57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

దర్శకుడు అవతార్ కౌల్ జీవిత, సినీ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తున్న ‘అవతార్ కౌల్: ది (ఇన్)కంప్లీట్ స్టోరీ’

57వ ఇఫీ ముఖాముఖిలో అవతార్ కౌల్ జీవిత విశేషాలు, ఆయన ప్రఖ్యాత చిత్రం ‘27 డౌన్’ , ఆయన అసంపూర్ణ సృజనాత్మక ప్రయాణానికి సంబంధించిన లోతైన అంశాలను పంచుకున్న రచయిత వినోద్ కౌల్

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2026 4:09PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340881Views: 6

సృజనాత్మక ప్రస్థానం అర్థాంతరంగా ముగిసిపోయినప్పటికీ తమ కళాఖండాలతో నేటికీ చిరస్థాయిగా నిలిచిన ఎందరో చిత్రనిర్మాతలను భారతీయ సినిమా చూసింది. అవతార్ కౌల్ కూడా అటువంటి కోవకు చెందిన దర్శకుడే. ఆయన తెరకెక్కించిన ఏకైక చలనచిత్రం ‘27 డౌన్’ (1974), భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక అత్యంత ముఖ్యమైన కళాఖండంగా గుర్తింపు పొందుతోంది. 

పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించిన ‘అవతార్ కౌల్: ది (ఇన్)కంప్లీట్ స్టోరీ’ పుస్తకం అవతార్ కౌల్ జీవిత, సినీ ప్రయాణాలను కళ్లకు కడుతోంది. వినోద్ కౌల్ రాసిన ఈ పుస్తకంలో లేఖలు, అరుదైన ఫోటోలు, వ్యక్తిగత అనుభవాలు, సంభాషణల ద్వారా దర్శకుడి సృజనాత్మక జీవన రేఖలను పొందుపరిచారు. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ)లో  నవంబర్ 21, 2026న ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. 

ఇఫీ  వేదికగా నవంబర్ 23న జరిగిన ముఖాముఖిలో పుస్తక రచయిత వినోద్ కౌల్ మాట్లాడుతూ,  పుస్తక రచన వెనుక ఉన్న స్ఫూర్తిని,  అవతార్ కౌల్ కథను విస్తృత పాఠక లోకానికి చేరువ చేయడానికి తాను చేసిన కృషిని వివరించారు. ఒక చిత్రనిర్మాతపై పుస్తకం రాయాలనే ఆలోచనతో ఈ ప్రయాణం మొదలుకాలేదని ఆయన వెల్లడించారు. తాను రెండో తరగతి చదువుతున్నప్పుడే కన్నుమూసిన తన అంకుల్ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే వ్యక్తిగత ప్రయత్నంగానే ఇది ప్రారంభమైందని వినోద్ కౌల్ తెలిపారు. 

అంకుల్ ఫోటోలు, ఉత్తరాలు, ఇతర డాక్యుమెంట్లను సేకరించడంతో ఈ ప్రయాణం మొదలైందని వినోద్ కౌల్ గుర్తుచేసుకున్నారు. రానురానూ ఆ వ్యక్తిగత శోధన.. అవతార్ కౌల్ జీవిత విశేషాలను, భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన విలువైన సేవలను లోతుగా విశ్లేషించే ప్రయత్నంగా మారింది.

వయసు పెరిగే కొద్దీ ‘27 డౌన్’ సినిమా గొప్పదనం తనకు అర్థమైందని వినోద్ కౌల్ చెప్పారు. ఇంతటి గొప్ప కళాఖండాన్ని తెరకెక్కించిన ప్రతిభావంతుడైన దర్శకుడికి దక్కాల్సినంత గుర్తింపు ఎందుకు రాలేదనే ప్రశ్న తనను ఎప్పుడూ ఆలోచింపచేసేదని, అదే ఆలోచన అవతార్ కౌల్ జీవితంపై లోతుగా పరిశోధించేలా చేసిందని, ఆయన ప్రస్థానాన్ని నేటి తరానికి, రాబోయే దర్శకులకు తెలియజేయాలనే స్ఫూర్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.

పుస్తకానికి ‘ది (ఇన్)కంప్లీట్ స్టోరీ’ అని పేరు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని వినోద్ కౌల్ వివరిస్తూ, అవతార్ కౌల్ వ్యక్తిగత, సినీ విశేషాలపై గతంలో ఎక్కడా సమగ్ర సమాచారం లేదన్నారు. ఆ వివరాలన్నింటినీ ఒకే గ్రంథంగా తీసుకురావడం ద్వారా ఆయన చరిత్రకు ఒక సంపూర్ణత చేకూరిందని చెప్పారు. ఆయన వైవాహిక జీవితం చాలా తక్కువ కాలమే కొనసాగిందని, అలాగే కేవలం ఒకే ఒక్క చిత్రాన్ని మాత్రమే తెరకెక్కించారని, అవతార్ కౌల్ మరికొంత కాలం జీవించి ఉండి ఉంటే మరెన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించి ఉండేవారని రచయిత అభిప్రాయపడ్డారు.

పరిశోధన క్రమంలో తనకు ఎదురైన ఒక భావోద్వేగ ఘటనను వినోద్ కౌల్ గుర్తుచేసుకున్నారు. అమెరికాకు చెందిన తమ ఆంటీ ఆన్ కౌల్ కూడా మరణించారన్న విషయం అప్పటివరకు తమ కుటుంబానికి తెలియదని, పరిశోధనలోనే ఆ చేదు నిజం బయటపడిందని ఆయన వెల్లడించారు. ఆ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ పుస్తక రచనలో భాగంగా ఇలాంటి ఎన్నో ఊహించని, భావోద్వేగభరిత విషయాలు తెలిశాయని ఆయన చెప్పారు.

సినిమాకు, సాహిత్యానికి విడదీయరాని బంధం ఉందని వినోద్ కౌల్ అన్నారు. ఎన్నో గొప్ప సినిమాలు నవలలు, కథలు, సాహిత్య గ్రంథాల ఆధారంగానే రూపుదిద్దుకున్నాయని ఆయన గుర్తుచేశారు. సినిమా - సాహిత్యాల మధ్య ఉన్న ఈ సంబంధాన్ని చాటిచెప్పేందుకు, సినీ ప్రముఖుల చరిత్రను పాఠకుల ముందుకు తెచ్చేందుకు పబ్లికేషన్స్ డివిజన్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. అవతార్ కౌల్ జీవిత విశేషాలను అందరికీ చేరువ చేసే అవకాశం కల్పించినందుకు ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

యువ దర్శకులు తమ సృజనాత్మక ఆలోచనలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలన్నదే అవతార్ కౌల్ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠమని వినోద్ కౌల్ అన్నారు. ‘జంజీర్’, ‘బాబీ’, ‘యాదోం కీ బారాత్’ లాంటి కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న కాలంలోనూ, ఆయన తన అభిరుచికి తగ్గట్టుగా ఆర్ట్ ఫిల్మ్ తీయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ‘27 డౌన్’ సినిమాలోని కథనం, నిర్మాణ శైలి, అందులోని సందేశాన్ని నేటి యువ చిత్రనిర్మాతలు తప్పక అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.

సినీ వారసత్వ పరిరక్షణ

‘అవతార్ కౌల్: ది (ఇన్)కంప్లీట్ స్టోరీ’ కేవలం ఒక దర్శకుడి జీవిత విశేషాల నమోదు మాత్రమే కాదు. వ్యక్తిగత జ్ఞాపకాలను భారతీయ సినిమా చరిత్రలోని ఒక కీలక ఘట్టంతో జోడించే ప్రయత్నం. తన అంకుల్ గురించి అర్థం చేసుకోవాలనే ఒక యువకుడి ఆరాటంతో మొదలైన ఈ శోధన చివరకు అవతార్ కౌల్ జీవన ప్రస్థానాన్ని, ఆయన సినీ సేవలను తిరిగి ప్రజాస్మృతిలోకి తెచ్చే మహత్కార్యంగా మారింది.

ఈ పుస్తకం  అవతార్ కౌల్ లాంటి దర్శకుల కృషిని భావితరాలకు నిక్షిప్తం చేయడంతో పాటు, వారి సినీ వారసత్వాన్ని నేటి తరం పాఠకులు, విద్యార్థులు, సినీ అభిమానులకు చేరువ చేయాలన్న పబ్లికేషన్స్ డివిజన్ సంకల్పాన్ని చాటుతోంది. 

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340881
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026