57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఇఫి 2026లో గోవా సినీ భవిష్యత్తుపై చర్చ.. సినిమా నిర్మాణానికి గోవాలోని అవకాశాలు, ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక వారసత్వంపై సినీ ప్రముఖుల పరిశీలన

నాడు పోస్టు చేయడమైనది: 23 NOV 2026 5:01PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340745Views: 3

గోవా, 23 నవంబర్‌ 2026: సినిమా నిర్మాణానికి గోవాలో ఉన్న అవకాశాలు, చలనచిత్ర సంబంధిత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం, ఆ రాష్ట్ర విశిష్టమైన ప్రకృతి, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం వంటి అంశాలు 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఇఫి) జరిగిన ‘గోవా ఇన్‌ సినిమా’ అనే ఆసక్తికరమైన చర్చా కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి.

కొంకణి, హిందీ, అంతర్జాతీయ సినిమా రంగాల అభిప్రాయాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ చర్చలో ప్రముఖ కొంకణి దర్శకుడు రాజేంద్ర తలక్‌, హిందీ చిత్ర దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత విజయ్‌ కృష్ణ ఆచార్య, ఫ్రెంచ్‌ నటి మరియాన్నే బోర్గో పాల్గొన్నారు. సినీ విమర్శకుడు సచిన్‌ చాట్టే ఈ చర్చను నిర్వహించారు.

సినిమా నిర్మాణానికి ప్రముఖ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం గోవాకు ఉందని విజయ్‌ కృష్ణ ఆచార్య అన్నారు.  రాష్ట్రంలోని ప్రత్యేకమైన దృశ్య, సాంస్కృతిక ఆకర్షణలను ఆయన ప్రస్తావించారు. ఇవి ఎన్నో ఏళ్లుగా దర్శకులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాన సినిమాల చిత్రీకరణ ప్రదేశాలకు భిన్నంగా గోవాకు ప్రత్యేకమైన, విలక్షణమైన గుర్తింపు ఉందని అన్నారు. ‘కభీ హాన్‌ కభీ నా’ సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. అందులోని పాత్రలు, కథా నేపథ్యం గోవాతో సహజంగా మమేకమై ఉన్నాయని, ఆ కథ గోవాలోనే అద్భుతంగా రూపుదిద్దుకోగలిగిందని ఆయన పేర్కొన్నారు.

 

సినిమా నిర్మాణం ఆర్థికంగా లాభదాయకంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. వివిధ బడ్జెట్‌ స్థాయిల్లో చిత్రీకరణలు జరిపేందుకు వీలుగా గోవాలో ఫిల్మ్‌ సిటీని ఏర్పాటు చేయాలని ఆచార్య సూచించారు. ‘‘సినిమా నిర్మాణంలో ఖర్చు కీలకమైన అంశం. పోటీ ధరలకు తగిన మౌలిక సదుపాయాలు అందిస్తే గోవా మరిన్ని సినిమా నిర్మాణాలను ఆకర్షించగలదు’’ అని ఆయన పేర్కొన్నారు. స్థానికులకు చలనచిత్ర రంగంలో వృత్తిపరమైన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఫిల్మ్‌ స్కూళ్లు, సినిమా అవగాహన కేంద్రాలకు ఉన్న అవకాశాలను కూడా ఆయన వివరించారు. ఇటువంటి కార్యక్రమాలు తరతరాలపై ప్రభావం చూపడంతో పాటు, గోవాను ప్రత్యేకమైన కళా కేంద్రంగా తీర్చిదిద్దగలవని అన్నారు.

 

గోవాలో ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేయడం ఎంతవరకు సాధ్యమనే అంశంపై రాజేంద్ర తలక్‌ సందేహాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సినిమా నిర్మాణాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రకృతి దృశ్యాలు, సంప్రదాయ గృహాలు, వారసత్వ కట్టడాలు చిత్రీకరణకు విభిన్న నేపథ్యాలను అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే, సినిమా నిర్మాణాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు గోవా సాంస్కృతిక గుర్తింపు, సహజ పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఉండాలని ఆయన తెలిపారు.

 

చిత్రీకరణ ప్రదేశంగా గోవాలోని చాలా ప్రాంతాలు ఇంకా అన్వేషణకు నోచుకోలేదని తలక్‌ పేర్కొన్నారు. ‘‘గోవాలో కేవలం పది శాతం ప్రాంతాలనే ఇప్పటివరకు అన్వేషించారు’’ అని ఆయన అన్నారు. కొత్త ప్రదేశాలను కనుగొని, రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాలకు సహజంగా సరిపోయే కథలను రూపొందించేందుకు చిత్రనిర్మాతలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే ఉన్న ప్రకృతి దృశ్యాలను అన్వేషించి, వాటికి సహజంగా సరిపోయే కథలను గుర్తించాలని సూచించారు.

గోవాలోనే నివాసం ఏర్పరుచుకున్న మరియాన్నే బోర్గో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మౌలిక సదుపాయాల ప్రాధాన్యాన్ని అంగీకరిస్తూనే, రాష్ట్రంలోని సహజ పర్యావరణం, సంప్రదాయ గృహాలు, సాంస్కృతిక వారసత్వం విలువను ఆమె వివరించారు. గోవా ప్రత్యేకతను కాపాడేలా చిత్రీకరణ కార్యక్రమాలను సున్నితత్వంతో, బాధ్యతాయుతంగా చేపట్టాలని చిత్రనిర్మాతలకు సూచించారు. ఇఫిలో తాను వీక్షించిన ‘ఓ మరియా’ సినిమా ద్వారా కొంకణి సినిమారంగంలో అద్భుతమైన ప్రతిభను గుర్తించిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు.

 

సినిమాల్లో గోవాను, అక్కడి ప్రజలను మూసధోరణిలో చిత్రీకరించే అంశంపైనా ఈ చర్చలో ప్రస్తావన వచ్చింది. గోవాను మరింత విభిన్న కోణాల్లో చూపించే కథలను అన్వేషించేందుకు, వైవిధ్యభరితమైన సినీ చిత్రణను ప్రేక్షకులకు అందించేందుకు దర్శకులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా వివరించారు.

ఇఫిలోయిడ్‌ గురించి ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340745
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026