57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఇఫి 2026లో ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డు కోసం అయిదు వెబ్ సిరీస్‌ల పోటీ


విద్య, జానపదం, వ్యాపార రంగం, రాజకీయాలు, మానవ సంబంధాల నేపథ్యంలో విభిన్న కథాంశాలతో భారత ఓటీటీ రంగ సృజనాత్మకతకు అద్దం పడుతున్న కథనాలు

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2026 2:40PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2338261Views: 12

భారత డిజిటల్‌ వినోద రంగంలో వేగంగా మారుతున్న పరిణామాలు నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫి)లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఓటీటీ అవార్డుల విభాగంలో ఉత్తమ వెబ్‌ సిరీస్‌ పురస్కారం కోసం అయిదు విభిన్న వెబ్‌ సిరీస్‌లు నామినేట్‌ అయ్యాయి. సామాజిక వాస్తవాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, చారిత్రక ఘట్టాలు, మానవ సంబంధాల ఆధారంగా రూపొందిన కథలు.. అభివృద్ధి చెందుతున్న భారత ఓటీటీ రంగంలోని వైవిధ్యాన్ని, సృజనాత్మక ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి.

నామినేట్‌ అయిన వెబ్‌ సిరీస్‌ల వివరాలు..

ఆదర్శ్‌ బాల్‌ విద్యాలయ

హిమాంక్‌ గౌర్‌ దర్శకత్వం వహించిన ‘ఆదర్శ్‌ బాల్‌ విద్యాలయ’ భారత ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థలోని వాస్తవ పరిస్థితులను హాస్యం, సామాజిక వ్యాఖ్యానంతో ఆవిష్కరిస్తుంది. ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ప్రధానోపాధ్యాయుడు జ్ఞానేశ్వర్‌ త్రిపాఠి పాత్ర చుట్టూ కథ సాగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తేనే కేంబ్రిడ్జ్‌ సందర్శించాలన్న ఆయన కల నెరవేరుతుంది. ఆసక్తి లేని విద్యార్థులు, సంస్థాగత లోపాలు, సవాళ్లతో కూడిన విద్యా వాతావరణం ఆయన లక్ష్యానికి అడ్డంకులుగా నిలుస్తాయి. ఈ పరిస్థితుల్లో ఆదర్శవాద దృక్పథం కలిగిన ఓ ఉపాధ్యాయుడి రాక పాఠశాలను మార్చే ప్రయత్నానికి నాంది పలుకుతుంది.

విద్యారంగ సవాళ్లను ప్రతిబింబిస్తూ హాస్యాన్ని మేళవించిన ఈ సిరీస్‌.. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల పాత్రను, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మార్పు తీసుకురాగల అవకాశాలను చాటిచెబుతుంది.

దేవ్‌ఖేల్‌

జానపద కథలు, సంప్రదాయ విశ్వాసాల స్ఫూర్తితో చంద్రకాంత్‌ లతా గైక్వాడ్‌ దర్శకత్వం వహించిన ‘దేవ్‌ఖేల్‌’.. దేవ్‌తాలి గ్రామంలోని మర్మమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది. హోలీ పండుగ రాత్రి ప్రతి ఏడాది ఒకరు మరణించడం ఈ గ్రామంలో ఆనవాయితీగా మారుతుంది. స్థానిక సంప్రదాయాలతో ముడిపడిన పౌరాణిక రాక్షసుడు శంకాసురుడే ఈ వరుస మరణాలకు కారణమని గ్రామస్థులు భావిస్తుంటారు. మరో అనుమానాస్పద మరణం చోటుచేసుకోవడంతో ఇన్‌స్పెక్టర్‌ విశ్వాస్‌ ఈ వరుస ఘటనల వెనుక నిజాన్ని వెలికితీసేందుకు దర్యాప్తు ప్రారంభిస్తాడు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ గ్రామంలోని రహస్యాలు, దాగి ఉన్న ఉద్దేశాలు, విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్నలు వెలుగులోకి వస్తాయి.

నేరం, ఉత్కంఠ, జానపద అంశాలను మేళవించిన ఈ సిరీస్‌ మూఢనమ్మకాలు, సంప్రదాయాలు, వాస్తవాల మధ్య ఉండే సున్నితమైన సంబంధాన్ని ఆవిష్కరిస్తుంది.

మేడ్‌ ఇన్‌ ఇండియా: ఎ టైటన్‌ స్టోరీ

రాబీ గ్రేవాల్‌ దర్శకత్వం వహించిన ‘మేడ్‌ ఇన్‌ ఇండియా: ఎ టైటన్‌ స్టోరీ’.. భారత్‌లోని ప్రసిద్ధి చెందిన స్వదేశీ బ్రాండ్‌లలో ఒకటైన టైటన్‌ ఆవిర్భావం వెనుక ఉన్న పారిశ్రామిక దార్శనికతను వివరిస్తుంది. సరళీకరణకు ముందు కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌.. విదేశీ ఉత్పత్తులు, అక్రమంగా దిగుమతి చేసుకున్న గడియారాల ఆధిపత్యం ఉన్న మార్కెట్‌లో ప్రపంచ స్థాయి భారతీయ వాచ్‌ బ్రాండ్‌ను స్థాపించాలన్న జెర్క్సెస్‌ దేశాయ్‌ ప్రయత్నాన్ని అనుసరిస్తుంది. జేఆర్‌డీ టాటా మార్గదర్శకత్వం, అంకితభావంతో కూడిన బృందం సహకారంతో దేశాయ్‌ అధికారిక విధానపరమైన అడ్డంకులు, ఆర్థిక పరిమితులు, సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతారు.

