నాడు పోస్టు చేయడమైనది:
20 NOV 2026 9:01AM by PIB Hyderabad
ప్రపంచ టాయిలెట్ దినోత్సవం-2026 సందర్భంగా నిన్న ‘స్వచ్ఛ్ శౌచాలయ్-గరిమామయ్ భవిష్య’ (ఎస్ఎస్జీబీ) ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనిని స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) [ఎస్‌బీఎమ్(జీ)] కార్యక్రమంలో భాగంగా జల శక్తి మంత్రిత్వశాఖ ఆధీనంలోని తాగునీరు, పారిశుధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్) మొదలుపెట్టింది. ఈ ప్రచార ఉద్యమాన్ని, దీని పురోగతిని వివరించే మాడ్యూల్‌ను ఎస్‌బీఎమ్(జీ) లోని డీడీడబ్ల్యూఎస్కు చెందిన సంయుక్త కార్యదర్శి, జాతీయ మిషన్ డైరెక్టరు ఐశ్వర్య సింగ్ ఎలక్ట్రానిక్ మాధ్యమం సహాయంతో ప్రారంభించారు (ఈ-లాంచ్).
కార్యక్రమం మొదట్లో డీడీడబ్ల్యూఎస్ డిప్యూటీ సెక్రటరీ స్వాగతోపన్యాసాన్ని ఇచ్చారు. ఏ నేపథ్యంలో ఈ ప్రచార ఉద్యమాన్ని చేపడుతున్నదీ కూడా వివరించారు. అనంతరం డీడీడబ్ల్యూఎస్ డైరెక్టరు స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) పురోగతిని గురించి సంక్షిప్తంగా తెలియజేశారు. దీనిలో భాగంగా దాదాపు 89.9 శాతం గ్రామాల్లో ఆరుబయలు ప్రాంతాలలో మల మూత్రాదుల విసర్జన రహిత స్థితి.. ఓడీఎఫ్ [ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ] ప్లస్ (నమూనా) దశకు చేరుకోవడమే కాకుండా, స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్)కు చెందిన ఇతర విభాగాల్లో ప్రగతిని కూడా ప్రస్తావించారు.
దీని తరువాత ‘స్వచ్ఛ్ శౌచాలయ్-గరిమామయ్ భవిష్య’ (ఎస్ఎస్జీబీ) ప్రచార ఉద్యమాన్ని సంయుక్త కార్యదర్శి, జాతీయ మిషన్ డైరెక్టరు ఐశ్వర్య సింగ్ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న విధానాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వివరించేందుకు డీడీడబ్ల్యూఎస్ రూపొందించిన ఒక మాడ్యూలును కూడా ఆమె ప్రారంభించారు.
‘సురక్షిత టాయిలెట్లు సమాన భవిష్యదవకాశాలు’ అంశాన్ని ప్రపంచ టాయిలెట్ దినోత్సవం-2026కు ఇతివృత్తంగా ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసింది. ఇది పారిశుధ్యాన్ని లైంగిక సమానతతో జోడిస్తుంది. ఇదే విషయాన్ని ‘స్వచ్ఛ్ శౌచాలయ్-గరిమామయ్ భవిష్య’ (ఎస్ఎస్జీబీ) ప్రచార ఉద్యమంలో స్ఫూర్తిగా తీసుకుని, గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడతారు. మరీ ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు, దివ్యాంగజనుల అవసరాలను నెరవేర్చే అంశంపై శ్రద్ధ వహిస్తారు.
‘స్వచ్ఛ్ శౌచాలయ్-గరిమామయ్ భవిష్య’ (ఎస్ఎస్జీబీ) ప్రచార ఉద్యమం లక్ష్యాలు ఇలా ఉన్నాయి: -
• సీఎస్సీలు (కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు), సంస్థాగత టాయిలెట్ల (పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ ఘర్ మొదలైనవి) స్థితిని మదింపు చేయడం, అవసరాలను పరిగణనలోకి తీసుకుని మరమ్మతులు, నిర్వహణ, పునరుద్ధరణ పనులు చేపట్టడం. సంస్థాగత టాయిలెట్ల విషయంలో ఈ పనులను సంబంధిత అధికార సంస్థల (ఎస్ఎమ్సీ, ఏడబ్ల్యూసీ, జీపీకే, జీపీబీ వగైరా) ద్వారా పూర్తి చేయడం. అవసరమైన చోట్ల, వేరు వేరు కుటుంబాల వారిని తమ ఐహెచ్‌హెచ్‌ఎల్‌ల (వ్యక్తిగత కుటుంబ మరుగుదొడ్లు) మరమ్మతు, నిర్వహణ చేపట్టేటట్లుగా ప్రోత్సహించడం.
