గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ 2026) వేదికగా ప్రచురణల విభాగం స్టాల్‌ను (స్టాల్ నంబర్ 24) నేడు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్, ప్రచురణల విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీమతి కాంచన్ ప్రసాద్‌లు ప్రారంభించారు.
57వ ఇఫీ ఎడిషన్ 2026 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో నిర్వహిస్తున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ దర్శకులు, సినీ అభిమానులు, పరిశ్రమ నిపుణులు, ప్రతినిధులను ఇది ఒకే వేదికపైకి తీసుకువస్తోంది.
స్టాల్ నంబర్ 24 వద్ద ప్రచురణల విభాగం ఏర్పాటు చేసిన స్టాల్‌లో భారతదేశపు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, చరిత్ర, కళలు, సినిమా, సాహిత్యం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర అంశాల పరిధిలో విభిన్నమైన పుస్తకాలు, ప్రచురణల సమాహారం ఉంది. దేశంలోని సాంస్కృతిక వైవిధ్యం, సృజనాత్మక సంప్రదాయాలు, మేధో వారసత్వాన్ని ప్రతిబింబించే సమాచారపూర్ణమైన, విజ్ఞానాన్ని పెంపొందించే ప్రచురణలను పరిశీలించే అవకాశాన్ని ఈ స్టాల్ సందర్శకులకు కల్పిస్తోంది.
భారతీయ సినిమాకు సంబంధించిన ప్రచురణలపై ప్రత్యేక దృష్టి సారించారు. తద్వారా సినిమా పరిణామ క్రమం, సినీ దర్శకుల సృజనాత్మక ప్రస్థానాలు, భారతదేశ సినీ వారసత్వానికి ప్రముఖ వ్యక్తులు అందించిన తోడ్పాటు గురించి మరింత లోతైన అవగాహన పొందే అవకాశాన్ని ఇది సినీ అభిమానులు, విద్యార్థులు, పరిశోధకులు, ప్రతినిధులకు కల్పిస్తోంది.
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రముఖ ప్రచురణ సంస్థ అయిన ప్రచురణల విభాగం 1941 నుంచి విస్తృత శ్రేణి అంశాలపై పుస్తకాలు, పత్రికలను ప్రచురిస్తోంది. తన ప్రచురణల ద్వారా భారతదేశపు సాహిత్య, చారిత్రక, సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని పరిరక్షించడంలోనూ విస్తృతంగా వ్యాప్తి చేయడంలోనూ ఈ విభాగం నిరంతరం కృషి చేస్తోంది.
ఇఫీ 2026లో ప్రచురణల విభాగం పాల్గొనడం.. పఠనాన్ని ప్రోత్సహించడానికి, పుస్తకాలతో అనుబంధాన్ని పెంపొందించడానికి, విలువైన విజ్ఞానాన్ని మరింత విస్తృత ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆ విభాగం చేస్తున్న నిరంతర కృషిలో భాగంగా నిలుస్తోంది.
ఈ స్టాల్ సినిమాను సాహిత్యంతో అనుసంధానించే వేదికగా పనిచేస్తూ తెరవెనుక, తెరను దాటి ఉన్న భారతదేశపు సుసంపన్నమైన కథన సంప్రదాయాలను అన్వేషించే అవకాశాన్ని చలనచిత్రోత్సవ ప్రతినిధులకు, సందర్శకులకు కల్పిస్తోంది.
ఈ చలనచిత్రోత్సవంలో తన ఉనికి ద్వారా పఠన సంస్కృతిని ప్రోత్సహించడానికి, భారతదేశ సృజనాత్మక విజయాలను వేడుకగా జరుపుకోవడానికి.. ప్రస్తుత, భవిష్యత్ తరాల కోసం దేశ సాంస్కృతిక, సాహిత్య వారసత్వాన్ని పరిరక్షించడానికి తన నిబద్ధతను ప్రచురణల విభాగం పునరుద్ఘాటిస్తోంది.
ఇఫీలోయిడ్ ఇక్కడ చదవండి- https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***