57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

చండీగఢ్ నగర రూపకల్పనలో మాసియెజ్ నొవికీ కీలక పాత్ర.. ఇఫీ 2026లో ఆ అరుదైన చరిత్రను ఆవిష్కరించిన ‘నిర్మాంజలి’

స్వాతంత్య్రానంతర భారత పట్టణ ప్రణాళికలో పోలిష్‌ - అమెరికన్‌ వాస్తుశిల్పి మార్గదర్శక పాత్రను ఆవిష్కరించిన డాక్యుమెంటరీ

నాడు పోస్టు చేయడమైనది: 23 NOV 2026 4:40PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340741Views: 2

గోవా, 23 నవంబర్ 2026: గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) సందర్భంగా నేడు పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ చిత్ర దర్శకుడు సూరజ్‌ కుమార్‌ ఒక అరుదైన చారిత్రక వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చారు. ‘నిర్మాంజలి: ది చండీగఢ్‌ ఆఫ్‌ మాసీజ్‌ నోవికీ’ అనే తన నాన్‌ - ఫీచర్‌ డాక్యుమెంటరీ ద్వారా వాస్తుశిల్పి మాసీజ్‌ నోవికీ చండీగఢ్‌ నగర నిర్మాణానికి అందించిన విశేష కృషిని ఆయన పరిచయం చేశారు.

పటిష్టమైన, భారీ కట్టడాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడానికి బదులుగా, భారత వాతావరణ పరిస్థితులు, సామాజిక జీవనశైలికి అనుగుణంగా నోవికీ తన డిజైన్లను రూపొందించారు. కృత్రిమ జలాశయాన్ని నిర్మించాలన్న ఆయన ఆలోచనే తరువాత సుఖ్నా సరస్సుగా రూపుదిద్దుకుంది. పాఠశాలలు, ఉద్యానవనాలు, మార్కెట్లు, సామాజిక కార్యకలాపాలకు అవసరమైన ప్రదేశాలతో కూడిన స్వయం సమృద్ధి నివాస సముదాయాలైన ‘సూపర్‌బ్లాక్‌’లను కూడా ఆయన ప్రతిపాదించారు. అయితే, తన ఆలోచనలను అమలు చేసేందుకు 1950లో తిరిగి భారత్‌కు రావడానికి సిద్ధమవుతున్న తరుణంలో నోవికీ విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన రూపొందించిన చిత్రపటాలు, డిజైన్ల ద్వారా ఆ ఆలోచనలు సజీవంగా నిలిచాయి. వాటిని గుర్తించిన స్విస్‌ వాస్తుశిల్పి పియెర్‌ జెన్నెరెట్‌ చండీగఢ్‌లోని 7, 8వ సెక్టార్ల అభివృద్ధిలో వాటిని పొందుపరిచారు.

అంతగా వెలుగులోకి రాని ఈ చరిత్రను పునర్నిర్మించేందుకు భారత్‌తో పాటు విదేశాల్లోనూ విస్తృతమైన ఆర్కైవ్‌ పరిశోధన చేయాల్సి వచ్చిందని సూరజ్‌ కుమార్‌ తెలిపారు. చండీగఢ్‌ ఆర్కిటెక్చర్‌ మ్యూజియంలో నోవికీకి సంబంధించిన 20 నుంచి 25 వరకు మాత్రమే నమూనాలు, డిజైన్లు భద్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘ది ట్రిబ్యూన్‌’ పాత సంచికలను పరిశీలించడంతో పాటు, నోవికీ ఆర్కిటెక్చర్‌ విభాగాధిపతిగా పనిచేసిన నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీలో డిజిటల్‌ రూపంలో భద్రపరిచిన రూపకల్పన నోట్స్‌ను కూడా అన్వేషించినట్టు తెలిపారు.  పోలాండ్‌ రాయబారి సూచన మేరకు చేపట్టిన ఈ పరిశోధనకు పోలాండ్‌ రాయబార కార్యాలయం, పోలిష్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహకారం అందించాయి.

75 ఏళ్ల క్రితం నోవికీ రూపొందించిన నగర నిర్మాణ ప్రణాళికలు నేడు అధిక ఉష్ణోగ్రతలు, పట్టణాల విస్తరణ వంటి సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయ నగరాలకు విలువైన పాఠాలను అందిస్తాయని శ్రీ కుమార్ పేర్కొన్నారు. ఆధునిక వాస్తుశిల్పం స్థానిక వాతావరణ పరిస్థితులకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

సూరజ్‌ కుమార్‌, డాక్టర్‌ గరిమా సింగ్‌ నేతృత్వంలోని జాన్సన్స్‌ సూరజ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ (జేఎస్ఎఫ్ఐ) సంస్థ ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించింది. ‘నిర్మాంజలి’ చిత్రానికి ముర్తజా అలీ ఖాన్‌ స్క్రీన్‌ప్లే అందించగా రాకేశ్‌ రాణా ఛాయాగ్రహణం, అమిత్‌ రాయ్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. శుభేంద్రరావు, సాస్కియా రావు - డి హాస్‌ సంగీతం సమకూర్చారు. ప్రముఖ సీనియర్‌ నటుడు విక్టర్‌ బెనర్జీ కూడా ఈ చిత్రంలో నటించారు. భారతీయ మాస్‌ కమ్యూనికేషన్‌ సంస్థ (ఐఐఎంసీ) పూర్వ విద్యార్థి సూరజ్‌ కుమార్‌కు డాక్యుమెంటరీలు, ఫీచర్‌ చిత్రాల నిర్మాణంలో 27 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటివరకు 500కు పైగా డాక్యుమెంటరీలు రూపొందించిన ఆయన ‘థింకింగ్‌ ఆఫ్‌ హిమ్‌’, ‘పిప్లాంత్రి’ వంటి చిత్రాలను కూడా తెరకెక్కించారు.

విలేకరుల సమావేశానికి శ్రీమతి అరుషి బబ్బర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Watch Press conference here:

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

****


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340741
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026