రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి నివారణకు పెద్దఎత్తున భారతీయ రైల్వేల సమగ్ర చర్యలు – మొత్తం యంత్రాంగం సమాయత్తం – 2020 మార్చి 5వ తేదీ నుంచి క్రమం తప్పకుండా రైల్వే, వాణిజ్య పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్, రైల్వే శాఖ సహాయ మంత్రి మరియు రైల్వేబోర్డు చైర్మన్ సమీక్ష ద్వారా రైల్వేల సన్నద్ధత పెంపు

దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల లభ్యమయ్యేలా చూసేందుకు సరుకుల రైళ్ళ ద్వారా 24 X 7 నిరంతర రవాణా మరియు పార్సెల్ రైళ్ళు నడపడం; సరఫరా శృంఖల తెగకుండా కొనసాగేందుకు 24.03.2020 నుంచి 02.04.2020 తేదీల మధ్య కాలంలో 4 లక్షలకు పైగా వ్యాగన్లతో నిత్యావసర సరుకుల తరలింపు

కోవిడ్-19 రోగుల కోసం రైల్వే ఆసుపత్రులలో దాదాపు 5000 ఐసోలేషన్ పడకలు మరియు రైల్వే సంస్థలు, భవనాలలో 11000 క్వారెంటైన్ పడకలు ఏర్పాటు చేయడం జరిగింది; అవి కాకుండా ముందస్తు చర్యగా 5000 రైల్వే కోచ్ లను క్వారెంటైన్/ఐసోలేషన్ కోసం 80000 పడకలుగా ఉపయోగపడే విధంగా మార్చడం జరిగింది. మొత్తం మీద అటువంటి 20000 కోచ్ లను గుర్తించడం జరిగింది.
మాస్కులు, శానిటైజర్ల వంటి వ్యక్తిగత సంరక్షణ సాధనాలను సంస్థలోనే స్వయంగా తయారు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 2020 ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు భారతీయ రైల్వేలు 287704 మాస్కులు , 25806 లీటర్ల శానిటైజర్లు తయారు చేసింది.

కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ సిబ్బందికి క్రమపద్ధతిలో చెల్లింపులు జరుగుతున్నాయి.


Posted On: 03 APR 2020 4:25PM by PIB Hyderabad

కోవిడ్ – 19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునే సమగ్ర చర్యల కోసం భారతీయ రైల్వేలు  పెద్ద ఎత్తున తమ యంత్రాంగాన్ని సమాయత్తం చేశాయి. పరిస్థితిని ఎదుర్కొనేందుకు రైల్వేల సన్నద్ధత స్థాయి గురించి రైల్వే, వాణిజ్య పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్,  రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ అంగడి మరియు రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ 2020 మార్చి 5వ తేదీ నుంచి క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతున్నారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి  జనరల్ మేనేజర్లు (జి ఎం లు) మరియు రైల్వే బోర్డు కీలక అధికారులతో ప్రతిరోజు చర్చలు జరుపుతున్నారు. దీనివల్ల పనిలో సమన్వయము, ఆదేశాల జారీ, ప్రతిపుష్టి తీసుకోవడం, సమీక్షాప్రగతితో పాటు సమాచార సందేశాలు సమర్ధవంతంగా ఇచ్చే వీలుఉంటుంది. 

ఈ దిగువ చర్యలకు ఉపక్రమించడం జరిగింది – 

1. దేశవ్యాప్తంగా నిరంతరం 24X7 సరుకులు రవాణాకు చర్యలు తీసుకోవడం ద్వారా సరఫరా శృంఖల తెగకుండా చూసేందుకు  24.03.2020 నుంచి 02.04.2020 మధ్య కాలంలో 4 లక్షలకు పైగా వ్యాగన్లలో సరుకులను సరఫరా చేయడం జరిగింది.  వాటిలో 2.23 లక్షలకు పైగా వ్యాగన్లలో  దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పంపిన ఆహారధాన్యాలు, ఉప్పు, చక్కర, పాలు, వంట నూనెలు, ఉల్లిపాయలు, పళ్ళు మరియు కూరగాయలు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, ఎరువులు మొదలగునవి కూడా ఉన్నాయి.  