ఒక ప్రతిష్ఠాత్మక పారిశ్రామిక ఆలోచనను భారత కార్పొరేట్ చరిత్రలో కీలక ఘట్టంగా మార్చిన పట్టుదల, ఆవిష్కరణ, మార్గదర్శక స్ఫూర్తిని ఈ కథనం ప్రతిబింబిస్తుంది.

మాయసభ: ది రైజ్‌ ఆఫ్‌ ది టైటాన్స్‌

1970వ దశకంలోని రాజకీయ ఉద్రిక్తతలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ నేపథ్యంలో దేవ కట్టా దర్శకత్వం వహించిన ‘మాయసభ: ది రైజ్‌ ఆఫ్‌ ది టైటాన్స్‌’ తెరకెక్కింది. ఆదర్శవాద విద్యార్థి నాయకుడు కాకర్ల కృష్ణమానాయుడు (కేకేఎన్‌), రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన యువకుడు ఎంఎస్‌ రామిరెడ్డి జీవిత ప్రయాణాన్ని ఈ సిరీస్‌ ఆవిష్కరిస్తుంది.

విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ, సామాజిక, రాజకీయ మార్పు తీసుకురావాలన్న ఆశయంతో తొలుత స్నేహితులుగా మారిన వీరిద్దరి మధ్య.. రాజకీయ జీవితంలోని కఠిన వాస్తవాలను ఎదుర్కొంటున్న క్రమంలో క్రమంగా విభేదాలు పెరుగుతాయి. కుల విభజనలు, డబ్బు, అవినీతి, అధికారం కోసం పోరాటం, మారుతున్న రాజకీయ సమీకరణాలు వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి. సహచరులుగా ప్రారంభమైన వీరి ప్రయాణం రాజకీయ ప్రత్యర్థులుగా మారడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. రాజకీయ వ్యూహాలు, మారుతున్న విధేయతలు, అధికార కేంద్రాల్లో మానవ సంబంధాల సంక్లిష్టతలను ఈ సిరీస్‌ ఆసక్తికరంగా ఆవిష్కరిస్తుంది.

ముసాఫిర్ కేఫ్

రుచిర్‌ అరుణ్‌ దర్శకత్వం వహించిన ‘ముసాఫిర్‌ కేఫ్‌’..  ప్రేమ, తోడుగా నిలవడం, ఆత్మాన్వేషణలోని అనేక కోణాలను సున్నితమైన కథనంతో ఆవిష్కరిస్తుంది. చందర్‌ మోహన్‌ శర్మ, సుధ, ప్రీతిలతో ఆయనకున్న సంబంధాల చుట్టూ ఈ సిరీస్‌ కథ సాగుతుంది. మారుతున్న పరిస్థితులు, వ్యక్తిగత నిర్ణయాలు, మానవ సంబంధాల్లోని సంక్లిష్టతల మధ్య చందర్‌ మోహన్‌ సాగించే భావోద్వేగ ప్రయాణాన్ని ఇది వివరిస్తుంది. భోపాల్‌, ముస్సోరీలోని సుందరమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో సాగే ఈ కథనం.. ప్రేమ, చేజారిన అవకాశాలు, అంగీకారం, జీవితాన్ని మలుపు తిప్పే అనూహ్య పరిణామాలపై ఆలోచింపజేస్తుంది. ప్రతి పరిచయం మానవ అనుభవంపై చెరగని ముద్ర వేస్తూ, ఎదుగుదలకు, కొత్త విషయాలను తెలుసుకునేందుకు దోహదపడే ప్రయాణాలుగా మానవ సంబంధాలను ఈ సిరీస్‌ చూపిస్తుంది.

ఈ అయిదు నామినేషన్లు భారత ఓటీటీ రంగంలో విస్తరిస్తున్న సృజనాత్మక అవకాశాలను చాటుతున్నాయి. విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, సామాజిక నేపథ్యాలకు చెందిన కథలు డిజిటల్‌ మాధ్యమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలోని సవాళ్లు, గ్రామీణ జానపద కథల్లోని రహస్యాలు, భారత పారిశ్రామికవేత్తల ప్రస్థానం, రాజకీయ ఆధిపత్య పోరు, ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాల వరకు.. సమకాలీన భారతీయ కథనాలు అనేక అంశాలను అన్వేషిస్తున్నాయని ఈ నామినేట్‌ అయిన సిరీస్‌లు వెల్లడిస్తున్నాయి.

నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫి)లో ప్రదానం చేయనున్న ఉత్తమ వెబ్‌ సిరీస్‌ (ఓటీటీ) అవార్డు.. ఒరిజినల్‌ వెబ్‌ కంటెంట్‌లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి, భారత డిజిటల్‌ వినోద రంగాన్ని తీర్చిదిద్దుతున్న రచయితలు, దర్శకులు, సృజనకర్తలు, నటులు, నిర్మాణ బృందాల సృజనాత్మక దార్శనికత, కృషిని గౌరవిస్తుంది. వినూత్న కథనాలు, చలనచిత్ర వ్యక్తీకరణకు ఓటీటీ వేదికలు కీలక మాధ్యమంగా ఎదుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ నామినేషన్లు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2338261
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026