రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
సంక్షోభ సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సీపెట్ (CIPET) సంస్థ
Posted On:
01 APR 2020 12:58PM by PIB Hyderabad
రసాయనాలు మరియు పెట్రో రసాయనాల శాఖ పరిధిలోని కేంద్ర ప్లాస్టిక్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సంస్థ (CIPET) కోవిడ్ – 19 మహమ్మారి ప్రబలిన ఈ సంక్షోభ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న తమ కేంద్రాల ద్వారా సామాజిక శ్రేయస్సు కోసం ఔదార్యంతో కార్యక్రమాలు చేపడుతున్నది.
ఈ కృషిలో భాగంగా గ్వాలియర్ లోని సీపెట్ కేంద్రం తమ నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని జిల్లా మేజిస్ట్రేట్ /కలెక్టర్ కు అప్పగించింది. పారా మెడికల్ సిబ్బంది సేవలకు తోడుగా సీపెట్ సిబ్బందిని మరియు అధికారులను 24x7 సేవలు అందించడానికి నియమించడం ద్వారా 72 పడకలున్న క్వారెంటైన్ కేంద్రాన్ని సృష్టించారు.
అదేవిధంగా సీపెట్ భువనేశ్వర్ కేంద్రం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు, శానిటైజర్లు, రోగక్రిమినాశకాలు మరియు నీళ్ళ సీసాలు పంపిణీ చేసింది. అంతేకాకుండా పరిశుభ్రత పాటించడం గురించి ప్రజలలో జాగృతి కలుగజేసేందుకు ప్రదర్శనలు ఇస్తోంది. భువనేశ్వర్ కేంద్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక సూత్రాల ప్రకారం మాస్కులు తయారు చేసి కోవిడ్-19 నుంచి కాపాడుకోవడం కోసం భద్రతాసిబ్బందికి, గృహనిర్వహణ సిబ్బందికి పంపిణీ చేసింది.
సీపెట్ ఉద్యోగులు స్వచ్చంధంగా ఒక రోజు వేతనం కోతకు అంగీకరించడం ద్వారా మొత్తం సంస్థ తరపున PM CARES నిధికి రూ. 18 లక్షల విరాళం ఇచ్చారు.
అదేవిధంగా వివిధ సీపెట్ కేంద్రాల ద్వారా ఆపన్నులకు, పేదలకు ఆహారం పంపిణీకి ప్రత్యేక యత్నాలు చేస్తున్నారు.
(Release ID: 1610016)
Visitor Counter : 104