ప్రధాన మంత్రి కార్యాలయం

సామాజిక‌ సంక్షేమ సంస్థ‌ల‌తో ముచ్చ‌టించిన ప్ర‌ధాన‌మంత్రి

మాన‌వాళి సేవ‌లో సామాజిక సంక్షేమ సంస్థ‌ల అంకిత భావం,చిత్త‌శుద్ధిని ప్ర‌శంసించిన ప్ర‌ధాన‌మంత్రి
పేద‌లు, అవ‌స‌ర‌మైన వారికి స‌హాయం అందించ‌డం కొన‌సాగించాల్సింది పిలుపునిచ్చిన ప్ర‌ధాన‌మంత్రి
కోవిడ్ -19 స‌వాలును అదిగ‌మించేందుకు స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ‌కాలిక దార్శ‌నిక‌త అవ‌స‌ర‌మ‌న్న ప్ర‌ధానమంత్రి
ప్ర‌స్తుత స‌వాలును ఎదుర్కోవ‌డంలో దేశం మొత్తం అద్భుత సంయ‌మ‌నాన్ని, శ‌క్తిని, తిరిగి మామూలు స్థితికి చేర‌కునేందుకు అవ‌స‌ర‌మైన ప‌ట్టుదల‌నూ చూపుతోంది: ప‌్ర‌ధాన‌మంత్రి
సంక్లిష్ట స‌మ‌యంలో మార్గ‌నిర్దేశం చేయ‌డంలో ప్ర‌ధాన‌మంత్రి నాయ‌క‌త్వాన్ని ప్ర‌శంసించిన సామాజిక సంక్షేమ సంస్థ‌ల ప్ర‌తినిధులు.

Posted On: 30 MAR 2020 3:15PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సామాజిక‌ సంక్షేమానికి ప‌నిచేస్తున్న వివిధ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు.
ప్ర‌స్తుత కోవిడ్ -19 స‌వాలును ఎదుర్కోవ‌డంలో దేశం మొత్తం అద్భుత సంయ‌మ‌నాన్ని, శ‌క్తిని, తిరిగి మామూలు స్థితికి చేర‌కునేందుకు అవ‌స‌ర‌మైన ప‌ట్టుదల‌నూ చూపుతోంద‌ని ప‌్ర‌ధాన‌మంత్రి అన్నారు.
పేద‌లు , అణ‌గారిన వ‌ర్గాల వారికి సేవ‌చేయ‌డమే, దేశానికి సేవ‌చేయ‌డానికి గ‌ల అత్యుత్త‌మ మార్గ‌మ‌ని మ‌హాత్మా గాంధీ చెబుతూ ఉండేవార‌ని ప్ర‌ధాన‌మంత్రి గుర్తు చేశారు. మాన‌వాళి సేవ‌లో పాల్గొంటున్న వివిధ సంస్థ‌ల అంకిత భావం, చిత్త‌శుద్ధిని ఆయ‌న కొనియాడారు.
ఈ సంస్థ‌ల‌కు మూడు ప్ర‌త్యేక‌త‌లున్నాయ‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, అవి మాన‌వీయ విధానం, పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌ను చేరుకోగ‌ల‌గ‌డం, ప్ర‌జ‌ల‌తో సంబంధాలు,సేవాభావం అని అన్నారు. దీనివ‌ల్ల వారిపై ప‌రిపూర్ణ విశ్వాసం ఉంటోంద‌ని చెప్పారు. దేశం మున్నెన్న‌డూ ఎదుర్కొన‌ని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న‌ద‌ని, అందువ‌ల్ల ఈ సంస్థ‌ల పేవ‌లు, వారి వ‌న‌రులు ఇంత‌కు ముందెన్న‌డూ లేని రీతిలో అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. ఈ సంస్థ‌లు పేద‌ల‌ మౌలిక అవ‌స‌రాలు తీర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించ‌గ‌ల‌వ‌న్నారు. అలాగే ఈ సంస్థ‌లు త‌మ‌కుగ‌ల వైద్య స‌దుపాయాల‌ను, వలంటీర్ల‌ను అవ‌స‌ర‌మున్న వారికి , పేషెంట్ల‌కు సేవ‌చేయ‌డానికి వినియోగించ‌వచ్చ‌ని చెప్పారు. ప్ర‌స్తుత స‌వాలును అధిగ‌మించేందుకు దేశానికి ప్ర‌స్తుతం స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ కాలిక దార్శ‌నిక‌త‌ అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.
మూఢ‌న‌మ్మ‌కాల‌ను , త‌ప్పుడు స‌మాచారాన్ని తిప్పికొట్ట‌డంలో , సామాజిక సంక్షేమ సంస్థ‌ల‌కు కీల‌క పాత్ర ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

విశ్వాసాల పేరుతో ప్ర‌జ‌లు ప‌లు చోట్ల గుమికూడి, సామాజిక దూరానికి  సంబంధించిన నియ‌మాల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతున్నార‌ని , అందువల్ల‌, వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు సామాజిక దూరం పాటించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు.
సామాజిక సంక్షేమ సంస్థ‌ల ప్ర‌తినిధులు, ప్ర‌స్తుత సంక్లిష్ట ప‌రిస్థితుల‌లో దేశానికి  స‌మ‌ర్ధ‌త‌తో మార్గ‌నిర్దేశం చేస్తున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని ప్ర‌శంసించారు.  వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం తీసుకున్న సానుకూల చ‌ర్య‌ల‌ను వారు అభినందించారు.  పిఎం- సిఎఆర్ ఇఎస్ నిధికి వారు త‌మ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో త‌మ సిబ్బంది పూర్తిగా దేశ సేవ‌లో నిమ‌గ్న‌మౌతుంద‌ని వారు హామీ ఇచ్చారు.. ప్ర‌స్తుత స‌వాలును ఎదుర్కొనేందుకు డిజిట‌ల్ ప‌ద్ధ‌తుల‌లో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం, నిత్యావ‌స‌రాల పంపిణీ, ఆహార పొట్లాలు, శానిటైజ‌ర్లు, మందుల పంపిణీ, అవ‌స‌ర‌మైన వారికి వైద్య స‌మాయానికి చేప‌డుతున్న ప్ర‌స్తుత చ‌ర్య‌లను వారు వివ‌రించారు.

 ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేయ‌డానికి తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల ప్రాధాన్య‌త‌ను, పేద‌ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక అవ‌స‌రాల క‌ల్ప‌న‌, వైద్య స‌దుపాయాల క‌ల్ప‌న‌,కోవిడ్ -19 ప్ర‌భావిత పేషెంట్ల‌కు సేవ‌లు అందించేందుకు వ‌లంటీర్లను స‌మ‌కూర్చ‌డం వంటి వాటి ప్రాధాన్య‌త‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ప్పుడు స‌మాచారాన్ని ఎదుర్కోవ‌డానికి వైద్య ప‌ర‌మైన‌, శాస్త్రీయ‌మైన స‌మాచారాన్ని అందించాల్సిన అవ‌స‌రాన్న ప్ర‌ధాన‌మంత్రి గుర్తుచేశారు. అలాగే కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో అంద‌రూ క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

ఈ స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి స‌ల‌హాదారు,సిఇఒ ,నీతిఆయోగ్ కూడా పాల్గొన్నారు.



(Release ID: 1609297) Visitor Counter : 168