నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2026 12:39PM by PIB Hyderabad
భువనేశ్వర్లో ఈ రోజు నిర్వహించిన 17వ ఒడిశా శాసనసభ సభ్యుల ఓరియంటేషన్ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ప్రసంగించారు. సుసంపన్నమైన భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిలబెట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. విషయ పరిజ్ఞానంతో కూడిన నిర్మాణాత్మక చర్చలు, సమర్థమైన శాసనసభ, ప్రజలే కేంద్రంగా పరిపాలన... ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్పీకర్ శ్రీమతి సురమా పాధీని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలోనూ, సభ్యులు తమ రాజ్యాంగబద్ధ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలోనూ ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
ప్రాచీనమైన భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రస్తావిస్తూ... వైశాలి, చోళ యుగం నాటి కూడవోళై వ్యవస్థ వంటి సంస్థాగత ప్రజాస్వామిక యంత్రాగాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ఉదాహరించారు. దేశ నాగరికతా చరిత్రలో ప్రజాస్వామ్య విలువలు బలంగా వేళ్లూనుకుని ఉన్నాయన్నారు. ‘ప్రజాస్వామ్య తల్లి’గా మన్ననలు పొందుతూ భారత్ సార్థకత సాధించిందన్నారు. ఈ విశిష్ట వారసత్వాన్ని నిలబెట్టేలా నడుచుకోవాలని ఒడిశా శాసనసభ్యులకు ఆయన పిలుపునిచ్చారు.
ఎన్నికల విజయాలు అర్థవంతమైన ప్రజాసేవకు బాటలు వేయాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ‘‘ఓట్ల ద్వారా మనం ఎన్నికల్లో గెలుస్తాం. కానీ, సేవా దృక్పథంతో మాత్రమే ప్రజల గౌరవాన్ని పొందగలం’’ అన్నారు. శాసనసభ కేవలం ఒక చర్చావేదిక మాత్రమే కాదన్న ఆయన.. సభలో రూపుదిద్దిన ప్రతి విధానమూ, ఇక్కడ లేవనెత్తిన ప్రతి ప్రశ్నా, సభ అమలు చేసే ప్రతి చట్టమూ అసంఖ్యాక ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ – 2047’ సంకల్పాన్ని ప్రస్తావిస్తూ.. దేశ పురోగతిలో ఒడిశా అభివృద్ధి అత్యంత కీలకమైన అంశమన్నారు. ఒడిశా ప్రావిన్సుగా ఏర్పడి 2036తో వందేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో.. అభివృద్ధి చెందిన, సంపన్నమైన, సమ్మిళిత రాష్ట్రంగా ఒడిశాను నిలపడంలో ‘విజన్ ఒడిశా- 2036’ ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు. యువతకు అవకాశాలను కల్పించడంలోనూ, అభివృద్ధి ఫలితాలు ఊరూరికీ ఇంటింటికీ అందేలా చూడడంలోనూ శాసనసభ్యులు ముఖ్య పాత్ర పోషిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
శాసనపరమైన కార్యకలాపాలకు ఆటంకాలు కలిగించడం తగదని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రజలు, రాజ్యాంగం పట్ల మన నిబద్ధతకు అభిప్రాయ భేదాలు అడ్డుకాకూడదని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. “ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అంగీకరించవచ్చు. కానీ ప్రజలు, రాజ్యాంగం పట్ల మన అంకితభావం విషయంలో మనమంతా ఏకీభవించాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. “చర్చ, సంభాషణ, కొన్నిసార్లు ఆటంకాలు కూడా 'సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపకరించాలి” అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, దేశ పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి ఆరోగ్యకరమైన చర్చలు, నిర్మాణాత్మక సహకారం కోసం ఆయన పిలుపునిచ్చారు.
నిరంతర అభ్యసనం, సన్నద్ధత అత్యంత ప్రధానమైన అంశాలని పేర్కొంటూ.. శాసన సభ నియమాలు, విధానాలు, బడ్జెట్ ప్రక్రియలు, కమిటీ వ్యవస్థలు, పార్లమెంటరీ సంప్రదాయాలు, నైతిక విలువలను సభ్యులు క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి కోరారు.
ముఖ్యంగా సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలనూ, విధానపరమైన అంశాలనూ లేవనెత్తడానికి ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ కీలకమైన అవకాశాలని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. సభ్యులు సభాధ్యక్షుడికి సహకరిస్తూ అమిత ప్రాధాన్యం గల ఈ పార్లమెంటరీ సంప్రదాయాలకు ఏ అంతరాయమూ కలగకుండా చూడాలని కోరారు.
సభ నిర్వహణకు సంబంధించి ఏకాభిప్రాయాన్ని పెంపొందించడంలో సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కమిటీలో ఏకాభిప్రాయం ఉంటే శాసన ప్రక్రియలు మరింత సజావుగా, అత్యంత ఫలప్రదంగా సాగుతాయన్నారు.
శాసనసభ వ్యవహారాల నిర్వహణలో సాంకేతికత పాత్ర క్రమంగా పెరుగుతున్న తీరును ఉపరాష్ట్రపతి ప్రధానంగా ప్రస్తావించారు. జాతీయ ఇ-విధాన్ అప్లికేషన్ కింద ఒడిశా శాసనసభలో డిజిటల్ హౌస్ ప్రారంభోత్సవాన్ని స్వాగతించారు. రాజ్యసభలో డిజిటల్ వేదికల వినియోగం క్రమంగా పెరుగుతోందన్నారు. పార్లమెంటరీ పత్రాలు, ప్రశ్నలు, చర్చలు సాంకేతికత సాయంతో అనేక భాషల్లో నేడు అందుబాటులోకి వచ్చాయని ఆయన వివరించారు. కృత్రిమ మేధ, సహజ భాషా ప్రాసెసింగ్ సహా అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ.. శాసన సంస్థలను భవిష్యత్ సన్నద్ధంగా నిలపాలని సభ్యులను కోరారు.
సభ్యులపై ఉన్న అపారమైన బాధ్యతను, సమూల మార్పులను తీసుకురాగల వారి సామర్థ్యాన్ని శాసనసభ్యులకు గుర్తుచేస్తూ ఉపరాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఆలోచనాత్మకమైన చర్చలు విధానపరమైన మార్పులను తీసుకురాగలవనీ, కరుణతో కూడిన నిర్ణయం అసంఖ్యాక ప్రజల జీవితాల్లో తిరిగి ఆశను చిగురింపజేయగలదనీ ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ఫలప్రదంగా సాగాలనీ, వారి సభా ప్రయాణం అర్థవంతంగా ఉండాలనీ ఆకాంక్షిస్తూ.. 17వ ఒడిశా శాసనసభ సభ్యులందరికీ ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.
ఒడిశా గవర్నర్ శ్రీ బ్రజ్ మోహన్ రామ్, ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, శాసనసభ స్పీకర్ శ్రీమతి సురమా పాధీ, డిప్యూటీ స్పీకర్ శ్రీ భవానీ శంకర్ భోయ్, 17వ ఒడిశా శాసనసభ సభ్యులు, తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***