గోవాలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్నడ ఫిల్మ్ మేకర్ శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి. కె (డాక్టర్ ప్రదీప్ కెంచనూరు) ప్రసంగించారు. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ (ఇఫీ) ‘ఇండియన్ పనోరమా’ నాన్ ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ప్రదర్శించిన తన డాక్యుమెంటరీ ‘ది హగ్ ఆఫ్ ఎంప్టీనెస్’ గురించి ఆయన వివరించారు. ఆస్తిని కోల్పోయి అడవి బాట పట్టిన ఒక వ్యక్తి జీవిత కథే 2025లో రూపొందిన ఈ 20 నిమిషాల డాక్యుమెంటరీ. కష్టాలకు ఎదురొడ్డి నిలిచే ధైర్యం, ఆత్మగౌరవం, నిజమైన సంతోషం వంటి అంశాలను ఇది హృద్యంగా ఆవిష్కరిస్తుంది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఫిప్రెస్కీ అంతర్జాతీయ విమర్శకుల బహుమతిని ఈ చిత్రం గెలుచుకుంది.

కర్ణాటకలోని సల్లియా కోఆపరేటివ్ బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తిని.. రుణం తీర్చలేకపోవడంతో 2003లో బ్యాంకు స్వాధీనం చేసుకున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చర్యను సవాలు చేస్తూ ఆయన ప్రారంభించిన న్యాయపోరాటం రెండు దశాబ్దాలకు పైగా సాగుతుంది. ఈ క్రమంలో ఒక ఏకాంత అటవీ ప్రాంతాన్నే తన నివాసంగా మార్చుకున్న ఆయన.. అడవిలో దొరికే తీగలతో బుట్టలు అల్లి, వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. న్యాయం, నిరాశ్రయుల వేదన, ఒంటరితనం, కష్టాలను తట్టుకుని నిలబడే మనిషి మనోధైర్యం వంటి అనేక ప్రశ్నలను ఆయన జీవిత కథ మన ముందుంచుతుంది.
ఈ కథ వైపు తనను ఆకర్షించిన అంశాన్ని వివరిస్తూ.. కేవలం ఆస్తి తగాదా మాత్రమే కాదు, చంద్రశేఖర్ జీవన దృక్పథమే ఈ డాక్యుమెంటరీకి స్ఫూర్తినిచ్చిందని శెట్టి పేర్కొన్నారు. దట్టమైన అడవి, భారీ వర్షాలు, వన్యప్రాణుల మధ్య కరెంటు, రోడ్ల వంటి కనీస సదుపాయాలు కూడా లేకుండా జీవిస్తున్నప్పటికీ చంద్రశేఖర్ తన రోజువారీ జీవితంలో ఒక లయను, ప్రశాంతతను, జీవన గమ్యాన్ని కనుగొన్నారు. భౌతిక సుఖాలతోనే ఆనందాన్ని కొలవక్కర్లేదని, సంతోషానికి ఎన్నో రూపాలు ఉంటాయని దర్శకుడు వివరించారు.
తన సినిమాటిక్ శైలిని వివరిస్తూ... ఆస్తి తగాదాను కేవలం మౌఖిక రూపంలోనే చూపించే సంప్రదాయ పద్ధతికి ఉద్దేశపూర్వకంగానే తాను దూరంగా ఉన్నట్లు శెట్టి తెలిపారు. అలాకాకుండా చంద్రశేఖర్ జీవితంలోని ఒక రోజు కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ ఆయన జీవన శైలిని, అడవితో ఆయనకున్న అనుబంధాన్ని తెరపై సహజంగా ఆవిష్కరించేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు ఆయన వివరించారు.

ఈ సినిమా పేరు వెనుక ఆలోచనను వివరిస్తూ.. గ్రీకు ఫిల్మ్ మేకర్ యోర్గోస్ లాంతిమోస్ చిత్రాలు, మనిషి అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలను అవి చర్చించే విధానం తనకు తాత్విక స్ఫూర్తినిచ్చాయని శ్రీ శెట్టి తెలిపారు. ఇతరులకు శూన్యంగా కనిపించే జీవితంలోనూ లోతయిన అర్థాన్ని కనుగొనవచ్చనే భావాన్ని సినిమా పేరు ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, సినిమాల పట్ల అమితాసక్తి కలిగిన శ్రీ శెట్టి.. 2009 నుంచి ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఇఫీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తనకు సృజనాత్మక స్వేచ్ఛనిస్తూ.. ఒక సన్నిహిత మిత్రుడు అందించిన ఆర్థిక సహకారంతో రూ. 4 లక్షల బడ్జెటుతోనే ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. స్వతంత్రంగా చిత్ర నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను ఆయన వివరించారు. ఒకే రకమైన సృజనాత్మక దృక్పథం ఉండటం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు.
అలీషా మెహ్రోత్రా ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఇఫిలాయిడ్‌ను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***