ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై తాజా సమాచార: సూచనలు-మార్గదర్శకాలు-నివారణ
Posted On:
17 MAR 2020 8:05PM by PIB Hyderabad
కోవిడ్-19 సంబంధిత తాజా పరిణామాలపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి ఇవాళ వివిధ మంత్రిత్వశాఖలు/విభాగాల సీనియర్ అధికారులతో సమీక్షించారు. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ నిర్దేశిత మార్గదర్శకాల మేరకు సామాజిక దూరం పాటింపజేసే దిశగా చర్యల అమలు అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు. సామాజిక దూరం పాటింపు ద్వారా వైరస్ వ్యాప్తిని సమర్థంగా నిరోధించగలమని స్పష్టం చేశారు. దీంతోపాటు వివిధ రాష్ట్రాల్లో అనుమానితుల ప్రత్యేక పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రుల నిర్వహణ, అవగాహన ప్రచార కార్యక్రమాలను కూడా సమీక్షించారు. కాగా, ఈ చర్యలలో కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం నిమిత్తం వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల నుంచి 30 మందికిపైగా సంయుక్త కార్యదర్శులు, ఆపై హోదాగల అధికారులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. వీరికి నిర్దేశించిన బాధ్యతలపై రేపు ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేశవిదేశీ ప్రయాణాలపై మార్చి 11, 16 తేదీల్లో జారీచేసిన సూచనలకు తోడు ఇవాళ తాజాగా జారీ అయిన అదనపు సూచనలు ఇలా ఉన్నాయి:
- ఆఫ్ఘనిస్థాన్, ఫిలిప్పీన్స్, మలేషియాల నుంచి భారతదేశానికి ప్రయాణికుల రాకపై తక్షణ నిషేధం విధించబడింది. ఈ నేపథ్యంలో భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత పై దేశాల నుంచి భారత్‌వైపు విమానాలను ఆపివేశారు.
- మార్చి 30వ తేదీదాకా అమలయ్యే ఈ తాత్కాలిక నిషేధంపై ఆ తర్వాత సమీక్ష నిర్వహిస్తారు.
దీంతోపాటు మరో మూడు మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి (వీటిని www.mohfw.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు:
- కోవిడ్-19పై వైద్యపరమైన (రోగుల సత్వర గుర్తింపుసహా) మూడు మార్గదర్శకాలు నవీకరించబడ్డాయి. ఈ మేరకు వైరస్ వ్యాప్తి నిరోధం, నియంత్రణ చర్చలను నవీకరించి తాజాగా జారీచేశారు.
- మృతదేహాల నిర్వహణలో భాగంగా ప్రామాణిక జాగ్రత్తలు, వ్యాధి వ్యాప్తి నిరోధం-నియంత్రణ చర్యలు, బంధువులకు అప్పగింత, పరిసరాలను వ్యాధికారక రహితం చేయడంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
- కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రైవేటురంగ ప్రయోగశాలలకూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
- ఆ మేరకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు అర్హులైన వైద్యులు ప్రయోగశాలకు సిఫారసు చేస్తేనే పరీక్షలు నిర్వహించాలి. ఎప్పటికప్పుడు నవీకరించే మార్గదర్శకాలను అనుసరించాలి.
- ప్రయోగశాల ప్రామాణిక ప్రక్రియలో ఐసీఎంఆర్ భాగస్వామ్యం ఉంటుంది. పరీక్షలకు అవసరమైన సకల సరంజామాను సమకూర్చుకున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత సానుకూల నియంత్రణ సూచనలు జారీ అవుతాయి. అలాగే పరీక్షల సరంజామాకు ఐసీఎంఆర్- పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ధ్రువీకరణ ఉండాలి.
- అనుమానితుల నుంచి నమూనాల సేకరణ సమయంలో జీవరక్షక, జీవభద్రత ముందుజాగ్రత్త చర్యలను తగువిధంగా పాటించాలి. ఆన్‌లైన్‌ద్వారా నిర్దిష్ట వ్యాధి ప్రత్యేక సేకరణ విధానాన్ని అమలు చేయాలి.
- అన్ని ప్రైవేటు ప్రయోగశాలలు భారత ప్రభుత్వానికి చెందిన సమీకృత వ్యాధి పరిశీలన కార్యక్రమం సంబంధిత అధికారులతోపాటు ఐసీఎంఆర్ ప్రధాన కార్యాలయానికి తక్షణ నివేదికలివ్వాలి.
