57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో భాగంగా గోవాలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మౌరో ముల్లర్, రచయిత జోస్ డేవిడ్ ఫిగ్యురోవా గార్సియా, నిర్మాత లెస్లీ హాలెరాన్ తమ ద్విభాషా చిత్రం ‘ఎ ఫ్యూ డేస్ ఇన్ ది సన్’ విశేషాలను వివరించారు. ‘సినిమా ఆఫ్ ది వరల్డ్’ విభాగంలో ప్రదర్శించిన ఈ చిత్ర నిర్మాణ విశేషాలు, తమ సృజనాత్మక దృక్పథంపై వారు మాట్లాడారు.
మెక్సికోలోని రివేరా మాయా ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అక్కడ ఒక అభివృద్ధి ప్రాజెక్టు కోసం స్థానిక ప్రజలను అక్రమ మార్గాల్లో ఖాళీ చేయించడానికి ఒక సంపన్న యూరోపియన్ జంట ప్రయత్నిస్తుంది. మరోవైపు, ఒక టీనేజ్ కుర్రాడిని జైలు శిక్ష నుంచి తప్పించడానికి ఒక శ్రామిక వర్గ మెక్సికన్ కుటుంబం అవినీతిపరుడైన పోలీసు అధికారితో ఒక ప్రమాదకరమైన ఒప్పందాన్ని చేసుకుంటుంది. ఈ రెండు జంటలు ఒకచోట కలిసి.. వారు ఒక హింసాత్మక కిడ్నాప్ వ్యవహారంలో చిక్కుకుంటారు. పరిస్థితి వేగంగా చేయి దాటిపోవడంతో, ఆ కఠినమైన ప్రాంతంలో చిక్కుకున్న వారంతా తమ చర్యలకు పర్యవసానాన్ని ఎదుర్కొంటారు. హోదా, సంపద కన్నా ప్రాణాలతో బయటపడాలనే పోరాటం వారిని ఊహించని విధంగా ఎలా దగ్గర చేసిందనేది ఈ చిత్రం కళ్లకు కడుతుంది.
మెక్సికో, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, అమెరికా, స్విట్జర్లాండ్... అయిదు దేశాల అంతర్జాతీయ సహనిర్మాణంతో, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. ఒకరికి విహారయాత్రగా కనిపించే ప్రదేశం.. మరొకరికి సొంత ఇల్లు, రోజువారీ జీవన పోరాటంగా ఉంటుందనే ఒక చిన్న ఆలోచన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ రెండు భిన్న ప్రపంచాలూ ఒకదానికొకటి ఎదురైనప్పుడు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
తన సొంత జీవితమే ఈ కథను, దాని దృక్పథాన్ని ఎంతగానో ప్రభావితం చేసిందని దర్శకుడు ముల్లర్ పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లో పెరిగిన ఆయన.. మెక్సికో, అమెరికాల్లో కూడా నివసించారు. ఇతరుల పట్ల సానుభూతిని పెంపొందించుకోవడానికి, ఏ జీవన విధానమూ మరొకదాని కన్నా గొప్పదో తక్కువదో కాదని తెలుసుకోవడానికి వివిధ దేశాల్లో ప్రయాణించడం, అక్కడ నివసించడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భాషలు నేర్చుకోవడం, ప్రయాణాలు చేయడం వల్ల.. మనుషులు భిన్నమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చని, అలాగే వారి చుట్టూ ఉన్న వ్యవస్థలు, సంస్థలు ఆ నిర్ణయాల పర్యవసానాలను ఎలా ప్రభావితం చేస్తాయో గుర్తించగలమని ఆయన వివరించారు.
ముల్లర్‌కు ఇఫీ కొత్తేమీ కాదు. ఆయన గత చిత్రం ‘ది జానిటర్ (El Conserje)’ 2025 నవంబరులో గోవాలో జరిగిన 56వ ఇఫీలో ప్రపంచ ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది.
విభిన్న సంస్కృతులు, సామాజిక వర్గాల మధ్య సంఘర్షణను ఈ చిత్రం స్పష్టంగా కళ్లకు కడుతుందని గార్సియా వివరించారు. ఒకే రకమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. సంపన్న యూరోపియన్ పాత్రలు ఎదుర్కొనే పరిణామాలకు, శ్రామిక వర్గ జంట అనుభవించే కష్టాలకు మధ్య వ్యత్సాసం ఉంటుందని చెప్పారు. సామాన్యుల జీవితాలు ఒక్కసారిగా తలకిందులవుతాయని పేర్కొన్న ఆయన మాటలతో హాలెరాన్ ఏకీభవిస్తూ.. ఒక పేదవాడు చేసే చిన్న పొరపాటు కూడా వారి మొత్తం జీవితాన్ని కుప్పకూల్చేస్తుందన్నారు. ఈ సినిమాలో బందీలుగా ఉన్నవారు, వారిని బంధించిన వారు.. ఇలా అందరూ ఒక రకంగా తమ పరిస్థితుల చేతిలో బందీలే అని వివరించారు.
