గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో స్కైలార్క్ చిత్రం ఇండియన్ ప్రీమియర్ అనంతరం పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. దీనిలో చలనచిత్ర దర్శకురాలు, స్క్రీన్ రైటర్ నర్గిజా దోతీవా, నిర్మాత గుల్నారా కాస్మాంబెటోవా మాట్లాడారు. ఈ చిత్రానికి స్ఫూర్తినిచ్చిన నిజ జీవిత అనుభవాలు, మధ్య ఆసియాలో సోవియట్ అనంతర సరిహద్దు విభజనల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ సినిమా ఎలా ప్రదర్శించిందో వివరించారు. అలాగే భారతీయ సినిమా పట్ల తమకున్న అభిమానం గురించి వారు తెలియజేశారు.

కిర్గిజిస్థాన్–తజికిస్థాన్ సరిహద్దుల్లోని వాస్తవ సంఘటనలు, వార్తా కథనాల ఆధారంగా 85 నిమిషాల నిడివితో ఈ కిర్గిజ్ చిత్రం రూపొందింది. శతాబ్దాలుగా కలసి జీవించిన ప్రజలను కొత్తగా ఏర్పాటు చేసిన సరిహద్దులు విడదీశాయి. తన బామ్మ ఎనే పెంపకంలో పెరిగిన ఐబెక్ అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మరణాంతరం, సరిహద్దు ఆవల తజికిస్థాన్‌లోని శ్మశానవాటికలో ఉన్న తన భర్త సమాధి పక్కనే తనను కూడా ఖననం చేయాలని ఆమె కోరుతుంది. ఆమె చివరి కోరికను నెరవేర్చే క్రమంలో నైతికమైన, భావోద్వేగపరమైన పరీక్షను ఐబెక్ ఎదుర్కొంటాడు.
2026 అముర్ ఆటం ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్కైలార్క్ సినిమా గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచింది. ఈ చిత్రం మధ్య ఆసియా మౌఖిక కథన శైలిని సమకాలీన సినిమాతో మేళవిస్తుంది.
సరిహద్దు వెంబడి జరిగిన సంఘటనలే ఈ చిత్రానికి స్ఫూర్తిగా నిలిచాయని దోతీవా తెలియజేశారు. అకస్మాత్తుగా చేసిన విభజనల వల్ల బాట్కెన్ ప్రాంతంలో తమకు ఎంతో పరిచయమైన పచ్చిక బయళ్లు, పూర్వీకుల శ్మశానవాటికలు నిషేధిత ప్రాంతాలుగా ఎలా మారిపోయాయో కాస్మాంబెటోవా వివరించారు. కిర్గిజ్ జానపద కథల ప్రకారం, గొర్రె వీపుపై గూడు కట్టుకునే స్కైలార్క్ పక్షి శాంతి, సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తుంది. సంఘర్షణల మధ్య మానవ సహనాన్ని చాటుతూ ఈ సినిమా అందించే సందేశానికి ఇదే ప్రధాన ఆధారంగా నిలిచింది.

భారత్‌తో తమకున్న సాంస్కృతిక అనుబంధాన్ని చిత్రరూపకర్తలు గుర్తు చేసుకున్నారు. సోవియట్ కాలం నాటి కిర్గిజిస్తాన్‌లో భారతీయ సినిమా తమ బాల్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో వారు వివరించారు. తమ కుటుంబాలతో కలిసి బాలీవుడ్ చిత్రాలను చూడటం, ఇరుగుపొరుగు పిల్లలతో కలిసి ఇంటి ఆవరణల్లో పాటలు పాడటం, డిస్కో డ్యాన్సర్ సినిమాలో మిథున్ చక్రవర్తి నృత్య భంగిమలను అనుకరించడం, ఇతర జ్ఞాపకాలను వారు నెమరువేసుకున్నారు. ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచేందుకు వీలు లేని సమాజంలో భావోద్వేగాలను వ్యక్తం చేసే నూతన మార్గాన్ని భారతీయ చిత్రాలు పరిచయం చేశాయని తెలిపారు.
రాజ్ కపూర్ క్లాసిక్ చిత్రాల నుంచి అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాల వరకు భారతీయ సినిమాల్లో ఆప్యాయత, కథన శైలి, మానవ సంబంధాలకు ఇచ్చే ప్రాధాన్యం... వివిధ తరాలకు చెందిన కిర్గిజిస్తాన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని దర్శకురాలు తెలియజేశారు.
ఈ సమావేశానికి బృందా రణదీప్ సుడాన్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
_20261126144036_49f7b5.jpeg)
పూర్తి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ వీక్షించండి:
Read IFFILOID here:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48