వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తొలి స్వదేశీ హెచ్5ఎన్1 (క్లేడ్ 2.3.2.1ఏ) చికెన్ వ్యాక్సినును నవంబర్ 20న దేశానికి అంకితం చేయనున్న శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

కోళ్ల వ్యాధుల నియంత్రణ బలోపేతానికి
స్వదేశీ హెచ్5ఎన్1 టీకా మందును తయారు చేసిన ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీ

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2026 9:38AM by PIB Hyderabad

కోళ్లను దృష్టిలో పెట్టుకొని భారత్‌లో తయారు చేసిన తొలి స్వదేశీ నిష్క్రియాత్మక హెచ్5ఎన్1 (క్లేడ్ 2.3.2.1ఏ) అత్యధిక వ్యాధిజనక ఎవియన్ ఇన్‌ఫ్టుయెంజా (హెచ్‌పీఏఐ) టీకా మందును కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్  దేశానికి అంకితం చేయనున్నారు.

భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఏనిమల్ డిసీజెస్ (ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీ)లో 2026 నవంబర్ 20న ఈ కార్యక్రమం జరగనుంది. భోపాల్‌లోని ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీ దేశీయంగా తయారు చేసిన ఈ టీకా హెచ్5ఎన్1 హెచ్‌పీఏఐ వైరసుకు వ్యతిరేకంగా పనిచేసే తొలి భారతీయ టీకా కానుంది.
నేపథ్యం
అత్యధిక వ్యాధికారకం అయిన ఎవియన్ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్‌పీఏఐ)ను సాధారణంగా బర్డ్ ఫ్లూ పేరుతో వ్యవహరిస్తారు. ఇది కోళ్లను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి వల్ల సంక్రమిత పక్షుల్లో మరణాల రేటు దాదాపు 100 శాతం వరకూ ఉండి, తత్పలితంగా పెద్ద సంఖ్యలో కోళ్లను చంపివేయక తప్పని పరిస్థితులు ఏర్పడడమే కాకుండా కోళ్ల వ్యాపారంపైన ఆంక్షలను కూడా పౌల్ట్రీ రైతులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇది వారికి భారీ నష్టాలను మిగుల్చుతుంది. దీని ప్రభావం ఒక్క కోళ్ల ఫారాలకే పరిమితం కాదు. దీని ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యం, పౌల్ట్రీ ఉత్పాదనల ధరలు, రైతుల జీవనోపాధిపైన కూడా ఉంటుంది. భారతదేశంలో ఈ వ్యాధిని 2006లో తొలిసారి గమనించారు. అప్పటి నుంచి దేశంలో హెచ్5ఎన్1, హెచ్5ఎన్8 ఉప రకాలు కలిసి ప్రబలిన సందర్భాలు 500 కన్నా ఎక్కువగా ఉన్నాయి.
బర్డ్ ఫ్లూ పెద్ద ఎత్తున వ్యాపించడం వల్ల భారతదేశ జీడీపీ వృద్ధి రేటులో 1.5 శాతం వరకు తగ్గుదలకు ఆస్కారం ఉండవచ్చు. అదే ఈ వ్యాధి అడ్డూ అదుపూ లేకుండా వ్యాప్తి చెందితే గనక, దేశంలో 20 శాతాని కన్నా ఎక్కువ కోళ్ల సంతతికి ముప్పు ఎదురు కావచ్చు. 2006లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా నమోదైన నష్టాలు దాదాపు రూ.2,200 కోట్ల మొదలు రూ.3,000 కోట్ల వరకు ఉన్నాయి. మణిపూర్‌లో బర్డ్ ఫ్లూ  వ్యాప్తి వల్ల రాష్ట్ర జీడీపీలో 0.5 శాతానికి సమానమైన నష్టం వాటిల్లింది. ఈ వ్యాధి ప్రజారోగ్యానికి కూడా సమస్యాత్మకంగా పరిణమించింది. 2003 నుంచి ఇప్పటి వరకు భారత్ సహా 25 దేశాలలో హెచ్5ఎన్1 ఎవియన్ ఇన్‌ఫ్టుయెంజా మనుషులకు సైతం సంక్రమించిన 1,003 కేసులు బయటపడ్డాయని, 479 మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది.
కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి చాలా వరకు హెచ్5ఎన్1 వైరస్ రకమే కారకం అవుతోందని వైరస్ అధ్యయనాలలో తేలింది. ఈ రకం క్లేడ్ 2.3.2.1ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇటీవలి కాలాల్లో, వేరు వేరు పశు ప్రజాతులలో ఈ రకం సంక్రమణను గుర్తించారు. ఆయా పశువులలో పాలిచ్చే పశువులు కూడా కలిసి ఉన్నాయి. అంతేకాదు, మనుషులకు ఈ వైరస్ సోకిన మూడు సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కోళ్ల రైతులకు ఈ వైరసు వ్యాప్తిని నియంత్రించడం కీలకంగా మారింది. అదే సాధ్యపడిందంటే, ఆర్థిక నష్టాలను తగ్గించుకోవచ్చు. అలాగే కోళ్ల నుంచి ఇతర పశువులకు, మనుషులకు ఈ వ్యాధి సోకకుండా కూడా అరికట్టవచ్చు.
ప్రస్తుతానికి, క్లేడ్ 2.3.2.1ఏ లోని హెచ్5ఎన్1 వైరస్ రకానికి వ్యతిరేకంగా ఉపయోగించే ఎలాంటి నిర్దిష్ట వాణిజ్య టీకా మందు అందుబాటులో లేదు. ఇందువల్ల, భారతదేశానికంటూ ఓ స్వదేశీ టీకాను అభివృద్ధిపరచుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఈ అవసరాన్ని తీరుస్తూ, దేశంలో వ్యాపిస్తున్న క్లేడ్ 2.3.2.1ఏ హెచ్5ఎన్1 వైరస్ రకం నుంచి రక్షణను అందించాలని ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీ లక్ష్యంగా పెట్టుకొని మరీ ఈ టీకాను తయారు చేసింది.

***


(రిలీజ్ ఐడి: 2337768) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Nepali , Marathi , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam