భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)-2026లో 'ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్స్' విభాగంలో ప్రదర్శితమైన హిందీ చలనచిత్రం ‘కృష్ణావతారం’ (కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్) చిత్ర బృందం... ఈ రోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హార్దిక్ గజ్జర్, నిర్మాత సాజన్ రాజ్ కురుప్ మాట్లాడుతూ... అత్యద్భుతమైన దృశ్య వైభవంతో, సమకాలీన సినీ శైలిలో శ్రీకృష్ణుడి జీవిత గాథను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు.
ఈ చిత్రం వెనక గల ప్రధాన ఆలోచన గురించి నిర్మాత సాజన్ రాజ్ కురుప్ మాట్లాడుతూ... భారత్‌లో శ్రీకృష్ణుడిని కేవలం పురాణాల పరిధికి మాత్రమే పరిమితం చేసి చూడలేమని అన్నారు. "భారతదేశంలో కృష్ణుడు పురాణాలకు అతీతుడు. ఆయన ఒక విశ్వాసం, ఒక భావోద్వేగం, మన చరిత్రలో ఒక సజీవ భాగం" అని ఆయన పేర్కొన్నారు. ఆదికేశవ స్వామి కేంద్రంగా సాగే సాంస్కృతిక సంప్రదాయంలో తాను పెరిగానని పేర్కొంటూ, "సమస్తం కృష్ణుడి నుంచే ఉద్భవించింది" అనే తమ విశ్వాసాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీకృష్ణుడి జీవితాన్ని అత్యంత నిజాయతీతో, పరిపూర్ణ గౌరవంతో తెరకెక్కించేందుకు తమ బృందం ఎంతో శ్రద్ధతో పనిచేసిందని ఆయన వివరించారు.

హృదయం, మనస్సు, ఆత్మ అనే మూడు అంశాల చుట్టూ అల్లుకున్న మూడు భాగాల చిత్ర పరంపరలో ‘కృష్ణావతారం’ మొదటి అధ్యాయమని చిత్ర బృందం వెల్లడించింది. రామ్ మోరి రచించిన ‘సత్యభామ’ నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి ప్రకాశ్ కపాడియా, రామ్ మోరి, హార్దిక్ గజ్జర్ స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీమద్భాగవతం, హరివంశం గ్రంథాల స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందింది. బృందావనం, మధురల నుంచి ద్వారకా రాజ్యపాలన వరకు సాగిన శ్రీకృష్ణుడి జీవన ప్రస్థానాన్ని ఈ తొలి భాగం సత్యభామ దృష్టికోణంలో ఆవిష్కరిస్తుంది. మొదటి భాగం ప్రధానంగా ప్రేమ, త్యాగం, విరహం, భక్తి భావాల (హృదయం) చుట్టూ సాగనుండగా... తదుపరి రెండు భాగాలు కృష్ణుడి రాజనీతి, వ్యూహరచన (మనస్సు), భగవద్గీత (ఆత్మ) బోధనలను విశ్లేషించనున్నాయి. శ్రీకృష్ణుడి జీవితంలోని అంతగా తెలియని అరుదైన ఘట్టాలతో రూపొందిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ గుప్తా, సంస్కృతి జయన, సుస్మితా భట్, నివాషిని కృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు.
సంప్రదాయ కథలను ఆధునిక ప్రేక్షకులకు చేరువ చేయాల్సిన అవసరాన్ని దర్శకుడు ప్రస్తావిస్తూ... నేటి యువతరం తమ చరిత్రను ఆసక్తికరమైన సినీ భాషలో తెలుసుకుని, దానికి చేరువయ్యేలా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దామని వివరించారు. "కథ చెప్పే విధానం నిరంతరం మారుతూ ఉంటుంది. అద్భుతమైన దృశ్య అనుభూతులను సృష్టించగలిగే సాంకేతిక యుగంలో మనం జీవించడం మన అదృష్టం" అని చిత్ర బృందం పేర్కొంది. గజ్జర్‌కు ఉన్న వీఎఫ్ఎక్స్ అనుభవాన్ని ఉపయోగించుకుని, అత్యుత్తమ వీఎఫ్ఎక్స్ నిపుణుల పనితనంతో... ఏకంగా 7.5 ఎకరాల భారీ సెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకట్టుకునే లక్ష్యంతో, ఆంగ్లం సహా పలు భాషల్లో ఈ సినిమాను రూపొందించారు.

కథలోని భావోద్వేగాలను ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా చేయడంలో సంగీతం కీలకమని అభిప్రాయపడిన గజ్జర్... సంగీత దర్శకుడు ప్రసాద్‌తో సాగిన తమ సృజనాత్మక ప్రయాణాన్ని వివరించారు. ప్రఖ్యాత సంగీత గురువు డాక్టర్ భరత్ బల్వల్లి పర్యవేక్షణలో, సినిమాలో సాధ్యమైనంత మేర శాస్త్రీయ సంగీత మాధుర్యానికి పెద్దపీట వేశారు. సంప్రదాయ రాగాల స్వచ్ఛత ఏమాత్రం చెక్కుచెదరకుండా, నేటి యువతరాన్ని ఆకట్టుకునే సమకాలీన శైలిని అందులో అందంగా మిళితం చేశారు.
ఈ సమావేశానికి శ్రీ సందీప్ ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
విలేకరుల సమావేశ పూర్తి వీడియోను ఇక్కడ వీక్షించండి:
ఇఫిలాయిడ్ (ఐఎఫ్ఎఫ్ఐఎవ్‌వోఐడి) సంచికను ఇక్కడ చదవండి:
Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***