సమాజంలోని ప్రతి స్థాయిలో అవినీతి ఎలా వేళ్లూనుకుందో కూడా గార్సియా విశ్లేషించారు. కింది స్థాయిలో అది లంచం రూపంలో నేరుగా కనిపిస్తే.. సంపన్న జంట ఒక స్థానిక సమూహాన్ని వారి సొంత గడ్డ నుంచి అక్రమంగాఖాళీ చేయించడానికి ప్రయత్నించడమన్నది అధికారం, రాజకీయాలతో ముడిపడి ఉన్న ఉన్నత స్థాయి అవినీతి అని, దీనిని సమాజం సాధారణ విషయంగా అంగీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు రకాల అవినీతిని ఒకే త్రాసులో పెట్టి చూపే ప్రయత్నం ఈ చిత్రం చేస్తుందన్నారు. ప్రపంచంలో పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక - సామాజిక స్థాయిని బట్టి మనుషులను విభజించే ధోరణుల గురించి కూడా ముల్లర్, గార్సియా ప్రస్తావించారు.
ప్రజలు నైతికంగా సందిగ్ధమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారనే విషయమై సానుభూతిని పెంచడమే ఈ చిత్రం లక్ష్యమని ముల్లర్ అన్నారు. కేవలం ఒక సాధారణ డ్రామాకే పరిమితం కాకుండా.. థ్రిల్లర్ జోనర్ ద్వారా కొత్తగా, విస్తృత స్థాయి ప్రేక్షకులను చేరుకోవచ్చన్న ఉద్దేశంతో ఈ శైలిని ఆయన ఎంచుకున్నారు. ఫలితంగా ఆర్ట్‌హౌస్ సినిమాకూ, కమర్షియల్ సినిమాకూ మధ్య వారధిలా నిలిచే ‘పాత్రల ఆధారిత థ్రిల్లర్’ రూపుదిద్దుకుందని ఆయన వివరించారు.
ఈ చిత్రాన్ని ఒక విధంగా మహిళల చుట్టూ తిరిగే కథగా హాలెరాన్ అభివర్ణించారు. ఇరు కుటుంబాల్లోని మహిళలు తీసుకునే నిర్ణయాలు, వారు నిర్ణయాలు తీసుకునే తీరు, ఒకరితో ఒకరు అనుసంధానమయ్యే విధానం కథను చాలావరకు ముందుకు నడిపిస్తాయి. మనందరం సమాజంలోని ఏదో ఒక వర్గంలో మనల్ని మనం చూసుకుంటాం కాబట్టి.. వేర్వేరు వర్గాల మధ్య సంఘర్షణకు సంబంధించిన కథలు సులభంగా అందరికీ చేరుతాయని గార్సియా అన్నారు. ఇరుపక్షాలూ ఒకే రకమైన సందిగ్ధతలను ఎదుర్కొనే విధానాన్ని ఈ సినిమాలో చూపించామన్నారు. తద్వారా కొన్ని ప్రత్యేకాధికారాలు, సౌకర్యాల విషయంలో వ్యత్యాసం ఉన్నప్పటికీ.. అన్ని వర్గాల ప్రేక్షకులూ అర్థం చేసుకునేలా ఈ చిత్రాన్ని రూపుదిద్దామని వివరించారు.
భావోద్వేగపరంగా తనకు తెలిసి ఉన్నప్పటికీ.. తాను నేరుగా భాగం కాని విషయాలను చూసి, వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తే తనకు స్ఫూర్తినిస్తుందని హాలెరాన్ పేర్కొన్నారు. ఒక కొత్త సమాజంలోకి బయటి వ్యక్తులు ప్రవేశించినప్పుడు జరిగే పరిణామాలను ఈ సినిమాలో ఆవిష్కరించడానికి ఇదే మూలమని ఆమె తెలిపారు. ఇన్ని దేశాల భాగస్వామ్యంతో సాగిన నిర్మాణ ప్రక్రియను సమన్వయం చేయడంపైనా ఆమె మాట్లాడారు. కొత్త ప్రదేశాలను అన్వేషించడం, విభిన్న రచయితలు, దర్శకులతో కలిసి పనిచేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవడం చిత్ర నిర్మాణంలో అత్యంత ఆనందాన్నిచ్చే అంశాలని పేర్కొన్నారు. ముంబయి నగరంపై తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ... ఇక్కడి వైవిధ్యాన్నీ, సందడినీ తన సొంత నగరమైన న్యూయార్క్‌తో పోల్చారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సమానత్వం, అస్తిత్వం, తగిన ప్రాతినిధ్యం కోసం ఆరాటపడుతున్నారనీ, న్యాయం, ధర్మం వైపు తిరిగి అడుగులు వేస్తున్న క్రమంలో భిన్నత్వాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నారని హాలెరాన్ అభిప్రాయపడ్డారు. మనకు తెలిసిన పరిధులను దాటి ప్రయాణించడం, కొత్త భాషను వినడం, కొత్త సంస్కృతిని ఆస్వాదించడం అత్యావశ్యకమని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఎంత ఎక్కువగా ప్రయాణించగలిగితే ఈ ప్రపంచం మరింత మెరుగైన ప్రదేశంగా మారుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ సమావేశానికి శ్రీ లబ్ జైన్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఇఫిలాయిడ్‌ను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48