గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీబీ–జీ రామ్ జీ అమల్లో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని బలోపేతం చేసేలా అంబుడ్స్‌పర్సన్ మార్గదర్శకాలను జారీ చేసిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ


వీబీ- జీ రామ్ జీ పరిధిలోగ్రామీణ కార్మికుల హక్కులను పరిరక్షించడానికి దృఢమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం


వీబీ–జీ రామ్ జీ అమల్లో జవాబుదారీతనాన్ని పెంచడానికి డిజిటల్ పర్యవేక్షణ, సామాజిక ఆడిట్‌లు, పౌర భాగస్వామ్యం

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2026 10:29AM by PIB Hyderabad

వికసిత్ భారత్ – రోజ్‌గార్, అజీవికా మిషన్ (గ్రామీణ్) హామీ: వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, పౌర భాగస్వామ్యం కోసం అంబుడ్స్‌పర్సన్, అప్పీలేట్ అథారిటీ మార్గదర్శకాల ద్వారా విధానాలను బలోపేతం చేసింది.

కార్మికుల చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించడానికి, అమలుకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి, కార్యక్రమ ప్రయోజనాలను జవాబుదారీతనంతో అందించడాన్ని ప్రోత్సహించడానికి సంస్థాగత యంత్రాంగాలను బలోపేతం చేయడం ద్వారా ఈ మార్గదర్శకాలు వీబీ–జీ రామ్ జీ చట్టం స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తాయి. కార్యక్రమానికి సంబంధించిన జవాబుదారీ విధానంలో ముఖ్యమైన వారధిగా అంబుడ్స్‌పర్సన్ వ్యవహరిస్తారు. అలాగే గ్రామీణ పౌరులు ఫిర్యాదులు చేయడానికి, తగిన పరిష్కారం కోరడానికి సులభంగా అందుబాటులో ఉండే యంత్రాంగాన్ని అందిస్తారు.

జాబ్ కార్డులు, ఉపాధి, వేతన చెల్లింపులు, ఆలస్య పరిహారం, పని ప్రదేశాల్లో సౌకర్యాలు, మస్టర్ రోల్స్, చట్టబద్ధమైన హక్కుల నిరాకరణకు సంబంధించిన ఫిర్యాదులను జిల్లా స్థాయిలో నియమితులైన ప్రత్యేక అంబుడ్స్‌పర్సన్ పరిష్కరిస్తారు. వివక్ష, వేధింపులు, మహిళలు, బలహీన వర్గాలతో సహా కార్మికుల హక్కుల ఉల్లంఘనలను కూడా ఈ మార్గదర్శకాలు పరిగణనలోకి తీసుకుంటాయి. తద్వారా అటువంటి సమస్యలకు తగిన ప్రాధాన్యం లభించేలా చూస్తాయి.

గ్రామీణాభివృద్ధి, ప్రజా పరిపాలన, న్యాయం, విద్యాబోధన, సామాజిక సేవ, నిర్వహణ రంగాల్లో అనుభవం ఉన్న అర్హులైన అభ్యర్థుల పరిధిని విస్తృతం చేయడం ద్వారా అంబుడ్స్‌పర్సన్ల సంస్థాగత సామర్థ్యాన్ని ఈ మార్గదర్శకాలు బలోపేతం చేస్తాయి. పనిలో కొనసాగింపు, సమర్థవంతమైన పనితీరుకు తోడ్పడేలా పదవీకాలం, వేతనాలకు సంబంధించిన నిబంధనలను కూడా సవరించారు. క్షేత్రస్థాయి పర్యటనలు, సామాజిక భాగస్వామ్యం, డిజిటల్ వేదికలపై అవగాహనకు ప్రాధాన్యం ఇచ్చారు.

అంబుడ్స్‌పర్సన్ల కోసం ప్రత్యేకంగా డిజిటల్ వేదికను రూపొందించారు. ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, వాటి స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, విచారణ వివరాలను రికార్డు చేయడం, తీర్పులను అప్‌లోడ్ చేయడం, తీసుకున్న చర్యలను పర్యవేక్షించడం లాంటి పనులను ఈ వేదిక సులభతరం చేస్తుంది. క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో తీసే జియో-ట్యాగ్, టైమ్-స్టాంప్ ఫోటోలు ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో డాక్యుమెంటేషన్‌ను, ఆధారాలను గుర్తించడాన్ని, పారదర్శకతను మరింత బలోపేతం చేస్తాయి.

ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించే కీలక సాధనంగా సోషల్ ఆడిట్ పాత్రను ఈ మార్గదర్శకాలు మరింత బలోపేతం చేస్తున్నాయి. ప్రతి నెలా కనీసం మూడు సామాజిక తనిఖీ ప్రజా విచారణలకు లేదా గ్రామసభలకు  అంబుడ్స్‌పర్సన్లు హాజరవుతారు. దీనివల్ల ప్రజల సమస్యలను నేరుగా విని, తగిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుంది. వ్యక్తిగత ఫిర్యాదులతో పాటు సోషల్ ఆడిట్ నివేదికలు, ప్రజాభిప్రాయాల ఆధారంగా లోపాలను గుర్తించి, నిర్దేశిత నిబంధనల ప్రకారం దిద్దుబాటు చర్యలు చేపడతారు.

డిజిటల్ పర్యవేక్షణ, బహిరంగ సమాచార వెల్లడి, సోషల్ ఆడిట్ సహా వీబీ–జీ రామ్ జీ పరిధిలో చేపట్టే పారదర్శక చర్యలకు అంబుడ్స్‌పర్సన్, అప్పిలేట్ అథారిటీ వ్యవస్థ మరింత బలాన్ని చేకూరుస్తుంది. పారదర్శక అమలును ప్రోత్సహించడం, పర్యవేక్షణను పటిష్ఠం చేయడం, ఫిర్యాదులను క్రమబద్ధమైన, జవాబుదారీ ప్రక్రియ ద్వారా పరిష్కరించడం ఈ యంత్రాంగాల ఉమ్మడి లక్ష్యం.

ఈ మార్గదర్శకాల ద్వారా వీబీ–జీ రామ్ జీ పరిధిలో పౌర-కేంద్రక పాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా గ్రామీణ కార్మికులకు ఫిర్యాదుల పరిష్కారానికి సులభమైన మార్గాలు అందుబాటులో ఉండేలా, పథకం అమలు పారదర్శకంగా, వేగవంతంగా, జవాబుదారీగా సాగేలా చూస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2337853) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Odia , Kannada , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil