యుద్ధంలో గెలవలేమని తెలిపారు.

ఒక సంఘటన ఆధారంగా లేదా ఆ తర్వాత కొంత మంది తప్పుడు, వెకిలి చర్యల ఆధారంగా ఒక సమూహాన్ని అనుమానించడం సరైనది కాదని ఆయన చెబుతూ, అలాంటి సంఘటనలను ఖండించడంతో పాటు కారకులైన వారి మీద గట్టి చర్యలు తీసుకోవాలే తప్ప, ఒక మత సమూహాన్ని అనుమానించడం తగదని ఉపరాష్ట్రపతి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది దేశ భవిష్యత్తుకు మంచి కాదని, అందరం కలిసి ఆలోచించి, సవాళ్ళను అధిగమిస్తూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

 

 

ఫేస్ బుక్ పోస్టు పూర్తి పాఠం...

కోవిడ్ -19తో చేస్తున్న యుద్ధం ఒక బలమైన కనిపించని శత్రువుతో చేస్తున్న అలుపెరుగని పోరాటం. ఈ పోరులో మనందరి సహకారం, నిర్ణయాత్మక చర్యలు అవసరం. వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా మనమంతా కలిసి కట్టుగా ఈ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్రతిన బూనాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం కీలకమైనదే. ముఖ్యంగా పుకార్లు, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ప్రామాణిక సమాచారాన్ని విరివిగా వ్యాప్తి చేయడం అత్యంత కీలకం. ఈ పోరాటంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న వైద్యులను గౌరవించడం, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం మన లక్ష్యాన్ని సాధించే క్రమంలో కీలకమైనది.

గత శుక్రవారం వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ నివారణ కోసం తీసుకున్న చర్యల గురించి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు అడ్మినిస్ట్రేటర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో గౌరవ రాష్ట్రపతితో కలిసి పాల్గొన్నాను. ఇది సమగ్ర నివేదిక. కోవిడ్ -19 సవాలును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. పౌర సమాజంతో పాటు ప్రైవేట్ రంగం నుంచి వచ్చిన స్వీయ మద్ధతు మరింత భరోసా అందించింది. చాలా రాష్ట్రాల్లో రెడ్ క్రాస్ సంఘాలు అందిస్తున్న సేవలు మరింత విస్తృతమయ్యాయి. పరిమళించిన మానవత్వం పని వేగాన్ని పెంచడమే కాక పేదలు, వలస కార్మికుల కష్టాలను తీర్చేందుకు సాయం చేస్తోంది. పంట కాలం నేపథ్యంలో రైతుల ఆందోళనలు, సమస్యలు తీర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ధాన్యం సేకరణ కోసం అనేక దశల్లో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.

అంతా సవ్యంగానే సాగుతోంది అనుకుంటున్న సమయంలో కొన్ని సంఘటనలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తతో ఏర్పాటు చేసిన సామాజిక దూరం మార్గదర్శకాల విషయంలో బాధ్యతారహితంగా ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ ఘటన ఇందుకు ఓ ఉదాహరణ. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై ప్రతికూల ప్రభావాన్ని చూపెట్టిన ఈ సంఘటన యావత్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆందోళన కలిగించింది. అంతే కాదు మార్గదర్శకాలను నిర్దేశించడమే కాకుండా, వాటిని కఠినంగా అమలు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ అత్యవసర పరిస్థితి మీద మొత్తం సమాజం అవగాహన కలిగి ఉండడంతో పాటు వైరస్ వ్యాప్తి విషయంలో శాస్త్రీయ ఆధారాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. కులం, మతం, తరగతి, భాష, ప్రాంతాలు మరియు మతాల ఆధారంగా మొత్తం సామాజిక ప్రతిస్పందనను అరికట్టాల్సిన తగ్గించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో సామాజిక దూరం నిబంధనను కకూడా తేలిగ్గా తీసుకోకూడదు. ఈ విషయంలో అన్ని మత సమూహాల మధ్య అవగాహన ఉండడమే కాకుండా, ఈ సవాలును అధిగమించే వరకూ పెద్ద సమ్మేళనాలు లేకుండా జాగ్రత్తలు అవసరం. సమస్య తీవ్రత గురించి మనం తెలుసుకోలేకపోయినా లేదా తప్పుడు అవగాహన కలిగి ఉంటే వైరస్ మీద యుద్ధం గెలవడం సాధ్యం కాదు. మన మూఢ నమ్మకాలు లేదా విన్న ప్రతి విషయాన్ని నమ్మడం మన పోరాటాన్ని బలహీన పరుస్తుంది. అందుకే తప్పుడు సమాచార వ్యాప్తిని ముఖ్యంగా సామాజిక మాథ్యమాల్లో వైరస్ లా విస్తరిస్తోన్న దీని వ్యాప్తికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాపింపజేసే వారి గురించి స్పష్టంగా తెలుసుకోవడంతో పాటు ఇలాంటి సంఘటనలను పక్షపాత దృష్టితో లేదా సంకుచిత దృష్టితో చూడకూడదు. నిర్దేశించిన మార్గదర్శకాల విషయంలో అలాంటి దురదృష్టకర, కఠోర ఉల్లంఘనలు ఇకపై ఉండవని ఆశిద్దాం.

అన్ని అసమానతలకు వ్యతిరేకంగా దృఢసంకల్పంతో యుద్ధం చేస్తున్న వైద్య నిపుణుల మీద దాడులు మరింత కలిచి వేసే అంశం. కారణం ఏదైనప్పటికీ, ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఈ తరహా ధోరణులకు గట్టిగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు మినహాయిస్తే, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశం చేపడుతున్న కార్యక్రమాలు ఇప్పటి వరకూ మంచి ఫలితాలను అందించాయి. అయితే ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు. కఠినమైన పోరాటం చేయాల్సిన తరుణం. మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఈ మహమ్మారి విసురుతున్న సవాళ్ళతో మనందరం కలిసి పోరాడాలి. ఆలోచనలు మరియు చర్యల సమన్వయం, సంఘీభావం అనేది ప్రస్తుతావసరం. చుట్టు ముట్టే చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే చిన్న దీపాన్ని వెలిగించడం మంచిదన్న తెలుగు సూక్తిలో చెప్పినట్లుగా, మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరోనా చీకట్లను తరిమేందుకు ప్రతి ఒక్కరం ఉద్యుక్తులం కావలసిన తరుణమిది.


(Release ID: 1611575)