జాతి జనులకు నిత్యావసర సరుకుల నిలిచిపోకుండా వివిధ గూడ్సు షెడ్లు, స్టేషన్లు మరియు నియంత్రణ కార్యాలయాలలో భారతీయ రైల్వే సిబ్బంది 24/7 పద్ధతిలో పని చేస్తున్నారు.  లోకో పైలెట్లు (ఇంజను డ్రైవర్లు) మరియు గార్డులు రైళ్లను సమర్ధవంతంగా నడుపుతున్నారు.  సరుకులు తీసుకెళ్ళే రైళ్ళు ఎలాంటి అవరోధాలు లేకుండా నడిపేందుకు వీలుగా ట్రాక్, సిగ్నల్, ఓవర్ హెడ్ పరికరాలు, ఇంజన్లు, కోచులు మరియు వ్యాగన్లతో పాటు మౌలిక సదుపాయాలను ప్రయాణానికి అనువైన రీతిలో సిద్ధంగా ఉంచడంలో సిబ్బంది కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. 

సరుకులు తీసుకెళ్ళే గూడ్సు రైళ్ళ నిర్వహణ,  వ్యాగన్లలో గూడ్స్ షెడ్లు / పార్సెల్ సైడింగుల వద్ద లోడింగ్ / అన్ లోడింగ్ పనుల సజావుగా నిర్వహించడంలో జోనల్ రైల్వే లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పై అధికారుల దృష్టికి తెచ్చే ఏర్పాటు చేశారు.  ఇందుకోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులు రైల్వే అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటూ ఉంటారు. 

2. పార్సెల్ రైళ్ళ రాకపోకలు – కోవిడ్-19ను ఎదుర్కొనే చర్యల నేపధ్యంలో  మందుల సరఫరా, వైద్య చికిత్సా సామగ్రి, ఆహారం మొదలగు నిత్యావసరాలు చిన్న సైజు పార్సెళ్ళలో రవాణా చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఈ కీలక అవసరాన్ని తీర్చడానికి పెద్ద సంఖ్యలో భారీ రవాణా జరిగేలా ఈ – కామర్స్ పదార్ధాలు మరియు రాష్ట్రప్రభుత్వాలతో సహా ఇతర వినియోగదారుల కోసం  భారతీయ రైల్వేలు రైల్వే పార్సెల్ వ్యాన్లను ఏర్పాటు చేశాయి. 

3. విలంబ శుల్కం మరియు రేవు సుంకం నియమాలలో సడలింపు; కరోనా వైరస్ వ్యాప్తిని ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి అనివార్య పరిస్థితి నిబంధనను ఆవాహన చేయడం ద్వారా విలంబ శుల్కం మరియు రేవు సుంకం నియమాలను సడలించడం జరిగింది. 

4. ఖాళీ వ్యాగన్లు, చదరపు వ్యాగన్లపై లాగుడు సుంకం లేదు;   సరుకుల రవాణా ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా జరిగేందుకు 24.03.2020 నుంచి 30.04.2020 వరకు తిరిగే  ఖాళీ వ్యాగన్లు, చదరపు వ్యాగన్లపై ఎలాంటి లాగుడు సుంకం విధింపు రద్దు చేశారు.  

5.  కేంద్ర నియంత్రణ విభాగం ఏర్పాటు: 27.03.2020 నుంచి సాధారణ పౌరులకు, రైల్వే పాలనాధికారులకు మధ్య అడ్డంకులు లేకుండా  సమాచార మార్పిడి, సందేశాలు పంపేందుకు వీలుగా రైల్వే బోర్డులో డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేస్ఖనలో కేంద్ర నియంత్రణ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియంత్రణ విభాగం రేయింబవళ్ళు పనిచేస్తుంది. రైల్వే హెల్ప్ లైన్లు --139 & 138 లకు వచ్చే అన్ని ఫోన్ కాల్స్ కు వారు బదులిస్తారు. రైల్వే వినియోగదారుల నుంచి ఈ మెయిల్ రూపంలో  వచ్చే ఫిర్యాదులు, సూచనలపై సత్వర స్పందన కోసం railmadad@rb.railnet.gov.in మెయిల్ ఐ డి ఏర్పాటు చేశారు. 

6. కోవిడ్-19 రోగుల క్వారెంటైన్ కోసం 11000 పడకలను సిద్ధం చేయడంతో పాటు కోవిడ్-19 రోగులకు చికిత్సకోసం ప్రత్యేకంగా కేటాయించిన  17 ఆసుపత్రులతో పాటు 33 ఆసుపత్రి బ్లాకులలో దాదాపు 5000 ఐసోలేషన్ పడకలను ప్రత్యేకంగా గుర్తించి ఉంచడం  జరిగింది. ఈ ఆసుపత్రులను, బ్లాకులను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. 

క్వారెంటైన్/ఐసోలేషన్ సౌకర్యాలుగా రైల్వే కోచుల మార్పు:  దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కోసం క్వారెంటైన్/ఐసోలేషన్ సౌకర్యాలుగా 5000 రైల్వే కోచ్ లను మార్చడం ద్వారా 80000 పడకలు సిద్ధం చేస్తున్నారు. డిజైన్ రూపకల్పన, నమూనా ఆమోదానికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నందువల్ల జోనల్ రైల్వే అధికారులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు.  అవసరమైతే 3.2 లక్షల పడకలు ఏర్పాటు చేసేందుకు వీలయ్యే 20000 కోచులను గుర్తించడం జరిగింది. 

7. వైద్య చికిత్సకు అవసరమైన ఉపకరణాలు,  వ్యక్తిగత సంరక్షణ సాధనాలు మరియు వెంటిలేటర్ల సేకరణ; కోవిడ్ -19పై జరిపే పోరాటంలో తగిన సంఖ్యలో వ్యక్తిగత సంరక్షణ సాధనాలు (పిపిఇలు)  మరియు వెంటిలేటర్ల మొదలగు చికిత్సా సామాగ్రి లభ్యత చాలా క్లిష్టమైనది. కోవిడ్ -19పై పోరాటానికి తమ అవసరాలకు సరిపడా వెంటిలేటర్లు, పిపిఇలు మరియు వైద్య చికిత్సా సామగ్రిని సేకరించడానికి రైల్వే జోన్లు మరియు ప్రొడక్షన్ యూనిట్లు చర్యలు తీసుకున్నాయి.   

పనిచేసే చోట కరోనా నివారణ చర్యలు:   నిత్యావసరాల సరఫరా నిరంతరం సాగాల్సి ఉన్నందున సరుకుల రవాణా పనులు 24X7 పద్దతిలో జరుగుతున్నాయి. అందువల్ల సిబ్బంది రేయింబవళ్ళు పని చేస్తున్నారు. సిబ్బంది భద్రతతో పాటు వారి నైతికబలాన్ని పెంపొందించడానికి పనిచేసేచోట ఈ దిగువ ఏర్పాట్లు జరిగేలా చూస్తున్నారు:  

  1. విధులకు హాజరయ్యే సిబ్బంది అందరికీ మాస్కులు మరియు శానిటైజర్లు అందజేస్తున్నారు. కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా వాటిని ఇస్తున్నారు. రైల్వే వర్క్ షాపులు, కోచింగ్ డిపోలు మరియు ఆసుపత్రులు అవసరాలకు తగిన విధంగా సిద్ధమై తమకు వచ్చే సరఫరాతో పాటు స్థానికంగా శానిటైజర్లు మరియు మాస్కులు అదనంగా ఉత్పత్తి చేస్తున్నయి. 

