నాడు పోస్టు చేయడమైనది:
17 NOV 2026 1:57PM by PIB Hyderabad
గౌరవ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు.. మనీలాలో జరుగుతున్న 23వ భారత్ - ఆసియాన్ సదస్సులో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ‘కలిసికట్టుగా మన భవితను నిర్దేశించుకుందాం (నావిగేటింగ్ అవర్ ఫ్యూచర్, టు గెదర్)’ ఇతివృత్తంతో ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంతోపాటు, కంట్రీ కోఆర్డినేటర్‌గా భారత్‌కు మద్దతిస్తున్న అధ్యక్షుడు మార్కోస్‌కు శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.
సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ.. ఆసియాన్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని శ్రీ మోదీ వివరించారు. ఆసియాన్ పరిధిలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, స్థిరత్వాల కోసం ఆసియాన్, భారత్ కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత, నియమాల ప్రాతిపదికన కార్యకలాపాలు సాగే ప్రాంతంగా ఇండో-పసిఫిక్ నిలవాలన్నది భారత్ ధ్యేయమన్నారు. పోటీపై కాకుండా, పరస్పర సహకారంపైనే ఈ ప్రాంత భవిత ఆధారపడి ఉందని పునరుద్ఘాటించారు.
ఆసియాన్‌ను కేంద్ర స్థానంలో నిలుపుతూ, దాని ఐక్యతకు భారత్ ఎల్లప్పుడూ బలంగా కట్టుబడి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్, ఆసియాన్ దేశాల ప్రజల ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చడంలో ‘ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2045’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. భారత్ - ఆసియాన్ దేశాల ఉమ్మడి విలువలు, ప్రాపంచిక దృక్పథంలో సారూప్యం, బలమైన సాంస్కృతిక సంబంధాలు ఈ భాగస్వామ్యంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ ‘యాక్ట్ ఈస్ట్’ విధానం భారత్ - ఆసియాన్ సంబంధాలకు నవోత్తేజాన్నిచ్చిందన్నారు.
ప్రపంచ భవితకు సాంకేతికత ఎంత కీలకమో వివరిస్తూ... భారత్, ఆసియాన్ దేశాలు కేవలం సాంకేతికత వినియోగదారులుగా మిగిలిపోవద్దనీ, సాంకేతికతను సృష్టించే స్థాయికి సమష్టిగా ఎదగాలనీ వ్యాఖ్యానించారు. మన ప్రజల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి కలిసికట్టుగా పనిచేయాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.
భారత్ - ఆసియాన్ సంబంధాలకు 2027 సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు పక్షాల మధ్య సంబంధాలకు ఆ ఏడాదితో 35 ఏళ్లు, అలాగే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి 5 ఏళ్లు పూర్తవుతున్నాయని తెలిపారు.
భారత్ - ఆసియాన్ సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి పలు ప్రతిపాదనలు చేశారు. వాటిలో కొన్ని:
● అనుసంధానాన్ని పెంపొందించడం, శాస్త్రీయ పరిశోధన, విపత్తు నిర్వహణ, తీర రక్షక దళాల మధ్య సహకారం, నౌకా వాణిజ్య రంగంలో అవగాహన, నావికుల భద్రతపై దీర్ఘకాలిక ఆసియాన్ - భారత్ నౌకా వాణిజ్య సహకార ప్రణాళిక,
● ఈ ప్రాంతంలోని దేశాల సామర్థ్యాభివృద్ధి కోసం ఉమ్మడి సైబర్ ఫోరెన్సిక్స్ శిక్షణ కార్యక్రమం,
● భారత్-ఆసియాన్ అణుశక్తి సాంకేతిక సహకార కార్యక్రమాలు,
● ఆసియాన్ - భారత్ అంతరిక్ష హ్యాకథాన్,
● గనులు, కీలక ఖనిజాల విషయంలో ఆసియాన్ - భారత్ సహకారం,
● యువజన సదస్సు, యువ పార్లమెంటేరియన్ల పర్యటనలు, స్టార్టప్ హ్యాకథాన్ల ద్వారా ఆసియాన్ – భారత్ యువత నడుమ అనుసంధానం,
● నలంద విశ్వవిద్యాలయంలో ఆసియాన్ దేశాలకు స్కాలర్షిప్లను మెరుగుపరచడం,
● వేవ్స్- 2027లో ఆసియాన్ - భారత్ సృజనాత్మక భాగస్వామ్య వేదిక,
● ఆసియాన్ దేశాల పర్యాటకులకు ఉచిత ఇ-వీసా.
సదస్సును నిర్వహించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆసియాన్ తదుపరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న సింగపూర్ ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
విపత్తు నిర్వహణలో సహకారంపై ఆసియాన్ - భారత్ ఉమ్మడి ప్రకటనను నాయకులు ఆమోదించారు [link]. ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసాన్ని ఇక్కడ చూడవచ్చు [link].
***