సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ టెలివిజ‌న్ స్వ‌ర్ణ‌యుగానికి రంగం సిద్ధం

లాక్డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మ‌నోరంజ‌కాన్ని అందించేందుకు ప‌లు జ‌నాద‌ర‌ణ క‌లిగిన దారావాహిక‌ల పునఃప్ర‌సారం
కేబుల్ ఆప‌రేట‌ర్లు డీడీ, ఎల్ఎస్‌టీవీ, ఆర్ఎస్‌టీవీ ప్ర‌సారాలు త‌ప్ప‌నిస‌రిః స‌ర్కారు

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2020 8:32PM by PIB Hyderabad

దేశంలో లాక్డౌన్ అమ‌ల‌వుతున్న వేళ‌ ప్ర‌జ‌లు ఇండ్లల్లో ఉండ‌డాన్ని మ‌రింత ఆనంద‌దాయ‌కంగా మ‌లిచేందుకు గాను స‌ర్కారు చ‌ర్య‌లు చేప‌ట్టింది. టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో స్వ‌ర్ణ యుగంగా నిలిచిన మేటి దారావాహిక‌లను దూర‌ద‌ర్శ‌న్‌లో (డీడీలో) తిరిగి ప్ర‌సారం చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ మొద‌టి వారం నుంచి డీడీ భార‌తిలో మ‌ధ్యాహ్నం వేళ‌ చంద్ర ప్ర‌కాశ్ ద్వివేది ద‌ర్శ‌క‌త్వం వహించిన చాణిక్య (47 ఎపిసోడ్‌లు), ఉప‌నిష‌త్ గంగా (52 ఎపిసోడ్‌లు) దారావాహిక‌ల‌ను ప్ర‌సారం చేయ‌నున్నారు. చిన్నారుల‌కు మ‌నోరంజ‌కంగా ఉండేందుకు గాను ఏప్రిల్ ప్రారంభం నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు డీడీ నేష‌న‌ల్ నెట్‌వ‌ర్క్ చాన‌ల్‌లో గంట‌పాటు శ‌క్తిమాన్ దారావాహిక‌ను ప్ర‌సారం చేయ‌నున్నారు. స‌కుటుంబ స‌ప‌రివారానికి మ‌నోరంజ‌కంగా ఉండేలా ఇదే చాన‌ల్‌లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి శ్రీ‌మాన్ శ్రీ‌మ‌తి హాస్య కార్య‌క్రమాన్ని ప్రసారం చేయ‌నున్నారు. దీనికి తోడు డీడీ నేష‌న‌ల్ చానెల్‌లో కృష్ణ‌కాళి (18 ఎపిసోడ్‌లు) దారావాహిక‌ కూడా ప్ర‌సారం కానున్న‌ట్టుగా స‌మాచార ప్ర‌సార శాఖ తెలిపింది.
ఇప్పటికే ప్రజాదరణ సీరియళ్ల ప్రసారం..
ఈ నెల 28 నుంచి రామానంద్ సాగ‌ర్ రూపొందించిన రామాయ‌ణ్ రోజుకు రెండు పూట‌లా డీడీ నేష‌న‌ల్ నెట్‌వ‌ర్క్ చానెల్‌లో ప్ర‌సారమ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి తోడు బ్యోమ్‌కేష్ బ‌క్షి (52 ఎపిసోడ్‌లు), షారూక్ ఖాన్ న‌టించిన స‌ర్క‌స్ (19 ఎపిసోడ్‌లు), హ‌మ్ హైన్ నా (60 ఎపిసోడ్‌), తూ థోతా మై మైనా (26 ఎపిసోడ్‌) దారావాహిక‌లు డీడీ నేష‌న‌ల్ నెట్‌వ‌ర్క్ చానెల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.
డీడీ చానెళ్ల‌ను ప్ర‌సారం తప్పనిసరి..
దేశంలోని డీటీహెచ్‌, కేబుల్ ఆప‌రేట‌ర్లు దూర‌ద‌ర్శ‌న్ లోక్‌స‌భ చానెల్‌, దూర్‌ద‌ర్శ‌న్ రాజ్య‌స‌భ చానెల్తో స‌హా అన్ని డీడీ చానెళ్లను విధిగా ప్ర‌సారం చేయాల‌ని స‌మాచార ప్ర‌సార‌శాఖ మ‌రోసారి పున‌రుద్ఘాటించింది. కేబుల్ టెలివిజ‌న్ నెట్‌వ‌ర్క్స్ (నియంత్ర‌ణ‌) చ‌ట్టం ప్ర‌కారం ఇది త‌ప్ప‌నిస‌రి అని తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీడీ చానెళ్ల ప్రసారాలు అందించని వారిపై ఈ చ‌ట్టంలోని సెక్ష‌న్ 11,12 మ‌రియు 18 కింద చ‌ట్ట‌పరమైన చ‌ర్య‌లు తీసుకోబ‌డుతాయ‌ని తెలిపింది. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు త‌మ‌కు ఇష్ట‌మైన డీడీ చానెళ్ల ప్ర‌సారాల‌ను కేబుల్ ఆప‌రేట‌ర్ల ద్వారా పొంద‌లేక‌పోతున్న  నేపథ్యంలో సదరు వ్యక్తులు స‌మీపంలోని దూర‌ద‌ర్శ‌న్ కేంద్రం స్టేష‌న్ డైరెక్ట‌ర్‌కు గానీ లేదా ddpb.inform[at]gmail[dot]comకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాల‌ని స‌మాచార ప్ర‌సార శాఖ సూచించింది.


(రిలీజ్ ఐడి: 1609435) సందర్శకుల సూచీ సంఖ్య : : 129
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil