ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో ఇది కీలక పురోగతి: తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే 1 కోటి హెచ్‌పీవీ టీకా డోసుల పంపిణీతో చారిత్రాత్మక ఘనతను సాధించిన భారత్

· 14 ఏళ్ల బాలికల వార్షిక లక్ష్యంలో దాదాపు 87 శాతం కవరేజీని సాధించిన జాతీయ హెచ్‌పీవీ టీకా కార్యక్రమం... 2026 ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

· పెరుగుతున్న ప్రజా విశ్వాసం, బలమైన కేంద్ర-రాష్ట్ర సమన్వయాన్ని తెలియజేస్తోన్న దేశవ్యాప్త హెచ్‌పీవీ టీకా కార్యక్రమం

· గుర్తించిన లక్షిత ప్రజల్లో 100 శాతం కవరేజీని సాధించిన ఆరు రాష్ట్రాలు (గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మిజోరం, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు)

· 29.33 లక్షలకు పైగా బాలికలకు టీకా వేసి దేశంలోనే అగ్రగామిగా నిలచిన ఉత్తరప్రదేశ్... 13.70 లక్షలతో రెండో స్థానంలో బీహార్... 7.75 లక్షలతో మూడో స్థానంలో నిలిచిన గుజరాత్

· దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో తల్లిదండ్రుల అనుమతితో 14 ఏళ్ల బాలికలకు ఉచిత, సురక్షిత, స్వచ్ఛంద సింగిల్-డోస్ హెచ్‌పీవీ టీకా పంపిణీ

· రియల్-టైమ్ పర్యవేక్షణ, లబ్ధిదారుల ట్రాకింగ్, టీకా స్లాట్ బుకింగ్, డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను అందిస్తూ పారదర్శకత, అందుబాటును బలోపేతం చేస్తున్న యూ-విన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్

· టీకా తర్వాత అరుదుగా తలెత్తే ప్రతికూల ఘటనల (ఏఈఎఫ్ఐ) నిర్వహణ కోసం 24 గంటల ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లతో పాటు శిక్షణ పొందిన వైద్య అధికారుల పర్యవేక్షణలో అన్ని హెచ్‌పీవీ టీకా సెషన్ల నిర్వహణ

· అర్హులైన ప్రతి బాలికకూ టీకా అందించడానికి, నివారించదగిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రహిత భవిష్యత్తును నిర్మించడానికి నిబద్ధతను పునరుద్ఘాటిస్తోన్న ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 10:25AM by PIB Hyderabad

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించే ప్రయత్నాల్లో భారత్ ఒక కీలక ఘనతను సాధించింది. జాతీయ హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైన తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) టీకా డోసుల పంపిణీ 1 కోటిని దాటింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ల నుంచి కౌమార బాలికలను రక్షించే దిశలో ఒక ముఖ్యమైన పురోగతిగా నిలవడమే కాకుండా దేశవ్యాప్తంగా నివారణ ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణను ఇది తెలియజేస్తోంది. 

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ దేశవ్యాప్త కార్యక్రమం.. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 14 ఏళ్ల బాలికలకు తల్లిదండ్రుల అనుమతితో ఉచిత, సురక్షిత, స్వచ్ఛంద సింగిల్-డోస్ హెచ్‌పీవీ టీకాను అందిస్తోంది. భవిష్యత్ తరాల మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును పరిరక్షించడంపై దృష్టి సారించిన ఈ కార్యక్రమం.. భారతదేశపు నివారణ ఆరోగ్య సంరక్షణ విధానంలో ఒక ప్రధాన పురోగతిని తెలియజేస్తోంది.

భారత రిజిస్ట్రార్ జనరల్ 2021 జనాభా అంచనాల ఆధారంగా గుర్తించిన సుమారు 1.2 కోట్ల బాలికల వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ కార్యక్రమం దాదాపు 87 శాతం కవరేజీని సాధించింది. తొమ్మిది నెలల్లోనే 1 కోటి డోసుల ఘనతను సాధించటం ఈ కార్యక్రమానికి ఉన్న విస్తృతి, వేగాన్ని తెలియజేస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక సమాజాల సమన్వయ కృషితో ఇది సాధ్యమైంది.

100 శాతం కవరేజీని సాధించిన ఆరు రాష్ట్రాలు- దేశవ్యాప్తంగా బలమైన పురోగతి

హెచ్‌పీవీ టీకా కవరేజీని విస్తరించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిరంతర పురోగతిని కనబరిచాయి. పలు రాష్ట్రాలు తాము గుర్తించిన లక్షిత వర్గాల్లో ఉన్నత స్థాయి కవరేజీని సాధించాయి.

ఈ కార్యక్రమం కింద ఆరు రాష్ట్రాలు (గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మిజోరం, మధ్యప్రదేశ్, బీహార్) తాము గుర్తించిన లక్షిత వర్గాల్లో 100 శాతం కవరేజీని సాధించాయి. 

మంచి పనితీరు కనబరిచిన ఇతర రాష్ట్రాల్లో అస్సాం 95.63 శాతం కవరేజీని నమోదు చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ (95.28 శాతం), కర్ణాటక (93.16 శాతం), ఉత్తరాఖండ్ (90.17 శాతం) ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్ (86.21 శాతం), రాజస్థాన్ (85.23 శాతం) 80 శాతం కవరేజీ మార్కును అధిగమించగా.. కేరళ (77.02 శాతం), తమిళనాడు (76.12 శాతం), ఒడిశా (74.90 శాతం), దాద్రా నాగర్ హవేలీ- డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం (72.99 శాతం) 70 శాతం కంటే ఎక్కువ కవరేజీని సాధించాయి.

మొత్తం గణాంకాల పరంగా చూస్తే 29.33 లక్షలకు పైగా 14 ఏళ్ల బాలికలకు టీకా వేసి ఉత్తరప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవగా.. 13.70 లక్షలకు పైగా బాలికలతో బీహార్, 7.75 లక్షలకు పైగా బాలికలతో గుజరాత్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

విభిన్న భౌగోళిక, జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులు కలిగిన రాష్ట్రాల్లో సాధించిన ఈ పురోగతి.. ఈ కార్యక్రమానికి ఉన్న విస్తృత వ్యాప్తిని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన అమలు వ్యూహాల సమర్థతను చాటిచెబుతోంది.

దేశవ్యాప్త టీకా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న బలమైన కేంద్ర-రాష్ట్ర సమన్వయం

జిల్లా యంత్రాంగాలు, ప్రజారోగ్య సంస్థలు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సంరక్షణ బృందాల సహకారంతో కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల మధ్య కొనసాగిన నిరంతర సమన్వయాన్ని ఈ ఘనత తెలియజేస్తోంది.

గ్రామీణ, పట్టణ, మారుమూల, భౌగోళికంగా సవాలుతో కూడిన ప్రాంతాల్లో టీకా అందుబాటును విస్తరించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక విధానాలను అనుసరించాయి. బీహార్, తమిళనాడు, సిక్కిం రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను కూడా జాతీయ కార్యక్రమంతో అనుసంధానించి క్షేత్రస్థాయి వ్యాప్తి, అమలును మరింత బలోపేతం చేశారు.

సమాజ భాగస్వామ్యం, తల్లిదండ్రులలో అవగాహన కల్పించడం.. హెచ్‌పీవీ టీకా గురించి విశ్వసనీయమైన, శాస్త్రీయ ఆధారిత సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది.

టీకా భద్రత, సమర్థతపై ఉన్న సందేహాలను నివృత్తి చేసి అవగాహన కల్పించడంలో శిశువైద్యులు, గైనకాలజిస్టులు, ఎయిమ్స్ వంటి ప్రముఖ వైద్య సంస్థల నిపుణులతో కూడిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు కీలక పాత్ర పోషించారు.