- కోవిడ్-19 నిర్ధారణ నిమిత్తం ప్రైవేటు ప్రయోగశాలలు పూర్తిస్థాయిలో ఉచితంగా పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ స్పష్టీకరించింది.
కోవిడ్-19 వ్యాప్తి నిరోధం దిశగా తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ (డీవోపీటీ) కూడా వివిధ మంత్రిత్వశాఖలు/విభాగాలు, ఉద్యోగులకు జారీచేసిన సూచనపత్రంలోని అంశాలు ఇలా ఉన్నాయి:
- ప్రభుత్వ భవనాల ప్రవేశద్వారాలవద్ద అవసరమైన చోట థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేయాలి. దీంతోపాటు చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. ఎవరికైనా ఫ్లూ లక్షణాలుంటే తక్షణ సముచిత చికిత్స చేయించుకోవాలని సలహా ఇవ్వాలి.
- కార్యాలయ సముదాయంలోకి సందర్శకుల రాకను గరిష్ఠంగా నిరోధించాలి. నిత్యం జారీచేసే సందర్శక, తాత్కాలిక అనుమతిపత్రాల జారీని తక్షణం నిలిపివేయాలి. సంబంధిత అధికారినుంచి తగిన అనుమతి ఉన్నవారిని మాత్రమే... అదీ సవ్యంగా పరీక్షించి వారివద్దకు పంపాలి.
- సాధ్యమైనంత వరకూ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయంద్వారా సమావేశాలు నిర్వహించాలి. అత్యవసరమైతే తప్ప పెద్దసంఖ్యలో హాజరీ అవసరమైన సమావేశాలను తగ్గించాలి లేదా వాయిదా వేయాలి.
- అవసరం లేని అధికారిక ప్రయాణాలను మానుకోవాలి.
- అత్యవసరమైన అంశాలపై అధికారిక ఈమెయిల్‌ద్వారా ఉత్తరప్రత్యుత్తరాల ప్రక్రియ నిర్వహించాలి. సాధ్యమైనంతవరకూ ఇతర విభాగాలకు ఫైళ్లు, పత్రాలవంటివి పంపరాదు.
- తపాలా స్వీకరణ, బట్వాడా ప్రక్రియను ఆచరణ సాధ్యమైనంత వరకూ కార్యాలయ భవన ప్రవేశద్వారం వద్ద నిర్వహించాలి.
- ప్రభుత్వ భవనాల్లోని వ్యాయామశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు, వినోద కేంద్రాలను మూసివేయాలి.
- పని ప్రదేశాల్లో తరచూ పరిశుభ్రత, వ్యాధికారక నిర్మూలన చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకించి తరచూ తాకే ప్రదేశాల్లో ఈ జాగ్రత్త అత్యావశ్యకం. వాష్‌రూముల్లో చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లు, సబ్బు, నీరు నిరంతరం అందుబాటులో ఉంచాలి.
- స్వీయ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతి అధికారికీ సూచించాలి. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర అనారోగ్యం ఏదైనా ఉన్నట్లు అనిపిస్తే ఉన్నతాధికారులకు నివేదించి తక్షణం పని ప్రదేశం వీడాలి. ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల (www.mohfw.gov.in/DraftGuideIinesforhomequarantine.pdf లో లభ్యం) మేరకు ఇంట్లోనే ఏకాంత చికిత్స చేయించుకోవాలి.
- ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎవరైనా ఇంట్లో ఏకాంత చికిత్స కోసం సెలవు దరఖాస్తు సమర్పిస్తే మంజూరు చేయాల్సిందిగా అధికారులకు సూచించబడింది.
- వృద్ధులు, గర్భిణులు, వైద్యపరంగా ఇబ్బందులు వంటి తీవ్ర ముప్పుగల ఉద్యోగులందరూ అదనపు జాగ్రత్తలు తీసుకునేలా సూచనపత్రం జారీచేయాలి. అటువంటి ఉద్యోగులకు నేరుగా జనంతో సంబంధంగల ప్రాంతాల్లోని విధులు అప్పగించరాదు.
*****
(Release ID: 1607030)
Visitor Counter : 178