57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

"గంగా నది ఒడిలో పరిఢవిల్లిన వేల ఏళ్ల జీవన అనుభవాలు": ఇఫీలో బనారస్ కోసం ఒక్కటైన భరత్ బాలా, ఏ.ఆర్. రెహమాన్

గంగానది తీరంలో సంగీతం, జ్ఞాపకాలు, వారసత్వాల నేపథ్యంలో ఆత్మీయంగా సాగే తండ్రీకూతుళ్ల కథ, ఇండియన్ పనోరమా విభాగంలో భారత ప్రీమియర్ ప్రదర్శన

సరికొత్త రాగాలతో రెహమాన్ ప్రయోగం: బనారస్ కోసం అరుదైన దేవ గాంధార రాగాన్ని ఎంచుకున్న రెహమాన్

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2026 7:29PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340287Views: 4

ప్రముఖ చిత్ర నిర్మాత భరత్ బాలా, సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్‌తో కలిసి బనారస్ చిత్రం కోసం మరోసారి పనిచేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం గోవాలో జరిగే 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీలోని ఇండియన్ పనోరమా విభాగానికి ఎంపికైంది. భారత్‌లో తొలిసారిగా ఈ వేదికపై ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అభిషేక్ బెనర్జీ, షహానా గోస్వామి, నీరజ్ కబీ, ఛాయా కదమ్, ఇందిరా తివారీ, ఆంటోనీథాసన్ జేసుథాసన్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

భారత శాస్త్రీయ సంగీత సాంస్కృతిక నేపథ్యంలో రూపొందిన బనారస్ చిత్రం... తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, సంగీత వారసత్వం, తరతరాలుగా కొనసాగే శాశ్వత బంధాలను ఆవిష్కరిస్తుంది. దర్శకుడు భరత్ బాలా అభివర్ణించినట్లుగా... "గంగా నది నిత్య చైతన్య స్ఫూర్తి" నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

చిత్ర సంగీతం గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ మాట్లాడారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలతో సృజనాత్మక ప్రయాణంలో భారతీయ శాస్త్రీయ సంగీతం నిరంతర స్ఫూర్తిదాయకంగా నిలిచిందని పేర్కొన్నారు. సంగీతాన్ని వ్యక్తపరిచే తీరుని రాగాలు, వాటితో ముడిపడి ఉన్న భావోద్వేగాలు నిరంతరం తీర్చిదిద్దుతున్నాయని తెలిపారు.

చిత్ర సంగీతం పట్ల తన దృక్పథాన్ని వివరిస్తూ... స్వరకల్పనలో రాగాలను మేళవించటం గురించి రెహమాన్ మాట్లాడారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తుచేసుకుంటూ... అది సంగీత అన్వేషణకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని అన్నారు. "నేను ప్రతి సంస్కృతిని ఆస్వాదిస్తాను" అని తెలిపారు. పంజాబీ భాషలోని శక్తివంతమైన గుణం నుంచి బెంగాలీలోని మాధుర్యం వరకు ప్రతి భాషకూ ప్రత్యేకత ఉంటుందని తెలిపారు. తన సంగీతంలో వివిధ భాషలు, వాటి సాంస్కృతిక సారాంశాలు పరస్పరం సమ్మిళితమయ్యేలా నిరంతరం కృషి చేస్తారని చెప్పారు.

మరియన్ చిత్రం తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి పూర్తిస్థాయి చలనచిత్ర నిర్మాణంలోకి రావటం గురించి భరత్ బాలా మాట్లాడారు. ఈ మధ్య కాలంలో పలు లఘు చిత్రాలకు పనిచేసినట్లు వెల్లడించారు. తప్పనిసరిగా చెప్పాల్సిన కథ ఎదురైనప్పుడు చేపట్టే సృజనాత్మక ప్రక్రియకు కొనసాగింపుగా చలనచిత్ర నిర్మాణాన్ని భావిస్తానని తెలిపారు.

బనారస్ నగరాన్ని తెరపై అనేక కోణాల్లో ఆవిష్కరించినప్పటికీ, ఆ నగరం గురించి తెలుసుకోవాల్సినది ఇంకా ఎంతో ఉందని బాలా అన్నారు. "గంగా నది ఒడిలో పరిఢవిల్లిన వేల ఏళ్ల జీవన అనుభవాలతో రూపుదిద్దుకున్న ప్రదేశం"గా ఆ నగరాన్ని అభివర్ణించారు.

కాంతి, కెమెరా కోణాలు, ఫ్రేమింగ్, అమరిక సాయంతో నటీనటుల ముఖాల్లోని "భావోద్వేగాలను ఒడిసిపట్టటమే" ప్రధాన లక్ష్యమని సినిమాటోగ్రాఫర్ మార్క్ కొనింక్స్ పేర్కొన్నారు. కేవలం బయటి వ్యక్తులుగా ప్రేక్షకులు సినిమాను చూడకుండా... తాము కూడా అందులో భాగమనే అనుభూతిని కలిగించటమే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు.

"కెమెరా సంగీతం లాంటిది" అని అభివర్ణించిన ఆయన... రంగులు, దృశ్య అంశాలను సముచితంగా మేళవించటం ద్వారా విజువల్ రిథమ్ ఎలా సృష్టిస్తారో వివరించారు. "అతిగా రంగుల వాడకం వల్ల అసలు రంగుల ప్రాధాన్యత తగ్గిపోతుంది" అని పేర్కొంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు, భావోద్వేగాలను రేకెత్తించేందుకు రంగులను ఎంపిక చేసుకుని వాడటం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కుంభమేళాలో ప్రత్యక్షంగా చిత్రీకరణ జరిపే సమయంలో ఈ విధానం ఎంతో కీలకంగా మారిందన్నారు.

తాను పోషించే పాత్రలు నిజ జీవితంపై చూపే దీర్ఘకాలిక ప్రభావాన్ని నటుడు నీరజ్ కబీ గుర్తు చేసుకున్నారు. ఆ పాత్రలు తన వ్యక్తిత్వంలో భాగమైపోతాయని చెప్పారు. 'బనారస్' చిత్రంలో ఆయన మతిమరుపు వ్యాధితో బాధపడే వ్యక్తి పాత్రను పోషించారు. ఈ పాత్రలో నటించటం వల్ల భవిష్యత్తు లేని, వర్తమాన స్పృహ కూడా ఉండని బాల్యపు రోజులు గుర్తుకు వచ్చాయని తెలిపారు.

నియంత్రిత స్టూడియో సెట్లలో పనిచేయటానికి భిన్నంగా, మహా కుంభమేళాలో ప్రత్యక్షంగా చిత్రీకరణ జరపటంలో ఎదురైన సవాళ్లు, సహజత్వం గురించి నటుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడారు. భారీ జనసందోహం మధ్య నటించటం అనిశ్చితితో కూడినదని, అందువల్ల నటుడు, దర్శకుడికి మధ్య విశ్వాసం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ఈ అనుభవం కళాశాల రోజుల్లో చేసిన వీధి నాటకాలను గుర్తుచేసిందని చెప్పారు. ఈ చిత్రీకరణను "స్ట్రీట్ సినిమా"గా ఆయన అభివర్ణించారు. ఇది నటుడిగానే కాకుండా వ్యక్తిగా కూడా తనలో ఎంతో మార్పు తెచ్చిందని చెప్పారు.

తాను సంగీతం అందించిన 'బనారస్', 'రామాయణ్' చిత్రాలను 57వ ఇఫీ వేడుకల్లో ప్రదర్శించటం పట్ల రెహమాన్ హర్షం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన సినీ కథనాలను ప్రోత్సహించే ఈ ఉత్సవ స్ఫూర్తికి, భారతీయ కథన సంప్రదాయాల్లో సంగీతానికున్న చిరస్థాయి పాత్రను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సెషన్‌కు సమన్వయకర్తగా శ్రీ మహేశ్ కుమార్ వ్యవహరించారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఇక్కడ చూడవచ్చు:

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340287
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026