సమాచారంతో కూడిన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడానికి పాఠశాల ఉపాధ్యాయులు, గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశా వర్కర్లు), ఏఎన్ఎంలు (ఆక్జిలరీ నర్స్ మిడ్‌వైవ్స్), ఇతర ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు కూడా తల్లిదండ్రులు, సమాజాలతో సన్నిహితంగా పనిచేశారు.

ఈ సమష్టి కృషి ప్రజా విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి, సమాజంలోని వివిధ వర్గాలలో హెచ్‌పీవీ టీకా ఆమోదాన్ని సులభతరం చేయడానికి దోహదపడింది.

టీకాల పంపిణీ డిజిటల్ పర్యవేక్షణ, సేవల అందుబాటును మెరుగుపరుస్తున్న యూ - విన్‌

దేశవ్యాప్తంగా అమలవుతున్న టీకాల కార్యక్రమానికి డిజిటల్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాలు కీలకంగా తోడ్పడుతున్నాయి. యూ - విన్‌ వేదిక ద్వారా తక్షణ పర్యవేక్షణ, లబ్ధిదారుల వివరాల నమోదు, ట్రాకింగ్‌, డిజిటల్‌ టీకా రికార్డుల నిర్వహణ సాధ్యమవుతోంది.

కార్యక్రమ నిర్వాహకులు ఈ వేదిక ద్వారా జిల్లా స్థాయిలో టీకాల పంపిణీ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. టీకాల పంపిణీలో ఉన్న లోటుపాట్లను, ఇంకా టీకాలు వేయించుకోని అర్హులైన బాలికలను గుర్తిస్తున్నారు. తద్వారా మరింత సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించడంతో పాటు, అవసరమైన వనరులను సక్రమంగా కేటాయించేందుకు వీలవుతోంది.

ఈ వేదిక ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తెలకు హెచ్‌పీవీ టీకా వేయించేందుకు ముందుగానే సమయాన్ని బుక్‌ చేసుకోవచ్చు. డిజిటల్‌ టీకా ధ్రువీకరణ పత్రాలను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీంతో టీకా ప్రక్రియ మరింత సులభంగా, సౌకర్యవంతంగా, పారదర్శకంగా మారుతోంది.

క్షేత్రస్థాయిలో అమలు ద్వారా డిజిటల్‌ పర్యవేక్షణను అనుసంధానించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కార్యక్రమ నిర్వహణను మరింత బలోపేతం చేసుకోగలుగుతున్నాయి. అలాగే అర్హులైన లబ్ధిదారులకు టీకా సేవలను మరింత సమర్థవంతంగా చేరువ చేయగలుగుతున్నాయి.

హెచ్‌పీవీ టీకా: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు సమర్థవంతమైన నివారణోపాయం

మహిళల్లో క్యాన్సర్ సంబంధిత అనారోగ్యం, మరణాలకు ప్రధాన కారణమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ప్రజారోగ్య రంగానికి నేటికీ పెను సవాలుగానే ఉంది. అత్యధిక శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు కొన్ని రకాల హై రిస్క్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్పీవీ)  ఇన్ఫెక్షన్ల దీర్ఘకాలిక ప్రభావం వల్లే సంభవిస్తున్నాయి.

సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని అరికట్టేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ప్రభావవంతమైన నివారణోపాయాల్లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అగ్రగామిగా నిలుస్తోంది.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ల భద్రత, పనితీరుపై విస్తృతమైన ప్రపంచ శాస్త్రీయ ఆధారాలు జాతీయ హెచ్‌పీవీ టీకా ప్రచారానికి బలాన్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్లకు మించి హెచ్‌పీవీ టీకా డోసులు వేయగా; దాదాపు ఇరవై ఏళ్ల శాస్త్రీయ పరిశోధనలు, వాస్తవ క్షేత్ర అనుభవాల ద్వారా హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్లు, వాటి కారణంగా ఏర్పడే క్యాన్సర్‌కు పూర్వదశలోని అసాధారణ కణ మార్పుల నుంచి ఈ టీకాలు గణనీయమైన రక్షణ కల్పిస్తున్నాయని నిరూపితమైంది. 

