ఉమేష్
దర్శకత్వం: వర్ధన్ విజయకుమార్ కామత్ | భాష: కొంకణి | నిడివి: 1 గంట 39 నిమిషాలు
ఉమేష్… ఒకప్పుడు ఊరికి మొనగాడు! కానీ, ఇప్పుడు ఒక పల్లెలో అతడిది ఏకాంత జీవనం. చిన్నాచితకా పనులు చేసుకుంటూ బతుకు వెళ్లదీసే అతణ్ని ఒక అపరిష్కృత గతం వెన్నాడుతూంటుంది. ఔత్సాహిక దర్శకులు ఆంటన్, రోహన్ అతడిపై ఓ డాక్యుమెంటరీ చిత్రించాలని వచ్చినపుడు ఉమేష్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. స్థానికంగా వినిపించే వదంతులు, అవాస్తవాలను శోధిస్తూ వారు ముందుకు సాగుతుంటారు. ఈ క్రమంలో మరుగునపడిన ఉమేష్ ప్రతిభ, అతని ఏకాకి జీవితానికి దారితీసిన బాధాకర పరిస్థితులు వెలుగులోకి వస్తాయి. ఆ త్రయం మధ్య క్రమేణా నమ్మకం పెరిగేకొద్దీ, కెమెరాను చూసినపుడు ఉమేష్ ఎందుకో కాస్త జాగ్రత్త పడుతుంటాడు. అస్తిత్వం.. నమ్మకం.. మరుగుపడిన వారసత్వ మూల్యం వంటి అంశాలను ఈ చిత్రం మన కళ్లకు కడుతుంది.
శకుంతల
దర్శకత్వం: ప్రసాద్ ఎం.నాయక్ | భాష: కొంకణి | నిడివి: 11 నిమిషాలు
ప్రేమ, అస్తిత్వం, సంప్రదాయం చుట్టూ అల్లుకున్న భావోద్వేగభరిత కుటుంబ కథా చిత్రం ‘శకుంతల’. పొరుగింటి క్రైస్తవ యువకుడిని పెళ్లాడిన కారణంగా సంప్రదాయానికి పెద్దపీట వేసే తన కుటుంబానికి దూరమైన మహిళ కథ ఇది. ఫలితంగా కొన్నేళ్ల తర్వాత తండ్రి మరణిస్తే, అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కూడా ఆమెకు దక్కదు. పన్నెండో రోజున కర్మక్రియలు సమీపిస్తున్న వేళ సంఘర్షణను, సామాజిక నిందలను ఎదుర్కొంటూ, ధైర్యం కూడదీసుకుని చిన్ననాటి తన ఇంటికి బయల్దేరుతుంది శకుంతల. అయితే, క్రతువులో పాలుపంచుకోవడానికి కాకుండా ఆ ఇంటి బిడ్డగా తన స్థానం తిరిగి పొందడానికి చేసే ప్రయత్నమిది. సంప్రదాయం గీసిన లక్ష్మణ రేఖను తన ప్రేమ దాటించగలదా అన్నదే ప్రశ్న.
పూర్ణత
దర్శకత్వం: శ్రవణ్ కాంకోంకర్ | భాష: కొంకణి | నిడివి: 25 నిమిషాలు
మల్లెలమాల ‘జాయో’ పరిమళభరిత ప్రస్థానంలో స్పృశించే ఎన్నో జీవితానుభవాలను గుదిగుచ్చే కథనమే ‘పూర్ణత’. ఆనంద-విషాద క్షణాలన్నిటా అది ఓదార్పును, ఆశను, ఆనందాన్ని పంచుతూ సాగుతుంది. దండలోని పూలు క్రమేణా వాడిపోతున్నా, మానవ జీవితాలను అందంగా తీర్చిదిద్దుతూనే రాలిపోతాయి. ఒక జీవితం ముగిసే వేళ మరొకటి ప్రయాణాన్ని కొనసాగిస్తుందనే వాస్తవాన్ని సూచిస్తూ జీవితం, కొనసాగింపు, దాని ప్రయోజనాన్ని కూడా ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది.
నాయిస్
దర్శకురాలు: సువిధ తోర్గల్ బాఖ్లే | భాష: కొంకణి | నిడివి: 16 నిమిషాలు
మానవ ప్రవర్తన, సంబంధాలను లోతుగా శోధించే చిత్రం ‘నాయిస్’. తీవ్ర వేదనను మిగిల్చే బంధంలోని చిక్కుల నుంచి, పదేపదే ఎదురయ్యే చేదు అనుభవాల ఊబినుంచి గట్టెక్కేందుకు కథానాయిక ‘తార’ చేసే పోరాటమిది. గాయాల నుంచి కోలుకుని ముందడుగు వేసేందుకు ఎంతగా ప్రయత్నించినా పాత పరిచయాల వైపే మళ్లీ ఆమె మనసు మొగ్గుతూంటుంది. చిత్రంలో తరచూ కనిపించే ఓ పాత ఫ్యాన్- ఆమె జీవితం చుట్టూ పరిభ్రమించే ప్రవర్తనా చక్రానికి ప్రతీక. మార్పు అనివార్యమని గుర్తించినా అదెంత కష్టమో ఈ చిత్రం చెబుతుంది.
దర్యా
దర్శకత్వం: కిషోర్ అర్జున్ | భాష: మరాఠీ | నిడివి: 25 నిమిషాలు
దృష్టి లోపంతోపాటు సెరిబ్రల్ పాల్సీ వ్యాధి పీడితుడైన బాలుడు ఆకాష్ కథ ‘దర్యా’. సముద్రం ఎలా ఉంటుందో ఎరుగని ఆ పసివాడికి శబ్దాలు, కథలు, ఊహల ద్వారా మాత్రమే దాని గురించి తెలుసు. ఓ రోజు అతని తాత అనుకోకుండా మనవణ్ని సముద్ర తీరానికి తీసుకెళ్లినప్పుడు, ఆకాష్ తన చిరకాలపు ఊహల్లోని ప్రపంచాన్ని చూస్తాడు. సముద్రాన్ని అనుభూతి చెందడంలో ఆ బాలుడి లోతైన అనుభవాన్ని ఈ చిత్రం మన ముందుంచుతుంది. దృష్టికి, దృగ్గోచరతకు పెద్దగా సంబంధం ఉండకపోవచ్చని ఆకాష్ ఉదంతం మనకు గుర్తు చేస్తుంది.
పర్ఫెక్ట్ షాట్
దర్శకత్వం: సంకల్ప్ సాయినాథ్ పరాబ్ | భాష: కొంకణి | నిడివి: 14 నిమిషాలు
వసుధ ఓ ఫిల్మ్ స్కూల్ విద్యార్థిని… సినిమా ఫ్రేమ్ సదా పరిపూర్ణంగా ఉండాలన్నది ఆమె ప్రగాఢ వాంఛ. “గోల్డెన్ రేషియో, సమరూపత, రూల్ ఆఫ్ థర్డ్స్” వంటి సూత్రాలు ఆమె తపనను మరింత ఎగదోస్తుంటాయి. అదే సమయంలో దివంగత తండ్రి తన కోసం విలువైనదేదీ మిగల్చలేదనే భావనతో ఎంతకూ తెగని భావోద్వేగాల నడుమ కొట్టుమిట్టాడుతూంటుంది. పాత జ్ఞాపకాల ముసురులో దృశ్య పరిపూర్ణత కోసం ఆమె తపన స్వీయాన్వేషణ ప్రస్థానంగా రూపుమారుతుంది. మన దృక్కోణాన్ని, సృజనాత్మకతను బంధాలు తీర్చిదిద్దే తీరును విశదీకరిస్తూనే- అర్థవంతమైన కథాకథనం సినిమా సాంకేతిక నియమాలకు అతీతమనే వాస్తవాన్ని తేటతెల్లం చేస్తుందీ చిత్రం.
బాపో కాలే
దర్శకత్వం: కృష్ణ రౌల్ | భాష: కొంకణి | నిడివి: 24 నిమిషాలు
మౌక్సీ గ్రామం నేపథ్యంగా సాగే కథ ‘బాపో కాలే’. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయించే కసరత్తు తన ముంగిటకు చేరినప్పుడు, వారసత్వంగా వచ్చిన గుడిసెను వీడటానికి ససేమిరా అన్న ఒక వృద్ధుడి పోరుకు ఇది ప్రతీక. ఓ సాధారణ ప్రక్రియగా మొదలైన ఆ వ్యవహారం- నిర్వాసితుల వేదనను, కోల్పోయిన ఇళ్లను, మారిపోతున్న గ్రామ రూపురేఖల జ్ఞాపకాలను మళ్లీ తట్టిలేపుతుంది. ఆ ఉత్కంఠభరిత రాత్రివేళ బాపో, అతని భార్య భాగీ అధికారులకు ఎదురొడ్డి నిలుస్తారు. అలా ఆ మట్టిగోడల గుడిసె- ఆత్మగౌరవం, అస్తిత్వం, జ్ఞాపకాలు, నేలతో పెనవేసుకున్న అవినాభావ బంధంతో రూపొందిన మహాసౌధంలా కనిపిస్తుంది.
ఉడ్‌వార్మ్ (రోటో)
దర్శకత్వం: అఖిల్ లోట్లికర్ | భాష: కొంకణి | నిడివి: 22 నిమిషాలు
ఒకవైపు కుటుంబంలో గందరగోళ పరిస్థితులను చక్కదిద్దుకుంటూనే, మరోవైపు పాఠశాల పోటీల్లో తన చెల్లిని గెలిపించాలని తాపత్రయంతో పట్టుదలగా ప్రయత్నించే క్లినిక్ రిసెప్షనిస్ట్ కథ ‘ఉడ్‌వార్మ్ (రోటో)’. అటు కుటుంబ బాధ్యతలు, ఇటు చెల్లెలి ఆశయం నడుమ సమతూకం సాధించేందుకు ఆమె శ్రమిస్తుండగా ఊహించని ముప్పు ముంచుకురావడం మొదలవుతుంది.
ఛీర్స్!
దర్శకత్వం: అనురాగ్ వర్దేకర్ | భాష: కొంకణి | నిడివి: 19 నిమిషాలు
పదేపదే… అదేఅదే… అన్నట్టున్న రోజువారీ జీవితంతో విసిగిపోయిన ఇద్దరు కుర్రాళ్లు ఏ గమ్యం లేకుండా దొరికిన బస్సెక్కి అంతుబట్టని పెద్దల ప్రపంచంలోకి పయనమవుతారు. ఆ తర్వాత ఓ పాత కోటకు, అక్కడి నుంచి నదిలో పడవ ప్రయాణం ద్వారా చివరకు ఎవరూ కానరాని జలపాతం దగ్గర తేలుతారు. ఈ క్రమంలో తొలిసారి మద్యం రుచి చూడాలని ఉబలాటపడతారు. కానీ, వయసు దాచడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పెద్దల ప్రపంచం తాము ఊహించిన దానికంటే చాలా క్లిష్టమైనదని వాళ్లకు అవగతమవుతుంది. ఎదిగే క్రమంలోని కుతూహలం, అమాయకత్వం, అనిశ్చితిని ప్రతిబింబిస్తూ ప్రపంచంపై కాస్త మారిన దృక్పథంతో ఆ కుర్రాళ్లు తిరిగి ఇల్లు చేరుతారు… ఛీర్స్!
మీడియం పీస్
దర్శకత్వం: జయ్ అమోంకర్ | భాష: మరాఠీ | నిడివి: 23 నిమిషాలు
ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ విషాదభరిత హాస్య నాటకంలో- ఓ చికెన్ షాపు నుంచి కోడి ఒకటి తప్పించుకోవడంతో ఊహించని సంఘటనల పరంపర మొదలవుతుంది. పదేపదే కోళ్లు తప్పించుకోవడంపై తిట్లు తింటున్న ఆ దుకాణం పనివాడు ఒక వింత ఆలోచనతో వాటి వినోదం కోసం టీవీ ఏర్పాటు చేస్తాడు. కానీ, కోళ్ల మాట అటుంచి తానే గుడ్లప్పగించి టీవీ చూడటంలో మునిగిపోతుంటాడు. దీంతో అతని ప్రవర్తన, బాధ్యతలు, భార్యతో బంధం కూడా ప్రభావితమవుతాయి. చివరకు టీవీ పాడైపోయి కోళ్లన్నీ తప్పించుకోవడంతో యజమాని వేసిన శిక్షతోపాటు ఇంట్లో తిరస్కారం ఎదురవుతుంది. బందీ కావడం, విముక్తి కోసం తపన మధ్య చిక్కుకున్న వ్యక్తి విలక్షణ కథనం ఈ ‘మీడియం పీస్.’ ఒంటరితనం, ఆధునిక వ్యసనాలు, దైనందిన జీవితం నుంచి బయటపడాలనే ప్రయత్నంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలకు ఈ చిత్రం అద్దం పడుతుంది.
హెల్త్ సెంటర్
దర్శకత్వం: అనూప్ సర్దేశాయి | భాష: కొంకణి | నిడివి: 2 గంటల 7 నిమిషాలు
గందరగోళ పరిస్థితులు నెలకొన్న ఓ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నేపథ్యంలో సాగే కథ ‘హెల్త్ సెంటర్’. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ కామత్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సురభి అనే ఒక యువతి తనపై అత్యాచారం చేసిన అజయ్‌పై ఫిర్యాదు చేస్తుంది. అయితే, పలుకుబడి కలిగిన నిందితుడికి వత్తాసుగా ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని అవినీతిపరులైన రాజకీయ నాయకులు, పోలీసులు ఆమెపై ఒత్తిడి తెస్తారు. ఆమెకు ఎలా న్యాయం చేయాలో తెలియక కామత్ తీవ్ర నైతిక సంక్షోభంలో పడతారు. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది సమ్మె నేపథ్యంలో పరిమిత వనరులతో కోమా రోగి (మనీషా అనే యువతి తండ్రి)కి వైద్యం అందించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. బెదిరింపులకు తలొగ్గి సురభి కేసు ఉపసంహరించుకోవడంతో కామత్ న్యాయాన్ని తన చేతుల్లోకి తీసుకుని, అజయ్‌కు రహస్యంగా ప్రాణాంతక ఇంజెక్షన్ ఇస్తారు. కోమా రోగి ప్రాణం నిలిపేందుకు ఏర్పాట్లు చేసి, సురభి వ్యవహారంలో అక్రమాలకు నిరసనగా రాజీనామా చేస్తారు. పదేళ్ల తర్వాత, కొత్త ఆసుపత్రిలో చేరిన కామత్ కుమారుడు రాజ్‌కు అక్కడ సీనియర్ డాక్టర్‌గా ఉన్న సురభి ఎదురుపడటంతో డాక్టర్ కామత్ సంకల్పం, వారసత్వం మరోసారి తెరపైకి వస్తాయి.
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి 2004 నుంచి గోవా శాశ్వత వేదికగా కొనసాగుతోంది. ఏటా నవంబరులో ప్రపంచవ్యాప్త చిత్ర దర్శకులు, సినీ ప్రియులు, సృజనాత్మకత గల వ్యక్తులకు సాదర స్వాగతం పలుకుతుంది. ఈ నేపథ్యంలో 2026 నవంబరు 20 నుంచి ‘విశ్వజనీన కథలు’ ఇతివృత్తంగా భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలైంది. భౌగోళిక, భాషా, సాంస్కృతిక హద్దులకు అతీతంగా సమష్టి మానవానుభూతితో ప్రేక్షకులను మమేకం చేయగల సినిమా సామర్థ్యాన్ని ఈ నెల 28 వరకూ సాగే ఈ వేడుక చాటిచెబుతుంది.
గోవా చిత్రాల ఎంపిక ఈ స్ఫూర్తికి సరైన ప్రతిబింబం. ఇక్కడి ప్రజల దైనందిన జీవనం, సంస్కృతీసంప్రదాయాలు, సామాజిక వాస్తవాలు పాదుకొన్న ఈ 12 చిత్రాలు, ఒక నిర్దిష్ట ప్రదేశం నుంచి ఆవిష్కృతమైన కథలు. ఇవన్నీ ఆ ప్రదేశానికి ఆవలి తీరంలోగల ప్రేక్షకులతో ఎలా సంభాషించగలవో ఈ వేడుక ప్రస్ఫుటం చేస్తుంది.
కుటుంబ సంబంధాలు, అస్తిత్వ సవాళ్లు, బాల్యం, ఒంటరితనం లేదా సామాజిక జీవన సంక్లిష్టతలను అన్వేషించినపుడు అవి స్థానిక అనుభవాలతో రూపొందిన దృక్కోణాన్ని పట్టిచూపినా, సార్వత్రిక భావోద్వేగాలతో అవి అనుసంధానమై ఉంటాయి.
కొంకణి, మరాఠీ సినిమాలను అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావడం ద్వారా వాటికి తక్షణ సాంస్కృతిక, భాషా పరిధులను దాటి సాగే అవకాశాన్ని ఈ దఫా ఐఎఫ్‌ఎఫ్‌ఐ కల్పించింది. తద్వారా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు గోవాను కేవలం ఓ పర్యాటక గమ్యంగా కాకుండా ఇక్కడి జన జీవనం, జ్ఞాపకాలు, కథల ద్వారా అన్వేషించే వీలు కలుగుతుంది. ఈ ఏడాది ఉత్సవాల ఇతివృత్తం ‘విశ్వజనీన కథలు’ స్ఫూర్తికి అనుగుణంగా ఈ చిత్రాల ఎంపిక గుర్తుచేసేదేమిటంటే- ఈ కథలన్నీ స్థానికంగా మొదలై విశ్వవ్యాప్త అనుభవాలతో అనుసంధానితమవుతూ ఎల్లలెరుగని సామర్థ్యానికి అద్దం పడతాయి.
***