57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ప్రతినాయకుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తి మాత్రమే కాదు సమాజానికి ప్రతిరూపం కూడా: 57వ ఇఫీలో కార్తీక్ సుబ్బరాజ్


నైతికత, పితృస్వామ్య వ్యవస్థ, సామాజిక దురభిప్రాయాలను సవాలు చేసే సినిమా సామర్థ్యాన్ని విశ్లేషించిన చిత్ర దర్శకుడు

నాడు పోస్టు చేయడమైనది: 27 NOV 2026 7:11PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2342968Views: 10

గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఇఫీ) ‘ప్రతినాయకుడు సరైనవాడైతే ఏంటి?’ అనే శీర్షికతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రముఖ చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నైతికతలోని సంక్లిష్టతలు, ప్రతినాయకత్వానికి గల సామాజిక మూలాలు, దురభిప్రాయాలను సవాలు చేసే సినిమా సామర్థ్యాన్ని విశ్లేషించారు. సినీ విమర్శకుడు సుధీర్ శ్రీనివాసన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ చర్చా గోష్టి.. మంచి, చెడుల మధ్య ఉండే సాంప్రదాయ వ్యత్యాసాలను ఆయన చిత్రాలు ఎలా ప్రశ్నిస్తాయో పరిశీలించింది.

మానవ ప్రవర్తన సామాజిక అనుభవాల ద్వారా రూపొందుతుందని పేర్కొంటూ “ప్రతి ఒక్కరిలోనూ మౌలిక స్వభావం మంచి-చెడుల కలయికగా ఉంటుంది” అని సుబ్బరాజ్ అన్నారు. తమ జీవితంలో కలిసే వ్యక్తులు, వారు ఎదుర్కొనే పరిస్థితులే వారిని మంచివారిగా లేదా చెడ్డవారిగా పరిగణించే విషయంలో ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు.

తన చిత్రం ‘డోరతీ’ గురించి చర్చిస్తూ.. ఉద్దేశపూర్వకంగా చెడు చేసే పాత్రలకు, లోతుగా పాతుకుపోయిన సామాజిక అలవాట్ల నుంచి దుష్ప్రవర్తన కనబరిచే పాత్రలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుబ్బరాజ్ వివరించారు. ‘విజిల్ వీరయ్య’ బహిరంగంగానే దుష్ట స్వభావం కలిగిన పాత్రకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. పరోటా దుకాణం యజమాని వంటి పాత్రలు తమ సొంత దురభిప్రాయాలు, తప్పులను తామే గుర్తించలేకపోవడం వల్ల మరింత ప్రమాదకరమైనవిగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

కథానాయకుడి మరణానికి పురుషాధిక్యత, పితృస్వామ్య ధోరణులే కారణమని ‘డోరతీ’ చిత్రం చూపిస్తుందని సుబ్బరాజ్ పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా ఏ ఒక్క వ్యక్తినో కాకుండా ఒక అణచివేత మనస్తత్వాన్నే అసలైన ప్రతినాయకుడిగా నిలబెట్టినట్లు ఆయన తెలిపారు. తన మరో చిత్రం ‘మెర్క్యురీ’తో పోలుస్తూ.. ఈ చిత్రంలో ఒక గ్రామానికి ఉన్న సమష్టి మనస్తత్వం ప్రతికూలంగా మారిన తీరును ఆయన వివరించారు. దీని ద్వారా విస్తృతమైన సామాజిక వైఖరుల నుంచే వ్యక్తిగత దుష్ట చర్యలు ఎలా పుట్టుకొస్తాయో ఆయన తెలియజేశారు. 

అవమానం, జవాబుదారీతనం గురించి మాట్లాడుతూ.. ఒకరి అసమర్థతను చూసి ఎగతాళి చేయడం, నవ్వడం అనేది మందలింపు కంటే ఎక్కువ బాధాకరంగా ఉంటుందని చిత్ర దర్శకుడు అభిప్రాయపడ్డారు. పశ్చాత్తాపం, అపరాధ భావనలను కూడా శిక్షా రూపాలుగా ప్రస్తావించిన ఆయన.. ఒకరి చర్యల పర్యవసానాలు ఎల్లప్పుడూ శారీరక హాని లేదా మరణం రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

సమాజాన్ని ప్రభావితం చేసే సినిమా సామర్థ్యంపై మాట్లాడుతూ.. ‘డోరతీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను సుబ్బరాజ్ గుర్తుచేశారు. ప్రేక్షకులు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను ఆత్మీయంగా హత్తుకున్న సందర్భాలు, పురుషులు కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలను ఆయన ప్రస్తావించారు. ఇటువంటివి.. చలనచిత్రాలు వినోదానికి మించి సానుభూతిని పెంపొందించగలవని, సామాజిక మార్పును ప్రోత్సహించగలవనే తన నమ్మకాన్ని మరింత బలపరిచాయని ఆయన అన్నారు. కథనం ద్వారా మార్పు తీసుకురావాలనే దృక్పథమే ‘జిగర్‌తాండా’ చిత్ర నిర్మాణంలోనూ తనకు మార్గనిర్దేశం చేసిందని ఆయన తెలిపారు.

పాత్రలను పూర్తిగా సద్గుణ సంపన్నులైన కథానాయకులుగా లేదా ఏమాత్రం మార్పుకు వీలులేని దుర్మార్గులైన ప్రతినాయకులుగా చిత్రీకరించడానికి తాను ఇష్టపడనని సుబ్బరాజ్ చెప్పారు. నైతిక తీర్పులను ప్రేక్షకుల విచక్షణకే వదిలివేయడం ద్వారా పాత్రలను, వాటి ఉద్దేశాలను తమ సొంత దృక్కోణాల నుంచి పరిశీలించే స్వేచ్ఛను వారికి కల్పించారు.

ప్రతినాయకత్వం కేవలం వ్యక్తులలోనే కాకుండా వారిని తీర్చిదిద్దే సామాజిక ధోరణులు, నిర్మాణాల్లో తరచుగా మూలాలు కలిగి ఉంటుందనే సుబ్బరాజ్ సినీ దృక్పథానికి సంబంధించిన వివరాలను ఈ చర్చా గోష్టి అందించింది.

మంచి, చెడుల గురించిన సాంప్రదాయ భావనలకు అతీతంగా ఆలోచించే సినిమా సామర్థ్యాన్ని సుబ్బరాజ్ ఆలోచనలు స్పష్టం చేశాయి. పాతుకుపోయిన దురభిప్రాయాలను ప్రశ్నించడానికి, సంక్లిష్టమైన సామాజిక వాస్తవాలతో మమేకమయ్యేలా ఇవి ప్రేక్షకులను ప్రోత్సహించాయి. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇతివృత్తమైన ‘విశ్వజనీయ కథల’ను ప్రతిబింబిస్తూ.. నిర్దిష్ట సామాజిక, సాంస్కృతిక సందర్భాలలో రూపుదిద్దుకున్న కథనాలు నైతికత, సానుభూతి, మానవ ప్రవర్తన గురించి సార్వత్రిక ప్రశ్నలను ఎలా లేవనెత్తగలవో ఆయన కథన శైలి తెలియజేస్తోంది.

ఇఫీలోయిడ్ ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2342968
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026