ప్రధాన మంత్రి కార్యాలయం

మొత్తం దేశం 21 రోజుల పాటు పూర్తిగా లాక్ డౌన్ పాటించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. 

కోవిడ్-19 పై ప్రధానమంత్రి జాతి నుద్దేశించి ప్రసంగించారు. 

Posted On: 24 MAR 2020 11:01PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి చేస్తున్న కృషిలో భాగంగా ఈ అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశం మొత్తం సంపూర్ణంగా లాక్ డౌన్ పాటించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 
 
జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా టెలివిజన్ లో మాట్లాడుతూ, అత్యుత్తమమైన వైద్య సదుపాయాలున్న దేశాలు సైతం ఈ వైరస్ ను కట్టడి చేయలేక పోయాయనీ, దీన్ని తగ్గించడానికి సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. 

" ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈ మహమ్మారి ముందు ఎంత నిస్సహాయంగా ఉండిపోయాయో మీరు కూడా గమనించారు.   అంటే, ఈ దేశాలు తగిన కృషి చేయటం లేదా? లేక వారికి వనరుల కొరత ఉందా?  ఎంతగా ఎక్కువగా కృషి చేసినప్పటికీ, కరోనా వైరస్ అంత వేగంగా విస్తరిస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఆ దేశాలకు చాలా కష్టంగా ఉంది. 

గత రెండు నెలలుగా ఈ దేశాల్లో సంఘటనల విశ్లేషణను గమనిస్తే, ఈ కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోడానికి - సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమన్న నిపుణుల అభిప్రాయం రుజువౌవుతోంది" అని ఆయన చెప్పారు.  

ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిని ప్రధానమంత్రి హెచ్చరిస్తూ - " కొంత మంది నిర్లక్ష్యం , కొంత మంది చెడు భావనలు, మిమ్మల్నీ, మీ పిల్లలనీ, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబాన్నీ, మీ స్నేహితులను, ఈ దేశం మొత్తాన్నీ భయంకరమైన ప్రమాదానికి గురిచేస్తాయి.   ఇదే అజాగ్రత్త కొనసాగితే భారతదేశం ఎంత మూల్యం చెల్లించుకోవలసి వస్తుందో అంచనా వేయడం అసాధ్యం."

గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను ప్రజలు సంపూర్ణ చిత్తశుద్ధితో స్వీకరించాలని కూడా ప్రధానమంత్రి కోరారు. 

ఈ రోజు అర్ధరాత్రి నుండి దేశం యావత్తూ పూర్తి లాక్ డౌన్ లో ఉంటుందని ప్రధానమంత్రి ప్రకటించారు.  21 రోజులపాటు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాకూడదనీ, ఈ విషయంలో ప్రజలపై పూర్తి నిషేధం విధించడం జరిగిందని ప్రధానమంత్రి ప్రకటించారు.  ఆరోగ్యరంగానికి చెందిన నిపుణుల అనుభవాలు,  ఇతర దేశాల అనుభవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి 21 రోజుల లాక్ డౌన్ అత్యవసరమనీ ఆయన చెప్పారు. 

ఇది జనతా కర్ఫ్యూ కంటే కొన్ని స్థాయిల పైన ఉంటుందని కూడా ఆయన చెప్పారు.   దేశాన్ని పరిరక్షించుకోడానికీ,  కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ఈ దేశ పౌరులందరినీ పరిరక్షించుకోడానికీ, ఈ నిర్ణయం చాలా కీలకమైందని ప్రధానమంత్రి వివరించారు. 

ఈ మహమ్మారి కారణంగా ఆర్ధిక ప్రభావాన్ని గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ - "  ఈ లాక్ డౌన్ కారణంగా దేశంపై తప్పకుండా ఆర్ధిక భారం పడుతుంది. అయితే,  ప్రతి ఒక్క భారతీయుని ప్రాణాన్ని కాపాడటం మా మొదటి ప్రాధాన్యత.  అందువల్ల, దేశంలో ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటే అక్కడే మీరు ఉండడం కొనసాగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. " 

రానున్న 3 వారాల్లో పరిస్థితి అదుపులోకి రాకుంటే, దేశం 21 సంవత్సరాల వెనక్కి పోతుందనీ, అనేక కుటుంబాలు ఎప్పటికీ కోలుకోలేని విధంగా దెబ్బతింటాయనీ ప్రధానమంత్రి వివరించారు.   అందువల్ల,  రానున్న 21 రోజుల పాటు ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని - ఈ ఒక్కటీ చేయాలని - ఆయన ప్రజలను కోరారు.  

కరోనా వ్యాప్తిని అరికట్టిన దేశాల అనుభవాలు, మనకు కొంత ఆశా కిరణాన్ని అందిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. 

లాక్ డౌన్ పాటించిన దేశాలు, అక్కడ నియమాలను పాటించిన ప్రజలు,  ఆ మహమ్మారిని అధిగమించగలుగుతారని ఆయన అన్నారు.  

"మనం ఈ విపత్తు ప్రభావాన్ని ఎంత కనీస స్థాయికి తీసుకురాగలమనే విషయాన్ని, మన ప్రస్తుత చర్యలు నిర్ణయించే పరిస్థితిలో భారతదేశం ఉంది.    ఇది మన నిర్ణయాన్ని స్థిరంగా బలపరిచే సమయం.   ఇది అడుగడుగునా జాగ్రత్త వహించవలసిన సమయం.  జాన్ హై తో జహాన్ హై అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.  ఇది సహనం, క్రమశిక్షణ పాటించవలసిన సమయం.   లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతున్నంత వరకు, మనం మన సంకల్పాన్ని తప్పక కొనసాగించాలి, మనం మన వాగ్దానాన్ని తప్పక నిలబెట్టుకోవాలి."  అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

పౌరుల దైనందిన జీవితానికి ఎక్కువ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా వేగంగా పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు.   అన్ని అత్యవసర వస్తువుల సరఫరా సజావుగా కొనసాగేలా నిబంధనలను రూపొందించినట్లు ఆయన తెలిపారు.   ఈ సంక్షోభ సమయంలో పేదల సమస్యలను తగ్గించడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, పౌర సంఘాలు, సంస్థలకు చెందిన వ్యక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన చెప్పారు. 

కరోనా బారిన పడిన రోగులకు వైద్యపరమైన మౌలిక సదుపాయాలు, చికిత్స పటిష్టపరిచేందుకు ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలను (రూ. 15,000,00,00,000) కేటాయించినట్లు శ్రీ నరేంద్రమోదీ ప్రకటించారు.  
ఈ సమయంలో ప్రచారమయ్యే ఎటువంటి వదంతులు లేదా మూఢ నమ్మకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   ఈ వైరస్ కు సంబంధించి ఏమైనా లక్షణాలు కనబడితే, వైద్యులను సంప్రదించకుండా ఎటువంటి మందులు తీసుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ఇటువంటి కీలకమైన సమయంలో ప్రభుత్వ, స్థానిక అధికారుల సూచనలను  ప్రతి భారతీయుడు తప్పక పాటిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

సంక్షోభ సమయంలో ముందుకు వచ్చి, జనతా కర్ఫ్యూని  విజయవంతం చేయడంలో సంపూర్ణ బాధ్యత, సున్నితత్వంతో పనిచేసిన ప్రతి భారతీయుని కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.  మన దేశం సంక్షోభ సమయంలో ఉన్నప్పుడూ, మానవాళి సంక్షోభ సమయంలో ఉన్నప్పుడూ, ప్రతి భారతీయుడు కలిసికట్టుగా ముందుకు వచ్చి, ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోగలరనే విషయాన్ని, ఒక రోజు జనతా కర్ఫ్యూని విజయవంతం చేయడం ద్వారా , భారతదేశం  ఋజువు చేసింది."  అని ఆయన వివరించారు. 

21 రోజుల లాక్ డౌన్ చాలా ఎక్కువ సమయం అయినప్పటికీ, ఇది మీ భద్రతకు, మీ కుటుంబ భద్రతకు అంతే ప్రధానమైనదని ప్రధానమంత్రి చివరిగా పేర్కొన్నారు.  ప్రతి భారతీయుడు ఈ క్లిష్ట పరిస్థితిని విజయవంతంగా అధిగమించడంతో పాటు,  మరిన్ని విజయాలను సొంతం చేసుకోగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

***



(Release ID: 1608019) Visitor Counter : 334