ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 ఎదుర్కోవడం కోసం అనుసరించవలసిన చర్యల పై సార్క్ దేశాల నాయకులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు

Posted On: 15 MAR 2020 6:15PM by PIB Hyderabad

గౌరవనీయులైన నాయకులారా !

ప్రస్తుత పరిస్థితి పై మీ ఆలోచనలు పంచుకున్నందుకు, ఇంతవరకు మీరు చేపట్టిన చర్యల కు,  ధన్యవాదములు. 

ప్రస్తుతం మనందరం తీవ్రమైన సవాలును ఎదుర్కొంటున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే.   రాబోయే రోజుల్లో ఈ మహమ్మారి ఎటువంటి పరిస్థితుల కు దారితీస్తుందో, ఇంతవరకు మనకు తెలియదు. 

మనం కలిసి పని చేయాలన్న విషయం స్పష్టమైనది.  మనం ఎదగడం కాదు, కలిసి ముందుకు సాగుదాం; గందరగోళం తో కాదు భాగస్వామ్యం తో; అదేవిధం గా భయాందోళన తో కాదు సంసిద్ధత తో మనం ఉత్తమం గా స్పందించగలము. 

మనం చేపడుతున్న సంయుక్త కృషి లో భాగం గా భారతదేశం ఏవిధమైన సహాయం అందించగలదన్న విషయమై, ఇదే భాగస్వామ్య స్పూర్తి తో, నేను కొన్ని ఆలోచనల ను మీతో పంచుకుంటాను. 

కోవిడ్-19 అత్యవసర నిధి పేరుతో ఒక నిధి ని మనం ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను.   మనందరి స్వచ్ఛంద విరాళాల ఆధారం గా దీని ని ఏర్పాటు చేయవచ్చు.  10 మిలియన్ అమెరికా డాలర్ల విరాళాన్ని ముందుగా ప్రకటించడం ద్వారా భారతదేశం ఈ నిధి ని ప్రారంభించవచ్చు.  సత్వర చర్యల కు అవసరమయ్యే వ్యయాన్ని భరించేందుకు మనలో ఎవరైనా ఈ నిధిని ఉపయోగించుకోవచ్చు.  ఈ నిధి యొక్క విధి, విధానాల ను ఖరారు చేయడానికి మన విదేశీ కార్యదర్శులు, మన రాయబార కార్యాలయాల ద్వారా వేగం గా సమన్వయపరచవచ్చు.   

పరీక్షల కు అవసరమైన వస్తు సామాగ్రి, ఇతర పరికరాల తో పాటు, వైద్యులు, నిపుణుల తో కూడిన సత్వర స్పందన బృందాన్ని మేము భారతదేశం లో సిద్ధం గా ఉంచుతున్నాము.   అవసరమైనప్పుడు, మీకు అందుబాటులో ఉండే విధం గా వారు సిద్ధం గా ఉంటారు. 

మీ అత్యవసర స్పందన దళాలకు అవసరమైన శిక్షణ ను కూడా మేము సత్వరమే ఆన్ లైన్ లో అందించగలము.   మా అత్యవసర సిబ్బంది మొత్తం సామర్ధ్యాన్ని పెంపొందించడం కోసం, మా దేశం లో మేము స్వయం గా అనుసరించిన విధానం ఆధారం గా ఈ స్పందన బృందాన్ని రూపొందించాము. 

వైరస్ ఎవరి ద్వారా వ్యాపించే అవకాశం ఉందో వారినీ, వారు ఎవరిని కలిశారో వారినీ గుర్తించడానికి వీలుగా ఒక సమగ్ర రోగ నిఘా వ్యవస్థ ను మేము ఏర్పాటు చేశాము.  ఈ రోగ నిఘా సాఫ్ట్ వేర్ వ్యవస్థ ను, దాన్ని ఉపయోగించడానికి అవసరమైన శిక్షణ ను, సార్క్ భాగస్వామ్య దేశాల తో మేము పంచుకుంటాము. 

మనందరి లో ఉన్న ఉత్తమ అభ్యాసాల ను ఒక చోట చేర్చడం కోసం, సార్క్ విపత్తు యాజమాన్య కేంద్రం వంటి ప్రస్తుతం ఉన్న సదుపాయాల ను కూడా మనం ఉపయోగించుకుందాము. 

మరింత ముందు చూపుతో, మన దక్షిణాసియా ప్రాంత పరిధి లో అంటువ్యాధులు నియంత్రించడం పై పరిశోధన ను సమన్వయ పరచడం కోసం, ఒక ఉమ్మడి పరిశోధనా వేదిక ను మనం ఏర్పాటు చేసుకోవచ్చు.  అటువంటి కార్యక్రమాన్ని సమన్వయ పరచడం లో భారత వైద్య పరిశోధనా మండలి సహాయపడుతుంది. 

కోవిడ్-19 దీర్ఘకాలిక ఆర్ధిక పరిణామాలపై విశ్లేషించవలసిందిగా మన నిపుణుల ను మనం కోరవచ్చు.   దాని ప్రభావం నుంచి మన అంతర్గత వాణిజ్యం, మన స్థానిక ద్రవ్య మారకాన్ని ఎలా పరిరక్షించుకోగలమో తెలుసుకోవచ్చు. 

చివరగా ఆలోచిస్తే, ఇటువంటి మహమ్మారి మనపై ప్రభావం చూపడం, ఇదే మొదటిసారి కాదు, ఇదే ఆఖరిదీ కాదు. 

అటువంటి పరిస్థితుల్లో, మన దేశ సరిహద్దుల్లోనూ, మన దేశాల్లోనూ వ్యాప్తి చెందే అంటువ్యాధుల విషయం లో అనుసరించవలసిన ఒక సాధారణ ఒడంబడిక ను రూపొందించుకోవాలి.  

ఇటువంటి అంటువ్యాధులు మన ప్రాంతమంతా వ్యాప్తి చెందకుండా నిరోధించటానికి ఇది తోడ్పడుతుంది.   అంతర్గతంగా, స్వేచ్ఛ గా తిరగడానికి వీలుకల్పిస్తుంది.  

***
 



(Release ID: 1607018) Visitor Counter : 128