మారుతున్న తరగతి గదుల పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగడంలో ఒకప్పుడు తరతరాల విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటే ఎలా ఉంటుంది?.. ఈ ప్రశ్నే దర్శకుడు సర్ఫరాజ్ ఆలం తొలిసారిగా తెరకెక్కించిన హిందీ చలనచిత్రం ‘కబీర్ సర్ కా ఆఖ్రీ లెసన్’కు ప్రధాన ఇతివృత్తం. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో ఈ చిత్రం ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనకు ఎంపికైంది.
బిహార్‌లోని నలంద జిల్లాలో తన చిన్ననాటి పాఠశాలను సందర్శించినప్పుడు ఆలం ఎదుర్కొన్న అనుభవం ఈ సినిమాకు స్ఫూర్తినిచ్చింది. పాఠశాలలో సంప్రదాయ నల్లబల్లల స్థానంలో స్మార్ట్ బోర్డులు వచ్చాయని, అయితే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు కొత్త సాంకేతికతలకు అలవాటు పడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన గమనించారు. ఈ దృశ్యం ఉపాధ్యాయ వృత్తిలో మారుతున్న పరిస్థితులు, నేటి విద్యావేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆలోచించేలా చేసింది.
గోవాలో ఈరోజు పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఆలం మాట్లాడారు. ‘రెండేళ్ల క్రితం మా పాఠశాలను సందర్శించినప్పుడు, నల్లబల్లల స్థానంలో స్మార్ట్ బోర్డులు రావడంతో నా ఉపాధ్యాయులు కొత్త సాంకేతికతలను ఉపయోగించడంలో ఇబ్బందులు పడటం చూశాను. అలా ఈ సినిమా ఆలోచన వచ్చింది’’ అని తెలిపారు.
బిహార్‌లోని ఒక సాధారణ గ్రామ పాఠశాల నుంచి రష్యాలో వైద్య విద్య అభ్యసించడం, ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చిత్ర నిర్మాణం నేర్చుకోవడం వరకు తన ప్రయాణాన్ని ఆయన వివరించారు. ఉపాధ్యాయుల ప్రభావం తనపై ఇప్పటికీ ఉందని, తన మూలాలతో అనుబంధం కొనసాగుతోందని చెప్పారు. ఒకప్పుడు వైద్యులు, ఇంజినీర్లు, ఐఏఎస్ అధికారులుగా ఎదిగిన అనేక తరాలకు మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులు.. నేడు సాంకేతిక అడ్డంకులు, ఉపాధ్యాయ వృత్తి పట్ల మారుతున్న వైఖరుల మధ్య నడవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ‘‘నేడు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారితో వ్యవహరిస్తున్న తీరు ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఈ చిత్రం అనుబంధాన్ని కలిగిస్తుంది’’ అని అన్నారు.
కార్టినా ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ నిర్మించిన ఈ 103.52 నిమిషాల హిందీ డ్రామాలో ప్రముఖ నటుడు వినయ్ పాఠక్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన నటనను ఆలం ప్రశంసించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య మారుతున్న సంబంధాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఉండే గాఢమైన భావోద్వేగ అనుబంధం ఆధునిక విద్యావ్యవస్థలో క్రమంగా కనుమరుగవుతోందని అభిప్రాయపడ్డారు. ఆలోచనాత్మకమైన సంభాషణల ప్రాధాన్యాన్ని వివరిస్తూ, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం కంటే యువత చుట్టూ జరిగే విషయాలను జాగ్రత్తగా గమనించాలని, శ్రద్ధగా వినాలని సూచించారు.
బిహార్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆలం వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, విజయాలను విస్తృత ప్రేక్షకులకు చేరవేయడంలో సినిమా రంగం కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు.
నల్లబల్లల నుంచి స్మార్ట్ బోర్డులకు మార్పు అనే అంశానికి మించి, ‘కబీర్ సర్ కా ఆఖ్రీ లెసన్’ గౌరవం, తరాల మధ్య మారుతున్న సంబంధాలు, పరిణామం చెందుతున్న సమాజంలో ఉపాధ్యాయుల స్థానంపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక దర్శకుడి వ్యక్తిగత అనుభవం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కథ.. భౌగోళిక, సాంస్కృతిక హద్దులను దాటి అందరినీ అనుసంధానించే సార్వత్రిక బంధాన్ని స్పృశిస్తుంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగుతున్న 57వ ఇఫి ఇతివృత్తమైన విశ్వజనీన కథలతో ఈ చిత్రం భావం మమేకమవుతుంది.
ఈ విలేకరుల సమావేశానికి శ్రీ వివేక్ విశ్వాస్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
పూర్తి విలేకరుల సమావేశాన్ని ఇక్కడ వీక్షించండి:
ఇఫిలోయిడ్‌ను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48