భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
కోవిడ్-19 నమూనా పరీక్షలను చేపట్టిన సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఎం.టి.ఈ.సి.హెచ్.
వ్యక్తిగత రక్షణ పరికరాలను సమకూర్చడం ద్వారా ఆరోగ్యసంరక్షణ నిపుణులకు కూడా సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఎం.టి.ఈ.సి.హెచ్. సహాయపడుతోంది.
Posted On:
04 APR 2020 12:23PM by PIB Hyderabad
కోవిడ్-19 నేపథ్యంలో ఆరోగ్యసంరక్షణ రంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. కోవిడ్-19 కోసం పరిమిత సంఖ్యలో పరీక్షా పరికరాలు అందుబాటులో ఉండడం అందులో ఒక సవాలు. ఇంతవరకు, ప్రయాణ చరిత్ర ఉన్న రోగులకు మాత్రమే భారతదేశంలో ప్రాధమికంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. అయితే, మిలియన్ జనాభాలో ఎంతమందికి పరీక్షలు నిర్వహించామనే విషయంలో ఈ సంఖ్య పెరగవలసిన అవసరం ఉంది.
పరీక్షలు చేసే సామర్ధ్యాన్ని పెంపొందించడం కోసం, వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి - సూక్ష్మజీవుల సాంకేతిక సంస్థ (సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఎం.టి.ఈ.సి.హెచ్.) కోవిద్-19 నమూనా పరీక్షలు చేపట్టడానికి ముందుకు వచ్చింది. సి.ఎస్.ఐ.ఆర్. కింద ప్రయోగశాలలు మరియు శాస్త్ర సాంకేతిక శాఖ (డి.ఎస్.టి.), జీవ సాంకేతిక విజ్ఞానశాఖ (డి.బి.టి.), అణుశక్తి శాఖ (డి.ఏ.ఈ.) లకు అనుబంధంగా ఉన్న ఇతర ప్రయోగశాలల ద్వారా కోవిడ్-19 పరీక్షలను అమలుచేయాలని, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (పి.ఎస్.ఏ.) జారీచేసిన ఆదేశాలకు, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) జారీ చేసిన సూచనలకు అనుగుణంగా ఈ చర్య చేపట్టారు.
" ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలలన్నింటినీ ఈ ప్రక్రియలో పాలు పంచుకునేలా చేయడం స్వాగతించదగిన చర్య. కోవిడ్-19 నమూనాలను పరీక్షించడంలో ఇది ఒక అపూర్వమైన మలుపు. ఎక్కువ సంఖ్యలో అనుమానిత రోగుల నమూనాలు పరీక్షించడానికి ఉపకరిస్తుంది. ప్రాధమిక దశలో, రోజుకు 50 నుండి 100 నమూనాలను పరీక్షించే సామర్ధ్యంతో పనిచేయాలని ఐ.ఎం.టి.ఈ.సి.హెచ్. భావిస్తోంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఈ సామర్ధాన్ని పెంపొందించే అవకాశం ఉంటుంది." అని చండీగఢ్ ఐ.ఎం.టి.ఈ.సి.హెచ్. డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ ఖోస్లా తెలియజేశారు.
కోవిడ్-19 కు అవసరమైన క్లినికల్ పరీక్షలు చేయడానికి ఈ సంస్థ తన సామర్ధ్యాలను పెంపొందించుకుంది. పరమాణు, సూక్ష్మ జీవ శాస్త్రం లో కూడా అవసరమైన నైపుణ్యాన్ని కలిగి ఉంది. ఈ పరీక్షలు చేపట్టే ముందు ప్రయోగశాలలు తగిన అన్ని జీవ భద్రత, జీవ రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతో, జీవ భద్రత స్థాయి (బి.ఎస్.ఎల్.)-3 సదుపాయంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు ఈ ప్రయోగశాలలో ఉన్నాయి. కొత్తగా నిర్మించిన బి.ఎస్.ఎల్.-2 వైరస్ ప్రయోగశాలలో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పోలీమేర్స్ చైన్ రియాక్షన్ (ఆర్.టి.-పి.సి.ఆర్.) పరికరం కూడా ఏర్పాటుచేశారు. క్లినికల్ నమూనాలను సాధ్యమైనంత త్వరగా పరీక్షించడానికి అవసరమైన తప్పనిసరి అనుమతులన్నీ తీసుకోవడం జరిగింది.
క్లినికల్ నమూనాలను పరీక్షించడంతో పాటు, రోగులకు చికిత్స నందించే సమయంలో ఆరోగ్య సంరక్షణ నిపుణులకు వైరస్ బారిన పడకుండా నిరోధించేందుకు వారికి సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఎం.టి.ఈ.సి.హెచ్. వ్యక్తిగత రక్షణ పరికరాలను (పి.పి .ఈ.) కూడా సమకూరుస్తోంది. స్థానిక పరిపాలనా యంత్రాOగానికీ, చండీగఢ్ లోని రెడ్ క్రాస్ యూనిట్ కూ, రవాణా మరియు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా సంస్థ తన సహకారాన్ని అందిస్తోంది.
*****
(Release ID: 1611034)
Visitor Counter : 212
Read this release in:
Assamese
,
English
,
Gujarati
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada