గిరీశ్ కాసరవల్లి దృష్టిలో సినిమా అంటే కేవలం కథలు చెప్పే కళ మాత్రమే కాదు. సమాజం చూడటానికి నిరాకరించే వాస్తవ గాథలను ధైర్యంగా ఎదుర్కొనే ఒక సాధనం. కుల, సామాజిక అసమానతల నుంచి మతపరమైన ఆధిపత్యం, బలహీన వర్గాల అణచివేత వరకు - మనుషులను వేరు చేసి చూసే దుర్మార్గం ఆయన ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నిరంతరం ప్రధాన ఇతివృత్తంగా కొనసాగింది. గోవాలోని కళా అకాడమీలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వేదికగా సమాంతర సినిమా నైతిక ప్రపంచం- గిరీశ్ కాసరవల్లి 50 ఏళ్ల ప్రస్థానం (ది మోరల్ యూనివర్స్ ఆఫ్ పారలల్ సినిమా - 50 ఇయర్స్ ఆఫ్ గిరీశ్ కాసరవల్లి’) అంశంపై నేడు నిర్వహించిన ముఖాముఖి సదస్సులో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
1977లో తన తొలి చిత్రం ‘ఘటశ్రాద్ధ’తో ప్రారంభమైన ఆయన విశిష్ట సినీ ప్రస్థానం ‘తబరన కథె’, ‘థాయి సాహెబా’, ‘ద్వీప’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాల వరకు కొనసాగింది. కన్నడ చిత్రసీమకు చెందిన ఈ ప్రముఖ దర్శకుడు 14 సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్న ఘనత సాధించారు. వాణిజ్య సినిమాలు, కళాత్మక చిత్రాల మధ్య సంప్రదాయంగా ఉన్న విభజనను ఆయన ప్రశ్నించారు. ప్రతి సినిమా వ్యక్తీకరణ వెనుక ఏదో ఒక భావజాలం తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘కేవలం వినోదం మాత్రమే అందించే సినిమా అంటూ ఏదీ లేదు. వినోదం కూడా ఒక రాజకీయ వ్యక్తీకరణే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చిత్ర దర్శకులు ఆధిపత్య సామాజిక భావజాలాలకు మద్దతు ఇవ్వడమో, వాటిని సవాలు చేయడమో అనివార్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
నూతన కన్నడ సినిమా పరిణామ క్రమాన్ని వివరిస్తూ, ఇతరుల నుంచి అరువు తెచ్చుకున్న పద్ధతులకు బదులుగా భారతదేశ సామాజిక, సాంస్కృతిక వాస్తవాల నుంచి పుట్టుకొచ్చిన స్వతంత్ర చలనచిత్ర భాషను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘సినిమా శైలిని బయట నుంచి బలవంతంగా ఆపాదించలేం. అది సినిమాలోని ఇతివృత్తం నుంచే సహజంగా రూపుదిద్దుకుంటుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. తన కథన శైలిని వివరిస్తూ, ‘‘కథలోని సంఘటనల క్రమం ముఖ్యం కాదు. ఆ కథను చూసే దృక్పథం ముఖ్యం’’ అని పేర్కొన్నారు. బలహీన వర్గాలను అణగదొక్కడం, సమాజం నుంచి వెలివేయడం వంటి ‘వేరుగా చూడటం’ అనే సామాజిక వివక్ష తన చిత్రాల్లో పదేపదే ప్రతిబింబించే ప్రధాన అంశమని ఆయన గుర్తుచేశారు.
సరళమైన నైతిక నిర్ధారణలను తిరస్కరిస్తూ, సినిమా ప్రేక్షకులకు ఆలోచన కలిగించాలే తప్ప, ఏది సరైనదో, ఏది తప్పో నిర్దేశించకూడదని కాసరవల్లి అభిప్రాయపడ్డారు. ప్రతి సమాధానాన్ని ఒక ‘కానీ’తో ముగించాలన్న రచయిత యు.ఆర్. అనంతమూర్తి శైలిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ‘‘సినిమా ద్వారా ‘ఇదే సరైనది, ఇదే తప్పు’ అని చెప్పడమే తప్పు. నేను సులభంగా ఎలాంటి తీర్పులూ ఇవ్వను. ఎందుకంటే అలా చేయడం వల్ల ప్రేక్షకులు ఆలోచించాల్సి వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ఆయన చిత్రాల్లో మహిళల చిత్రణ, వారు ప్రదర్శించే అసాధారణమైన మనోధైర్యం గురించి కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చింది. ‘ద్వీప’ చిత్రాన్ని ఉదాహరణగా తీసుకుంటూ, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో కథానాయిక నాగి అనుసరించే ఆచరణాత్మక వైఖరిని ఆయన వివరించారు. ‘‘వర్తమానాన్ని ఆహ్లాదకరంగా మలచుకుందాం’’ అన్న నాగి మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలచుకోవడంలో, జీవితంలోని అనిశ్చితులను ధైర్యంగా ఎదుర్కోవడంలో మహిళలు తరచూ అసాధారణమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
తన సృజనాత్మక ప్రక్రియ గురించి వివరిస్తూ, స్టోరీబోర్డుల కంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించిన స్క్రిప్టులకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కాసరవల్లి తెలిపారు. తద్వారా తన మనసులో రూపుదిద్దుకున్న దృశ్యకల్పనను సహచరులు తెరపై ఆవిష్కరించేందుకు వీలవుతుందని వివరించారు. ‘‘సినిమా నా మనసులో రూపుదిద్దుకుంటుంది. కానీ దాన్ని తెరపై ఆవిష్కరించేది ఇతరులే’’ అని ఆయన అన్నారు. సినిమా నిర్మాణం అనేది సమష్టి కృషితో కూడుకున్న ప్రక్రియ అని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. అంతిమంగా సినిమా అంటే కేవలం కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేయడం మాత్రమే కాదని, ప్రేక్షకులకు ఒక అనుభూతిని అందించడమేనని ఆయన పేర్కొన్నారు.
సాంస్కృతిక మూలాలకు విలువ ఇవ్వాలనే బలమైన విజ్ఞప్తితో ఉపన్యాసాన్ని ముగిస్తూ, జూలియో గార్సియా ఎస్పినోసా ప్రతిపాదించిన ‘ఇంపర్‌ఫెక్ట్ సినిమా’ తాత్వికతను కాసరవల్లి ఉటంకించారు. ఇతరులు విధించిన కొలమానాలతో పోల్చుకోకుండా, భారతీయ దర్శకులు తమ సొంత సాంస్కృతిక, దృశ్యపరమైన గుర్తింపులకు కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. "ఇతరుల ప్రమాణాలతో నేను ‘పరిపూర్ణుడిని’ అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది? నా చుట్టూ ఉన్న వాతావరణానికి, మూలాలకు నేను కట్టుబడి ఉండాలి" అని ఆయన ఉద్ఘాటించారు.
సంప్రదాయాలను సవాలు చేస్తూ, సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ, మానవ గౌరవం, అంతరాత్మలోని సంక్లిష్టతలను అన్వేషిస్తూ ఐదు దశాబ్దాలుగా భారతీయ సినిమాకు విశేష సేవలందిస్తున్న ఒక గొప్ప చిత్రనిర్మాత సినీ ప్రస్థానాన్ని ఈ సదస్సు సమగ్రంగా, స్పూర్తిదాయకంగా ఆవిష్కరించింది. దేశంలోని వైవిధ్యభరితమైన సాంస్కృతిక అనుభవాలలో పాతుకుపోయి, తనకంటూ ఒక సొంత గొంతుకను ఏర్పరుచుకోవడంలోనే భారతీయ సినిమా అసలైన బలం దాగి ఉందనే విషయాన్ని ఆయన ఆలోచనలు మరోసారి గుర్తుచేశాయి.
ఈ ప్రత్యేక సంభాషణ కార్యక్రమాన్ని పేరొందిన సినీ జర్నలిస్ట్, విమర్శకుడు, రచయిత నమన్ రామచంద్రన్ నిర్వహించారు.
Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***