ప్రధాన మంత్రి కార్యాలయం

జోగ్ బనీ-బిరాట్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను సంయుక్తం గా ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ.  

వారు నేపాల్ లో గృహాల పున‌ర్ నిర్మాణ ప‌థ‌కం యొక్క పురోగ‌తి ని వీక్షించారు

Posted On: 21 JAN 2020 12:10PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోగ్ బనీ-బిరాట్ నగర్ లో రెండో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసిపి)ని నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ తో క‌ల‌సి ఈ రోజు న ప్రారంభించారు. 

జోగ్ బ‌నీ-బిరాట్ న‌గ‌ర్ రెండు దేశాల మ‌ధ్య ఒక ముఖ్య‌మైన వ్యాపార కేంద్రం గా ఉంది.  ఈ చెక్ పోస్టు ను ఆధునిక సౌక‌ర్యాల తో తీర్చి దిద్దారు.

జోగ్ బ‌నీ-బిరాట్ న‌గ‌ర్  ప్రాంతం లో రెండో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను భార‌త‌దేశం-నేపాల్ స‌రిహ‌ద్దు వెంబ‌డి ప్ర‌జ‌ల రాక‌ పోక‌ల కు మ‌రియు వ్యాపార సౌల‌భ్యం కొర‌కు భార‌త‌దేశం అందించిన ఆర్థిక స‌హాయం తో నిర్మించ‌డ‌ం జరిగింది.

ఈ కార్య‌క్ర‌మం లో ఇరువురు ప్ర‌ధానులు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పాలుపంచుకొన్నారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న ప్ర‌సంగం లో ‘‘నేపాల్ యొక్క స‌ర్వ‌తోముఖ అభివృద్ధి లో భార‌త‌దేశం ఒక విశ్వ‌స‌నీయ‌మైన భాగ‌స్వామ్యదేశం పాత్ర ను  పోషిస్తున్నది’’ అన్నారు.

‘‘ ‘‘నైబ‌ర్ హుడ్ ఫ‌స్ట్’’ అనేది నా ప్ర‌భుత్వం యొక్క ప్రాధాన్యం గా ఉన్నది.  అలాగే, సీమాంత‌ర సంధానాన్ని మెరుగు ప‌ర‌చ‌డం అనేది ఈ విధానం లో ఓ ముఖ్య‌ భాగం గా ఉంది’’ అని ఆయ‌న పేర్కొన్నారు.
 
‘‘ఉత్త‌మ‌మైనటువంటి సంధానం అనే అంశం భార‌త‌దేశం-నేపాల్ కు సంబంధించినంత వ‌ర‌కు చూస్తే అత్యంత ముఖ్య‌మైంది గా మారిపోతున్నది.  దీనికి కార‌ణం మ‌న మ‌ధ్య సంబంధాలు కేవ‌లం ఇరుగు పొరుగు దేశాల సంబంధాల వంటివి కాకుండా మ‌న సంస్కృతి, స్వభావం, కుటుంబాలు, భాష‌, అభివృద్ధి, ఇంకా ఎన్నో ఇత‌ర బంధాలు మ‌న‌లను పెన‌వేసుకొన్నాయి’’ అని శ్రీ మోదీ వివరించారు.

‘‘అన్ని మిత్ర దేశాల తో ఉత్త‌మ‌మైన‌ ర‌వాణా స‌దుపాయాల ను అభివృద్ధి ప‌ర‌చుకోవ‌డం తో పాటు వ్యాపారం, సంస్కృతి, విద్య త‌దిత‌ర సంబంధాల ను మ‌రింత గా అభివృద్ధి ప‌ర‌చుకోవ‌డం కోసం కూడాను నా ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకొన్నది’’ అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

నేపాల్ లో రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు మ‌రియు ప్ర‌సార మార్గాల ప‌థ‌కాల సంధానం కోసం భార‌త‌దేశం శ్ర‌మిస్తున్నది అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

నేపాల్ లో భూకంపం అనంత‌ర గృహ పున‌ర్ నిర్మాణ ప‌థ‌కాల ను భార‌త ప్ర‌భుత్వం స‌హాయం తో అమ‌లుప‌రుస్తున్నారు.  దీని లో చోటు చేసుకొన్న విశేష‌మైనటువంటి పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రులు ఉభ‌యులు తిల‌కించారు.

నేపాల్ లో 2015వ సంవ‌త్స‌రం లో వ‌చ్చిన భూకంపాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ప్ర‌స్తావిస్తూ, ‘‘అప్ప‌ట్లో ర‌క్ష‌ణ‌ మ‌రియు సహాయ‌క కార్య‌క‌లాపాల కోసం మొట్ట‌మొద‌ట‌గా స్పందించిన దేశం భార‌తదేశ‌మే.  మ‌రి ఇప్పుడు నేపాల్ పున‌ర్ నిర్మాణం లో మ‌న మిత్రుల భుజం తో భుజం కలిపి నిలబడుతున్నది కూడా భార‌త‌దేశ‌మే’’ అన్నారు.
 
గోర్‌ఖా మ‌రియు నువాకోట్‌ జిల్లాల‌ లో 50,000 గృహాల ను నిర్మించి ఇస్తామ‌న్న‌ది భార‌త ప్ర‌భుత్వ వాగ్ధానం కాగా, అందులో 45,000 ఇళ్ళ ను ఇప్ప‌టికే పూర్తి చేయ‌డం జ‌రిగింది.

భార‌త‌దేశం యొక్క కృషి కి గాను నేపాల్ ప్ర‌ధాని శ్రీ కె.పి. శ‌ర్మ ఓలీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.


**



(Release ID: 1600057) Visitor Counter : 143