  2. పనిచేసే చోట్లు అన్నింటి వద్ద సబ్బు, నీళ్ళు మరియు కడుక్కొనే సౌకర్యాలు కల్పించారు.  స్థానిక వినూత్న కల్పనలతో చేతులు కడిగే ఏర్పాటు చేశారు. 

  3. సామాజిక దూరం ఉండేలా చూశారు. ట్రాక్ సిబ్బంది, ఇంజను డ్రైవర్లు మొదలగు వారికి జాగృతి కలుగజేస్తున్నారు. 

 

8. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ రైల్వే ఆరోగ్య సేవల లభ్యతకు చర్యలు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ రైల్వే ఆరోగ్య సేవలు లభ్యమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే ఆసుపత్రులు / ఆరోగ్య కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ గుర్తింపు కార్డు చూపి రైల్వే ఆరోగ్య సేవలు పొందవచ్చు. 

9.  ప్రధానమంత్రి అత్యవసర సహాయ నిదికి (పి ఎం కేరెస్ ఫండ్) రైల్వే ఉద్యోగుల విరాళం రూ. 151 కోట్లు.  రైల్వే ఉద్యోగులు తమ ఒక రోజు వేతనానికి సరిపడే మొత్తం రూ. 151 కోట్లు ప్రధానమంత్రి అత్యవసర సహాయ నిదికి విరాళంగా ఇస్తారు.  

10.  కాంట్రాక్టు పద్ధతిలో పారా మెడికల్ సిబ్బంది సేవలు:  పరిస్థితిని ఎదుర్కోవడానికి వీలుగా అవసరమైన అదనపు పారామెడికల్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకునే అధికారం జనరల్ మేనేజర్లు / సి ఏ ఓలు / డి ఆర్ ఎంలకు కల్పించారు. 

11. ఐ ఆర్ సి టి సి వంట స్థావరాల నుంచి నిరుపేదలకు ఉచితంగా ఆహారం సరఫరా:  2020 మార్చి 28వ తేదీ నుంచి రైల్వే రక్షణ దళం సిబ్బంది సహాయంతో నిరుపేదలకు ఐ ఆర్ సి టి సి వంట స్థావరాల నుంచి నిరుపేదలకు ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నారు.  దేశవ్యాప్తంగా 25 ప్రదేశాలలో దాదాపు 2.25 లక్షల భోజనాలు పంపిణీ చేశారు. 

12.  కాంట్రాక్టర్లకు మరియు సరఫరాలు చేసేవారికి డిజిటల్ చెల్లింపులు: విధులకు హాజరైన అతి తక్కువమంది సిబ్బందితో డిజిటల్ ఐ టి ఆధార వ్యవస్థ ద్వారా అత్యవసర చెల్లింపులన్నీ నిరాఘాటంగా జరుగుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు అత్యవసర చెల్లింపులన్నీ క్రమం తప్పకుండా విడుదల చేయడం జరుగుతోంది. చెల్లింపుల ప్రక్రియ సరళీకృతం చేయడానికి బిల్లులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లిస్తున్నారు. 

13. కాంట్రాక్టు కార్మికులకు చెల్లింపులు మరియు ఆశ్రయానికి ఏర్పాట్లు:  లాక్ డౌన్ సమయంలో గృహ నిర్వహణ/ సేవల కాంట్రాక్టులో ఉన్న కాంట్రాక్టు / అవుట్ సోర్సు కార్మికులకు క్రమపద్ధతిలో చెల్లింపులు చేయడం జరుగుతోంది.  లాక్ డౌన్ సమయంలో ఆఫీసులో నిలిచిపోయిన రైల్వే ఉద్యోగులకు, కాంట్రాక్టు పనివారికి ఆశ్రయం మరియు ఆహారం ఏర్పాట్లు చేయడం జరిగింది. 



(Release ID: 1610830) Visitor Counter : 331