పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌లో నాలుగు కూనలకు జన్మనిచ్చిన బోత్స్వానా చీతా: దేశంలో 62కు పెరిగిన చీతాలు

ప్రాజెక్టు చీతా విజయంలో నిపుణులు, క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది అంకితభావాన్నీ, నిబద్ధతనూ, కృషినీ ప్రశంసించిన శ్రీ భూపేందర్ యాదవ్

నాడు పోస్టు చేయడమైనది: 20 NOV 2026 10:45AM by PIB Hyderabad

బోత్స్వానా నుంచి తీసుకువచ్చిన రెండున్నరేళ్ల ఆడ చీతా కేవోఎంజీ–3 ఈ రోజు అటవీ ప్రాంతంలో నాలుగు ఆరోగ్యకరమైన కూనలకు జన్మనిచ్చింది. ఇది ప్రాజెక్ట్ చీతా, చీతాల సంతతిని పునరుద్ధరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో ముఖ్యమైన విజయంగా నిలిచింది.

బోత్స్వానా నుంచి తీసుకువచ్చిన ఆడ చీతాల్లో కూనలకు జన్మనిచ్చిన తొలి చీతా కేవోఎంజీ–3 అని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. సహజ వాతావరణంలో పిల్లలకు జన్మనివ్వడానికి ముందు ఆ చీతా నాలుగు నెలలకు పైగా అడవిలో ఉందని ఆయన చెప్పారు. 2022లో చీతాల పునరావాస కార్యక్రమం మొదలైన తర్వాత అటవీ ప్రాంతంలో ఇలా కూనలు పుట్టడం ఇది రెండోసారి. 

ఈ నాలుగు కూనలు పుట్టడంతో భారతదేశంలో చీతాల సంఖ్య 62కి చేరిందనీ, వాటిలో 43 మన దేశంలో పుట్టినవేననీ శ్రీ యాదవ్ తెలిపారు. ‘ప్రాజెక్ట్ చీతా’కు ఇదొక చారిత్రక సందర్భమనీ, దేశంలో చీతాల సంతతిని పునరుద్ధరించడం ఘన విజయమనీ అన్నారు.

ఇలా కూనలు పుట్టే ప్రతి సందర్భమూ ఆశలను బలపరుస్తుందనీ, వన్యప్రాణుల సంరక్షణ పట్ల నిబద్ధతను మరింత పెంచుతుందనీ మంత్రి అన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు సహనం, పట్టుదల, సమష్టి కృషి ఎంతో అవసరమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ‘ప్రాజెక్ట్ చీతా’ విజయం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రాజెక్ట్ మేనేజర్లు, పశువైద్యులు, క్షేత్రస్థాయి అటవీ సిబ్బందితో పాటు అందరి అంకితభావాన్నీ, నిబద్ధతనీ, కృషినీ ఆయన అభినందించారు.

***


(రిలీజ్ ఐడి: 2339190) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Nepali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada