ప్రధాన మంత్రి కార్యాలయం

వేల్స్ రాజుతో టెలిఫోన్ లో ప్రధానమంత్రి సంభాషణ

Posted On: 02 APR 2020 8:36PM by PIB Hyderabad

రాజకుటుంబానికి చెందిన వేల్స్ రాజుతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గురువారంనాడు టెలిఫోన్ లో మాట్లాడారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారి గురించి ఇద్దరు నాయకులు విస్తృతంగా మాట్లాడుకున్నారు. యుకెలో గత కొద్ది రోజుల్లో జరిగిన భారీ ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి సానుభూతి ప్రకటించారు. అలాగే ఇటీవల ఏర్పడిన అనారోగ్యం నుంచి రాజు కోలుకోవడం పట్ల సంతృప్తి ప్రకటిస్తూ దీర్ఘకాలం పాటు ఆయన ఆరోగ్యంగా  ఉండాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

యుకెలోని భారత సంతతి ప్రజల సేవలను రాజు కొనియాడారు. ప్రధానంగా నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన పలువురు సభ్యులు కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అలాగే ఈ సంక్లిష్ట సమయంలో యుకెలోని భారత మత, సామాజిక సంస్థలు నిస్వార్ధంగా అందిస్తున్న సేవల గురించి రాజు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతదేశంలో చిక్కుకుపోయిన యుకె పౌరులకు అందిస్తున్న సహాయం, సౌకర్యాల కల్పన పట్ల ప్రధానమంత్రికి రాజు కృతజ్ఞతలు తెలిపారు.  

ఆయుర్వేదంపై రాజు తరచుగా ఆసక్తి కనబరచడం పట్ల ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. స్వల్ప నిడివి గల యానిమేషన్ వీడియోల ద్వారా యోగాసనాలను బోధించడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇళ్లలోనే అందుబాటులో ఉన్న సాంప్రదాయిక విధానాలను ప్రాచుర్యంలోకి తేవడానికి భారతదేశం చూపుతున్న చొరవను ప్రధానమంత్రి వివరించారు. సాధారణ పరిస్థితుల్లోనే కాకుండా ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆరోగ్యం, మానవ మనుగడకు ఆ చొరవలు ఎంతో దోహదపడతాయని రాజు కొనియాడారు.



(Release ID: 1610566) Visitor Counter : 187