శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ వ్యాప్తి నియంత్రణ విధుల్లో ఉన్న పోలీసులకు
హ్యాండ్ శానిటైజర్లను తయారు చేసి పంపిణీ చేసిన ఏఆర్‌సీఐ
Posted On:
03 APR 2020 5:38PM by PIB Hyderabad
మార్కెట్లో హ్యాండ్ శానిటైజర్ల కొరత నేపథ్యంలో హైదరబాద్ కేంద్రంగా పని చేస్తున్న
ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ & న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ)
డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల మేరకు హ్యాండ్ శానిటైజర్లను తయారు చేసి పోలీసు సిబ్బందికి, విద్యార్థులకు ఇతర సిబ్బందికి పంపిణీ చేసింది. శాస్ర్త, సాంకేతిక శాఖలో స్వయంప్రతిపత్తి కలిగిన పరిశోధన మరియు అభివృద్ధి సంస్థగా ఏఆర్‌సీఐ సేవలందిస్తోంది. కోవిడ్‌పై పోరాడుతున్న పోలీసులతో పాటు ఇతర సిబ్బందికి శానిటైజర్ కొరత రాకూడదన్న తలంపుతో సంస్థకు చెందిన
శాస్త్రవేత్తలు, విద్యార్థులు మరియు సిబ్బంది బృందం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు 40 లీటర్ల శానిటైజర్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ఆలోచన వచ్చిన కేవలం ఆరు గంటల వ్యవధిలోనే సిబ్బంది శానిటైజర్‌ను తయారు చేసి ప్యాకింగ్‌తో పాటు పంపిణీ చేయడం విశేషం. కోవిడ్ వ్యాప్తి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు, సామాజిక దూరాన్ని అమలు చేయడానికి అవిశ్రాంతంగా పని చేస్తున్న పోలీసు సిబ్బంది శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్ జి. పద్మనాభం సంస్థలోని ఒక బృందానికి శానిటైజర్‌ను తయారు చేసి పంచాలని సూచించారు. ఈ మేరకు చాలా తక్కువ సమయంలో గణనీయమైన పరిమాణంలో శానిటైజర్‌ను తయారు చేసి రాచకొండ కమిషనరేట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌కు ఏఆర్‌సీఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్.విజయ్ అందజేశారు. అసాధారణ పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల మేలు కోరుతూ ఏఆర్‌సీఐ శాస్త్రవేత్తలు శానిటైజర్‌ను అందించడాన్ని డిప్యూటీ పోలీస్ కమిషనర్ అభినందించారు. ఎక్కువ మంది సిబ్బందికి తోడ్పాటు అందించేలా వీలైతే మరింత ఎక్కువ పరిమాణాంలో శానిటైజర్‌ను అందించాలని అభ్యర్థించారు. పెద్ద మొత్తంలో శానిటైజర్‌ను ఉత్పత్తి చేయటానికి, 100 మి.లీ. బాటిళ్లలో దీనిని సులభంగా పంపిణీ చేయడానికి గాను ఏఆర్‌సీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసు సిబ్బంది వారి జేబుల్లో సులభంగా తీసుకెళ్లేందుకు వీలుగా దీనిని రూపొందించారు. ప్రతి పోలీసు సిబ్బందికి ఒక్క సీసా శానిటైజర్ కనీసం ఒక వారం కన్నా ఎక్కువగా ఉపయోగపడనుంది.
కోవిడ్ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు దేశంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు తమ తమ సొంత గ్రామాలకు, పట్టణాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణాలు చేసే వారిలో చాలా మందికి బాటిల్ హ్యాండ్ శానిటైజర్లు మరియు ఫేస్ మాస్క్ లను పంపిణీ చేశారు. దీనికి తోడు సంస్థలోని శాస్త్రవేత్తలు, భద్రతా సిబ్బంది, క్యాంటిన్‌లో పని చేసే వారితో పాటు సాధారణ ప్రాంతాలు, ప్రవేశ ద్వారాల వద్ద ఉండే సిబ్బందికి కూడా శానిటైజర్‌లను పంపిణీ చేశారు.
(Release ID: 1610779)
Visitor Counter : 156