• పల్లెలకు అవసరమయ్యే టాయిలెట్ రకాలను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నిర్దేశించిన లక్ష్యాల మేరకు సాధ్యమైనంత వర మదింపు చేసి, గుర్తించడానికి గాను సింగిల్-పిట్ టాయిలెట్‌ను ట్విన్-పిట్ టాయిలెట్‌గా తగిన మార్పులు చేయడం, సోక్ పిట్ లేనటువంటి సెప్టిక్ ట్యాంకును సోక్ పిట్‌ను కలిగివుండే సెప్టిక్ ట్యాంకుగా మార్చడం.
• అవసరమైన మేరకు గాని లేదా ఎఫ్ఎస్ఎమ్ (ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్) నియమ పాలన దృష్ట్యా గాని యంత్రాల సహాయంతో రొంపి వెలికితీత పనులను మదింపు చేసి, తదనుగుణంగా పథక రచన చేయడం.
• కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు, సంస్థాగత టాయిలెట్ల నిర్వహణకు తోడ్పడే ఓ అండ్ ఎమ్ వ్యవస్థల మదింపు, వాటిని బలోపేతం చేయడం.
• కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు, సంస్థాగత టాయిలెట్లను స్థానిక కుడ్య చిత్రకళ, సైన్‌బోర్డులతో, పరిసర ప్రాంతాల్లో వాతావరణాన్ని మెరుగుపరిచి, వాటిని చూడముచ్చటగా తీర్చిదిద్ది, ఆకర్షణీయంగా ఉండే మార్పుచేర్పులను చేయడానికి ప్రాధాన్యం ఇవ్వవలసిందంటూ ఆయా ప్రాంతాల నివాసులను ప్రోత్సహించడం. ఇదే విషయమై, వేరు వేరు కుటుంబాలను కూడా తమ వ్యక్తిగత కుటుంబ మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకొనేటట్లు వారికి సూచనలు చేయడం.
• పల్లెలో ఆరుబయలు ప్రదేశాలలో మల మూత్రాదుల విసర్జన రహిత స్థితి (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) ఎంత పక్కాగా ఉన్నదీ మదింపు చేయడం, చైతన్య ప్రబోధక కార్యక్రమాలను నిర్వహిస్తూ పౌరుల ప్రవర్తనా సరళిలో చెప్పుకోదగిన మార్పు చోటు చేసుకునేటట్లు వారు క్రమం తప్పక టాయిలెట్లను ఉపయోగిస్తుండేలా ప్రోత్సహించడం, తద్వారా ‘ఓడీఎఫ్’ స్థితిని పరిరక్షించడం.
• గ్రామాలు, గ్రామ పంచాయతీలలో ‘స్వచ్ఛ సేవా ఆకలన్’ (ఎస్ఎస్ఏ) ఏ విధంగా ఉందీ మదింపు చేయడం, ఒకవేళ ఇది అప్పటికే పూర్తి కాలేదంటే గనక 2026 నవంబర్ 30 కల్లా ఎస్ఎస్ఏను పూర్తి చేసేటట్లు జాగ్రత్త చర్యలు తీసుకోవడం. ఎస్ఎస్ఏ ఈసరికే దాఖలు చేసి ఉంటే గనక గుర్తించిన లోటుపాట్లను సరి చేయడానికి ఇకపై తీసుకోవాల్సిన నిర్ణయాలేమేమిటో చర్చించడం.