14 ఏళ్ల బాలికలకు టీకాలు వేయడం ద్వారా హెచ్‌పీవీ వైరస్‌ సోకే అవకాశం ఏర్పడక ముందే రక్షణ కల్పించాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దీర్ఘకాలంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు దోహదపడుతుంది.

లబ్ధిదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం

ప్రతి లబ్ధిదారుడి భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

శిక్షణ పొందిన వైద్యాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్దేశించిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే అన్ని టీకా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. టీకా వేసిన తర్వాత అరుదుగా సంభవించే ప్రతికూల పరిణామాలను (ఏఈఎఫ్ఐ) సకాలంలో గుర్తించి, పరిశీలించి, తగిన వైద్య సేవలు అందించేందుకు వీలుగా టీకా కేంద్రాలను ఏడు రోజులూ, 24 గంటలూవైద్య సేవలు అందించే ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు.

శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, తగిన వైద్య ఏర్పాట్లతో, ఈ కార్యక్రమంలో నిర్దేశిత టీకా భద్రతా మార్గదర్శకాలను పాటిస్తున్నారు.

టీకా కార్యక్రమంపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టేందుకు పారదర్శక సమాచారం, శాస్త్రీయ ఆధారాలు, తల్లిదండ్రుల అవగాహనతో కూడిన సమ్మతికి మంత్రిత్వ శాఖ నిరంతరం ప్రాధాన్యత ఇస్తోంది.

అర్హత గల బాలికలందరికీ టీకా అందించే దిశగా నిరంతర పురోగతి

కోటి డోసుల మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో, మిగిలిన అర్హులైన బాలికలందరికీ టీకాలు అందించడంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకాల పంపిణీ పరిధిని మరింత విస్తరించి, కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు కృషి కొనసాగిస్తోంది

టీకాల పంపిణీలో ఉన్న లోటుపాట్లను అధిగమించడం, ప్రజల్లో అవగాహనను మరింత పెంపొందించడం, హెచ్‌పీవీ టీకాలు అందరికీ సమానంగా అందేలా చూడటం వంటి లక్ష్యాలతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, వైద్య నిపుణులు, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలు, విద్యాసంస్థలు, ప్రజా సంఘాలతో కలిసి నిరంతరం పనిచేయనుంది.

అర్హులైన 14 ఏళ్ల బాలికల తల్లిదండ్రులు, సంరక్షకులు తమ సమీపంలోని నిర్దేశిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని లేదా యూ-విన్‌ వేదికను వినియోగించుకుని టీకాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడంతో పాటు, టీకా వేయించుకునేందుకు ముందస్తుగా సమయాన్ని బుక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

తొమ్మిది నెలల లోపే కోటి మందికి పైగా హెచ్‌పీవీ టీకా డోసులు అందించడం కేవలం సంఖ్యాపరమైన మైలురాయి మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని కౌమార దశ బాలికల ఆరోగ్య పరిరక్షణకు, ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదమున్న వ్యాధి నివారణకు చేస్తున్న గణనీయమైన పెట్టుబడికి నిదర్శనం.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన జాతీయ హెచ్‌పీవీ టీకా కార్యక్రమం నివారణాత్మక ఆరోగ్య సంరక్షణకు భారత్‌ ఇస్తున్న ప్రాధాన్యతను, నివారించదగిన వ్యాధుల నుంచి మహిళలను కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.

నేడు అందించే ప్రతి హెచ్‌పీవీ టీకా డోసు, భారతదేశ ఆడబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించే దిశగా వేసే మరో అడుగు. భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడే మహిళల సంఖ్య తగ్గించేందుకు దోహదపడే చర్య.

అర్హులైన ప్రతి బాలికకూ నివారణ ఆరోగ్య రక్షణను చేరువ చేయడంతో పాటు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించే జాతీయ సంకల్పానికి ఈ మైలురాయి మరింత బలాన్నిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2339567) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada