ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో, ఆయన నుంచి నేర్చుకోవలసిన విషయాలపై ఓ జాతీయ కార్యశాల (వర్క్‌షాప్)ను నీతి ఆయోగ్ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు నిర్వహిస్తోంది. ‘‘ఓ ఉద్యమంగా నాయకత్వం’’ అనే అంశాన్ని ఈ వర్క్‌షాపునకు ఇతివృత్తంగా ఎంపిక చేశారు. ప్రధానమంత్రి 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలను స్వీకరించారు. దేశ ప్రధానమంత్రిగా 2014 మే నెలలో ఆయన బాధ్యతలను చేపట్టారు. అప్పటి నుంచి రాష్ట్ర, కేంద్ర స్థాయులలో విరామం తీసుకోకుండా ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూవస్తున్నారు. ఆయన తన పదవీకాలం పర్యంతం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సేవాప్రధానమైన ఉద్యమంగా పరిగణిస్తున్నారు. తాను ప్రధాన సేవకుడిని అని చెప్పుకొన్నారు. ఈ భావన ప్రభుత్వంలోని ప్రతి పదవిలోనూ పౌరులనే ప్రధాన కేంద్ర బిందువుగా నిలబెడుతున్నది. అలాగే అంత్యోదయ, ప్రజల భాగస్వామ్యం, ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ సిద్ధాంతాలు కేంద్ర, రాష్ట్ర స్థాయులలో ప్రభుత్వం ఏ దిశగా ముందుకు సాగాలో మార్గదర్శనం చేశాయి.
జాతీయ స్థాయిలో అయిదు భాగాల వర్క్‌షాపును నిర్వహించాలని ప్రతిపాదించారు. వాటిలో ప్రస్తుత వర్క్‌షాప్ ఒకటోది.
ఈ అయిదు వర్క్షాపులలోనూ జరిపే చర్చలు, వెల్లడి అయ్యే అనుభవాల్ని ఆధారం చేసుకొని సివిల్ సర్వీసుల శిక్షణాసంస్థలు, విద్యాసంస్థలతో పాటు విశ్వవిద్యాలయాలలో కూడా తగ్గ బోధన సామగ్రిని, కేస్ స్టడీలను రూపొందించనున్నారు. వర్క్‌షాపులు పురోగమించే క్రమంలో, ఈ ఇరవై అయిదేళ్లు నేర్పే అంశాలను పరిశోధన, బోధన సామగ్రి ద్వారా ముందుకు తీసుకుపోతారు. ఇవి 2047 కల్లా ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం)ను సాధించడానికి రాబోయే సంవత్సరాల్లో విధాన పరంగాను, పాలన పరంగాను అనుసరించాల్సిన బాటను ఖరారుచేస్తాయి.
నేడు నిర్వహించిన కార్యశాలలో 900 మందికి పైగా పాల్గొన్నారు. వారిలో 250 మంది చర్చలలో పాలుపంచుకొని, తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. వర్క్‌షాపులో పాలుపంచుకున్న వారిలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యదర్శులు, సీనియర్ అధికారులు, అభివృద్ధి కోసం తపిస్తున్న జిల్లాల కలెక్టర్లు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల విద్యార్థులు, సాముదాయిక భాగస్వాములు, జాతీయ స్థాయి ప్రధాన పథకాల లబ్ధిదారులు ఉన్నారు. చర్చాక్రమాన్ని ఐజీఓటీ కర్మయోగి (iGOT Karmayogi) వేదికలో, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర పాలనా సంబంధ శిక్షణ సంస్థలలో దృశ్యమాధ్యమం ద్వారా ప్రసారం చేశారు. దీంతో దేశం నలుమూలల నుంచి అధికారులకు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనేందుకు అవకాశం లభించింది.
వర్క్‌షాపులో ముందుగా జాతీయ గేయాన్ని, జాతీయ గీతాన్ని ఆలపించారు. తరువాత నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ అనురాగ్ జైన్ స్వాగతోపన్యాసాన్ని ఇచ్చారు. గౌరవనీయ ప్రధానమంత్రి 25 సంవత్సరాల నాయకత్వం నుంచి నేర్చుకోవలసిన విషయాలను తెలియజెప్పడంతో పాటు, ఆ అంశాలను భవిష్యత్తులో అనుసరించవలసిన సంస్థాగత జ్ఞాన భాండాగారంగా రూపొందించడం కూడా ఈ వర్క్‌షాప్ ధ్యేయమని ఆయన వివరించారు.
నాయకత్వ ప్రస్థానం అందిస్తున్న నాలుగు ప్రధాన పాఠాలను నీతి ఆయోగ్ సీఈఓ పేర్కొన్నారు. ఒకటో పాఠం.. అధికార పదవి కన్నా పరమార్థానిదే పైచేయి కావాలని, వ్యక్తిగత సారథ్యం నుంచి ఉమ్మడి ఉద్యమ పథంలో పురోగమించడంపై దృష్టిని కేంద్రీకరించాలని చెబుతుంది. రెండోది, ప్రభుత్వ ఆధిపత్యానికి బదులు సేవకు ప్రాముఖ్యాన్ని ఇచ్చితీరాలని, పాలన ప్రయోజనాలను వరుసలోని ఆఖరి వ్యక్తికి కూడా అందించేందుకు పెద్ద పీట వేయాలని సూచిస్తుంది. మూడో పాఠం సవాళ్లను దీటుగా ఎదుర్కొనే శక్తిని ప్రబల నమ్మకం పెంపొందింప చేస్తుందని, ప్రతికూల స్థితిని అయినా సరే సమాజంలో పరివర్తనను తీసుకువచ్చేందుకు ఒక అవకాశంగా మలచుకోవడానికి తోడ్పడుతుందని చాటుతుంది. ఇక నాలుగో పాఠం బలమైన సంస్థలు, దక్షత గల బృందాలు, సుస్థిర వ్యవస్థల సాయంతో వ్యక్తిగత నాయకత్వం కన్న వాస్తవిక సాధికారత కల్పన పరమార్థం కావాలని బోధిస్తుందని నీతి ఆయోగ్ సీఈఓ తెలిపారు.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ అశోక్ కుమార్ లాహిరి ప్రారంభోపన్యాసాన్నిస్తూ, ‘‘భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే క్రమంలో దృఢమైన రాజకీయ, పాలన సంబంధిత నేతృత్వం పోషించాల్సిన పాత్ర ఎంతో కీలకం. మన గౌరవనీయ ప్రధానమంత్రి పరివర్తన ప్రధాన దృష్టికోణం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ రూపొందాలన్న జాతీయ ఆకాంక్షను చాటుతోంది. ఇది దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగాను, సంపన్న దేశంగాను, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే దేశంగాను మార్చనుంద’’న్నారు.
భారతదేశాన్ని 2047 కల్లా 30 నుంచి 40 లక్షల కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటున్న నీతి ఆయోగ్ ఏకీకృత కార్యాచరణను శ్రీ లాహిరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2047 కల్లా భారత్‌లో తలసరి ఆదాయం 15,000 నుంచి 18,000 అమెరికా డాలర్లకు వృద్ధి చెంది, నిరంతర ప్రాతిపదికన వార్షిక వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 7 నుంచి 10 శాతం మధ్య నమోదు అవ్వాలనేది ధ్యేయమని ఆయన వివరించారు.
ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన డాక్టర్ పి.కె. మిశ్రా కీలక ప్రారంభోపన్యాసాన్నిస్తూ, ‘‘భారత పాలన ప్రస్థానంలో అనేక ప్రధాన మజిలీలున్నాయి. ఇవి నిర్ణయాత్మక నాయకత్వ శక్తి, దూరదృష్టి కలిగిన కార్యాచరణగా మారే సామర్థ్యాన్ని చాటి చెబుతున్నాయి. 2001లో కచ్‌లో భూకంపం సంభవించినప్పుడు సత్వర ప్రతిస్పందన మొదలు కోవిడ్-19 మహమ్మారి పట్ల దేశమంతా ఏకతాటిపై నిలబడి స్పందించిన తీరు వరకు.. అలాగే, ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత ఉనికి వృద్ధి చెందడం మొదలు ‘లఖ్పతి దీదీ’ కార్యక్రమం ప్రసరించిన పరివర్తనాత్మక ప్రభావం వరకు.. పరిశీలిస్తే ఈ విజయాలన్నీ బలమైన రాజకీయ సంకల్పం, బాధ్యతాయుత పాలనాయంత్రాంగం, లక్ష్యం దిశగా దూసుకుపోయే పాలన ప్రజల జీవితంలో అర్థవంతమైన మార్పును తీసుకురాగలుగుతాయ’’న్నారు.
కోటక్ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు శ్రీ ఉదయ్ కోటక్ మాట్లాడుతూ, ‘‘మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యానికి, అలాగే మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగాను, తరువాత భారతదేశ ప్రధానమంత్రిగాను, ఔత్సాహిక పారిశ్రామికత్వాన్ని ఆర్థిక అభివృద్ధికి, దేశ నిర్మాణానికి ప్రధాన చోదకశక్తిగా నిరంతర గుర్తింపు లభించింది. సహాయక వ్యవస్థలకు సంస్థాగత రూపును ఇవ్వడం, ఆర్థిక-ఔత్సాహిక పారిశ్రామికత్వ విస్తారిత అనుబంధ వ్యవస్థ పటిష్ఠీకరణ, చైతన్యవంతమైన అంకుర వ్యవస్థ ఆవిర్భావం.. ఈ పరిణామాలు కూడా ఈ నిబద్ధతనే సూచిస్తున్నాయ’’న్నారు.
వర్క్‌షాపు రూపురేఖలు, స్వరూపాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్. బాలసుబ్రమణియమ్ వివరించారు. వర్క్‌షాపులో నాయకత్వాన్ని అది వ్యక్తమయ్యే నిర్ణయాలు, పనుల ఆధారంగా పరిశీలిస్తారని, రోజంతా చేపట్టిన కార్యక్రమాల నుంచి సంపాదించిన అనుభవాన్ని విశ్లేషించి, ఆ విశ్లేషణ నుంచి కార్యాచరణ వైపు సాగిపోయేటట్లు చూస్తారన్నారు. కార్యక్రమాలను అయిదు దశలుగా విభజించారు. ఆ దశల్లో.. నేర్చుకోవడం, విశ్లేషించడం, మననం చేసుకోవడం, అమల్లో పెట్టడం, నిబద్ధతతో నడుచుకోవడం వంటివి ఉన్నాయి. ఈ దశలలో భాగంగా వర్క్‌షాపులో పాల్గొన్న వారు కీలక నిర్ణయాలతో ముడిపడిన వాస్తవిక జీవితానుభవాల నుంచి నేర్చుకున్నారు. ప్రభుత్వ ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు, పౌరులతో కలసి చర్చల రూపంలో వాటిని విశ్లేషించారు. ప్రజా నాయకత్వం తాలూకు దీర్ఘకాల ప్రాతిపదిక కలిగివుండే పద్ధతులపై చర్చించారు. ఇలా నేర్చుకున్న విషయాలను తమ విధుల్లో ఎదురయ్యే సవాళ్లకు వర్తింపచేశారు. తమ నాయకత్వ పద్ధతులలో విశిష్ట మార్పు చేసుకోవడానికి నిబద్ధతను ప్రోది చేసుకున్నారు. భారతీయ నిర్ణయాలు, సంస్థలపై ఆధారపడిన ప్రజా నాయకత్వానికి జ్ఞానంతో ముడిపెట్టిన ఒక భారతీయ భాండాగారాన్ని రూపొందించడం ఈ వర్క్‌షాపు ఉద్దేశమని ఆయన వివరించారు. ఆ భాండాగారం 2047 కల్లా ‘వికసిత్ భారత్’ దిశగా ముందడుగు వేసే కాలంలో సివిల్ సేవకులకు అందించాల్సిన శిక్షణ పద్ధతులతో పాటు నాయకత్వ పద్ధతులను కూడా రూపొందిస్తుందని డాక్టర్ ఆర్. బాలసుబ్రమణియమ్ అన్నారు.
‘లీడర్షిప్ మూమెంట్స్’ సమావేశంలో, నలుగురు వక్తలు కీలక క్షణాలలో తమ ప్రత్యక్ష అనుభవాలు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను వివరించారు.
గుజరాత్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ రాజీవ్ టాప్నో మాట్లాడుతూ 2001వ సంవత్సరంలో కచ్ భూకంపం కేవలం సామాన్య స్థితిని పునరుద్ధరించే గాథ కాదని, ప్రజల భాగస్వామ్యం, సంస్థాగత పటిష్ఠీకరణ, సామూహిక సంకల్పం ద్వారా ఒక నూతన వ్యవస్థను ఏర్పరిచే గాధ అని తెలిపారు. ఈ అనుభవం ప్రభావవంతమైన పాలనకు సంబంధించిన నాలుగు మూల స్తంభాలను ప్రస్తావించిందని, దృక్పథంలో స్పష్టత, నిర్ణయాత్మకత, సంఘీభావం, నిబద్ధత, ప్రభుత్వ సహకారంతో ప్రజలు భాగం పంచుకోవడానికి ముందంజ వేయడం, బలమైన సంస్థా నిర్మాణం అనేవే ఆ మూలస్తంభాలని ఆయన వివరించారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్వ కార్యదర్శి, యూపీఎస్సీ పూర్వ చైర్పర్సన్, మహమ్మారి సన్నద్ధత, ప్రతిస్పందన విషయాలపై ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర బృందంలో పూర్వ సభ్యురాలు ప్రీతి సూదన్ మాట్లాడుతూ, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం కోవిడ్-19 స్పందనను ఒక సమగ్ర ప్రభుత్వ దృష్టికోణం నుంచి ఒక సమగ్ర సామాజిక ఉద్యమంగా మార్పు చెందిందన్నారు. వైద్యులు, నర్సులు, మొదటి అంచెలో సేవలందించే వారి సురక్షకు ప్రాధాన్యాన్నిస్తూ, సాంకేతికతను వెన్నెముకగా చేసుకొని, ప్రజా ఉద్యమాల రూపంలో జన భాగస్వామ్యానికి వేగాన్ని జతచేసి భారత్ సమన్వయపూర్వక ప్రతిస్పందనను కనబరిచిందని ఆమె అన్నారు. ‘వ్యాక్సీన్ మైత్రి’ కార్యక్రమాన్ని అమలుపరిచి, 100కు పైగా దేశాలకు సుమారు 30 కోట్ల టీకా మోతాదులను సరఫరా చేసిన భారత్ అంతర్జాతీయ సంఘీభావం పట్ల నిబద్ధతను మరింత ఎక్కువగా చాటుకొందని ప్రీతి సూదన్ వివరించారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పూర్వ కార్యదర్శి శ్రీ శైలేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ‘‘ఒక పనిని ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగనంత విస్తృత స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావచ్చనే దానికి ‘లఖ్పతి దీదీ’ కార్యక్రమం ఓ ఉదాహరణగా నిలిచింది. గౌరవనీయ ప్రధానమంత్రి గ్రామ ప్రాంతాలకు చెందిన మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగాను, ఉత్పాదకులుగాను, సేవల సరఫరాదారులుగాను గుర్తించి ఈ కార్యక్రమానికి ఒక స్పష్టమైన, మహత్త్వాకాంక్ష కలిగిన లక్ష్యాన్ని నిర్ధారించారు. ‘లఖ్పతి దీదీ’ కార్యక్రమం ఆదాయాన్ని అందించడానికి మాత్రమే పరిమితం కాదు, అది ఈ మహిళలకు తమ కుటుంబాల దృష్టిలో, సమాజం దృష్టిలో ఆర్థిక స్వాతంత్య్రాన్ని, గౌరవాన్ని, గుర్తింపును కట్టబెట్టడానికి సంబంధించింది. నా అభిప్రాయంలో ఇది దీని విశాల లక్ష్యమ’’న్నారు.
ఇస్రో పూర్వ చైర్మన్, కేంద్ర అంతరిక్ష విభాగం పూర్వ కార్యదర్శి డాక్టర్ ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) నియమాలలో మార్పులు ప్రయివేటు రంగ ప్రాతినిధ్యానికి ఎలా కొత్త బాటలను పరిచాయో వివరించారు. దీంతో ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే రంగాలలో ఒక కీలక రంగంగా అంతరిక్ష రంగం లెక్కలోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఇస్రో తన నైపుణ్యాలను, మౌలిక వసతులను, సదుపాయాలను ప్రయివేటు సంస్థల అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ మార్పునకు మార్గాన్ని సుగమం చేయడంలో ఒక కీలక పాత్రను పోషిస్తోందని డాక్టర్ సోమనాథ్ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో, భారత ‘అంతరిక్ష దృష్టికోణం-2047’ మన శాస్త్రవేత్తల సామర్థ్యాలను మరింత పెంపొందింప చేయనుందని, అంతర్జాతీయ అంతరిక్ష శక్తిగా భారత స్థితిని పటిష్టపరుస్తుందని ఆయన అన్నారు.
ఈ సమావేశం ముగిసిన తరువాత, ఒక ‘కేస్ క్లినిక్’ను చేపట్టారు. దీనిలో భాగంగా ప్రతి బృందం తమకు కేటాయించిన అధ్యాయం నుంచి ఒక నిర్దిష్ట నిర్ణయాన్ని పరిశీలించింది. ప్రతి సమూహంలో ప్రభుత్వ అధికారులు, సాముదాయిక భాగస్వాములు, విద్యార్థులు పాల్గొన్నారు. వారికి సామర్థ్యాలను పెంపొందింపచేసే కమిషన్ (కెపాసిటీ బిల్డింగ్ కమిషన్)కు చెందిన ‘అమృత్ జ్ఞాన్ కోశ్’ కార్యక్రమంలో శిక్షణను పొందిన రచయిత ద్వారా మార్గదర్శకత్వాన్ని అందించారు. సమూహ చర్చలు, వక్తలు వెల్లడించిన స్వీయ అనుభవాలను కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో కేస్ స్టడీస్‌గా రూపొందిస్తారు. ఈ కేస్ స్టడీస్‌ను సివిల్ సేవకులు, శిక్షణ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఉపయోగించుకొనేందుకు ఐజీఓటీ కర్మయోగి వేదిక ద్వారా అందుబాటులోకి తీసుకువస్తారు.
ఇదే రోజున, ‘‘వికసిత్ భారత్ ఆశయ సాధన కోసం నాయకత్వం’’ అంశంపై ఒక బృంద చర్చను కూడా నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారులు ఒక ‘అప్లికేషన్ క్లినిక్’ కార్యక్రమంలో పాలుపంచుకొంటారు. కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్ ‘కర్మయోగి సంకల్ప’ను ఆరంభించి, ముగింపు ఉపన్యాసాన్నిస్తారు.