• స్వచ్ఛతకు ఇవ్వవలసిన ప్రాధాన్యం, వ్యక్తిగతంతోపాటు సామాజిక స్వచ్ఛతను పరిరక్షించడం, చేతులను సబ్బుతో కడుక్కుంటూ ఉండటం, ఎఫ్ఎస్ఎమ్ నియమాలను పాటించడంపై శ్రద్ధ తీసుకోవడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమావళి-2026ను ఆచరణలో పెట్టడం, నాలుగు రకాల చెత్తను సేకరిరంచడం, స్వచ్ఛ సేవా ఆకలన్ సహా వివిధ విషయాలపై అవగాహన కలిగించడం, వాటిలో భాగంగా మహిళలు, విద్యార్థినులు, దివ్యాంగజనుల అవసరాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం వంటి అంశాలు సహా వివిధ విషయాలపై ప్రజలలో చైతన్యాన్ని పెంపొందింపచేయడం.
దీనికి తరువాయిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒక చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ప్రచార ఉద్యమానికి కార్యరూపాన్ని ఇవ్వడం కోసం తాము ఏయే పథకాలను అమలు చేయవలసి ఉంటుందో ఈ సందర్భంగా వివరించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, సిక్కిం, కర్నాటకల స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) బృందాలు ఈ ప్రచార ఉద్యమం కోసం తాము ఏయే కార్యకలాపాలను చేపట్టాలని నిర్ణయించుకున్నదీ తెలియజేశాయి.
ఈ-లాంచ్ కార్యక్రమంలో స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) సంయుక్త కార్యదర్శి, జాతీయ మిషన్ డైరెక్టరు ఐశ్వర్య సింగ్ మాట్లాడుతూ, ‘స్వచ్ఛ్ శౌచాలయ్-గరిమామయ్ భవిష్య’ (ఎస్ఎస్జీబీ) ప్రచార ఉద్యమాన్ని అందరికీ గౌరవం, అందరి ప్రయోజనాల కోసం ఉద్దేశించిన స్వచ్ఛత అన్న ఆదర్శవాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారన్నారు. రాబోయే కాలంలో స్వచ్ఛతా పరిరక్షకులుగా పాఠశాల విద్యార్థినుల
ను తీర్చిదిద్దడానికి ఎస్ఎస్జీబీ ప్రచార ఉద్యమం ప్రాధాన్యాన్ని ఇస్తుందని ఆమె అన్నారు. స్వచ్ఛత, పారిశుధ్యం, స్వస్థతలపై దృష్టి సారించాలని వారికి బోధిస్తుందన్నారు. టాయిలెట్లను స్వచ్ఛంగా ఉంచాలనీ, అవి అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూడటంలో సమాజం భాగస్వామ్యం పంచుకొనేటట్లు ప్రోత్సహిస్తుందనీ తెలిపారు.
ప్రచార ఉద్యమంలో పాఠశాల నిర్వహణ సంఘాలు, సంబంధిత విభాగాలతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) బృందాలు సమన్వయాన్ని ఏర్పరుచుకొని పనిచేయాలని కూడా ఎస్‌బీఎమ్ (జీ) సంయుక్త కార్యదర్శి, జాతీయ మిషన్ డైరెక్టరు ఐశ్వర్య సింగ్ పిలుపునిచ్చారు. దీనిలో బడి పిల్లలు పాల్గొనేటట్లు చూడాలని సూచించారు. స్కూల్ పారిశుధ్య ఆడిట్ ప్రక్రియ ఈ ప్రచార ఉద్యమంలో ఓ భాగమన్నారు. దేశంలోని పర్యటక ప్రాంతాలు సహా ఎక్కువ మంది ప్రజలు సందర్శించే స్థలాలలో స్వచ్ఛతకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెప్పారు. ఈ పరిసరాలు పర్యాటకులకు సమగ్ర అనుభవాన్ని ఇస్తాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా తోడ్పాటును కూడా అందించగలుగుతాయని ఆమె అతెలిపారు.
ఈ-లాంచ్ కార్యక్రమం ముగింపు ఘట్టంలో.. సంపూర్ణ స్వచ్ఛత కోసం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, దీనిని ఒక విజయవంతమైన ఉద్యమంగా మార్చడానికి వివిధ ఆసక్తిదారు వర్గాలు ఇందులో పాలుపంచుకోవడానికి ముందుకు వచ్చేటట్లు చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేశారు.
***