సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంగీతంలో ప్రావీణ్యం గల యువత కోసం జాతీయ స్థాయి వేదికను అందించడం లక్ష్యంగా


'ఎయిర్ రైజింగ్ స్టార్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆకాశవాణి

దేశవ్యాప్తంగా ఈ నెల 17 నుంచి 30 వరకు 26 సంగీత కచేరీల నిర్వహణ

ఆకాశవాణి 90 ఏళ్ల వేడుకల్లో భాగంగా... 30 ఏళ్లలోపు యువ సంగీత కళాకారులను ప్రోత్సహించడం లక్ష్యంగా 'ఎయిర్ రైజింగ్ స్టార్స్'

నాడు పోస్టు చేయడమైనది: 15 NOV 2026 8:56PM by PIB Hyderabad

యువ సంగీత ప్రతిభను ప్రోత్సహించడం... భారత సుసంపన్న, వైవిధ్యభరితమైన సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా... 30 ఏళ్లలోపు యువ కళాకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దేశవ్యాప్త సంగీత కచేరీల పరంపర "ఎయిర్ రైజింగ్ స్టార్స్" కార్యక్రమ తొలి సీజన్‌ను ఆకాశవాణి ప్రారంభిస్తోంది. ఈ కచేరీల మొదటి సీజన్‌ను ఈ నెల 17 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. యువ, వర్ధమాన సంగీత కళాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి, విస్తృత స్థాయి శ్రోతలకు చేరువ కావడానికి ఈ కచేరీలు ఒక ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి వేదికను అందిస్తాయి.

ఆకాశవాణి 90 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తరతరాలుగా సంగీత ప్రతిభను గుర్తించడం, ప్రోత్సహించడం, తీర్చిదిద్దడం పట్ల ఆకాశవాణి నిరంతర నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. తదుపరి తరం కళాకారులకు ప్రత్యేక గుర్తింపునివ్వడం ద్వారా ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం 'ఎయిర్ రైజింగ్ స్టార్స్' లక్ష్యం.

గుర్తింపు పొందిన, వర్ధమాన యువ కళాకారులపై ప్రత్యేక దృష్టి

ఈ సంగీత కచేరీల్లో ప్రధానంగా వివిధ సంగీత శైలులు, సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న... ఆకాశవాణి గుర్తింపు గల 30 ఏళ్లలోపు యువ కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. ఒకవేళ ఏదైనా ప్రత్యేక విభాగంలో తగిన గుర్తింపు గల యువ కళాకారులు అందుబాటులో లేని పక్షంలో... నిర్దేశించిన మార్గదర్శకాలు, సంబంధిత ఆకాశవాణి కేంద్రం ఎంపికకు లోబడి అర్హులైన అన్‌గ్రేడెడ్ యువ కళాకారులకూ అవకాశం కల్పించనున్నారు.

భాగస్వామ్య కేంద్రాలకు అనుగుణంగా... హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం (గాత్రం, వాద్యం), కర్ణాటక శాస్త్రీయ సంగీతం (గాత్రం, వాద్యం), లలిత, జానపద సంగీతం, పాశ్చాత్య సంగీతం, ఇతర ప్రాంతీయ సంగీత రూపాల ద్వారా భారత సంగీత వారసత్వ వైవిధ్యాన్ని ఈ కచేరీలు ప్రదర్శిస్తాయి.

దేశవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో వేడుకలు

26 భాగస్వామ్య ఆకాశవాణి కేంద్రాలైన సిమ్లా, డెహ్రాడూన్, ఢిల్లీ, లక్నో, వారణాసి, జైపూర్, జలంధర్, సూరత్‌గఢ్, హైదరాబాద్, విజయవాడ, ధార్వాడ్, బెంగళూరు, మైసూరు, మధురై, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, కోల్‌కతా, ఇంఫాల్, ముంబై, అహ్మదాబాద్, సాంగ్లీ, నాగ్‌పూర్, పుదుచ్చేరి, జమ్మూ, గౌహతి, రాంపూర్‌లలో ఈ సంగీత కచేరీలను నిర్వహిస్తున్నారు.

ప్రతి భాగస్వామ్య కేంద్రం... ఆయా ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన యువ కళాకారులతో తగిన వేదిక వద్ద ఒక సంగీత కచేరీని నిర్వహిస్తుంది. పాల్గొనే కళాకారులను ప్రోత్సహించడానికి, యువ సంగీత ప్రతిభకు ఒక దేశవ్యాప్త వేడుకగా ఈ కార్యక్రమాన్ని మార్చడానికి... ప్రముఖులు, సంగీత ప్రియులు, యువతకు ఆదర్శప్రాయులైన వ్యక్తులు, విద్యార్థులు, సాధారణ ప్రజలనూ ఆహ్వానిస్తున్నారు.

బహుళ-వేదికల ప్రసారం, డిజిటల్ విస్తరణ

'ఎయిర్ రైజింగ్ స్టార్స్: సీజన్-1' ప్రధాన ఆకర్షణ... దాని విస్తృతమైన బహుళ-వేదికల ప్రసారం, డిజిటల్ విస్తరణ. దీని ద్వారా యువ కళాకారుల ప్రదర్శనలు కేవలం కచేరీ వేదికలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న శ్రోతలకూ చేరువవుతాయి.

ఈ సంగీత కచేరీలను ఆకాశవాణి కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా ప్రసారం చేస్తారు. దూరదర్శన్, ఆకాశవాణికి చెందిన "రాగం" యూట్యూబ్ ఛానల్, 26 ఆకాశవాణి కేంద్రాల యూట్యూబ్ ఛానళ్లు, "న్యూస్ ఆన్ ఎయిర్" మొబైల్ యాప్, ప్రసార భారతికి చెందిన "వేవ్స్ ఓటీటీ" వేదిక ద్వారా కచేరీలను ప్రసారం చేయనున్నారు. ఈ సమగ్ర ప్రసార వ్యూహం పాల్గొనే కళాకారులకు రేడియో, టెలివిజన్, డిజిటల్ వేదికల ద్వారా విస్తృత గుర్తింపును అందిస్తుంది.

మూడు అత్యుత్తమ ప్రదర్శనలకు నగదు బహుమతులు

యువ కళాకారులను ప్రోత్సహించడం, విస్తృత డిజిటల్ భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా... 2027 జనవరి 15 నాటికి యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలు సాధించిన ముగ్గురు కళాకారులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందించనున్నారు.

మొదటి బహుమతి: రూ. 20,000

రెండో బహుమతి: రూ. 15,000

మూడో బహుమతి: రూ. 10,000

ఈ కార్యక్రమం యువ కళాకారులకు మరింత గుర్తింపును అందిస్తుంది. డిజిటల్ వేదికల ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా వారిని ప్రోత్సహిస్తుంది.

67 ఎడిషన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న 'ఆకాశవాణి సంగీత సమ్మేళన్' నిర్వహణలో ఆకాశవాణి సుదీర్ఘ సంప్రదాయాన్ని గమనించవచ్చు. ప్రఖ్యాత టాప్ గ్రేడ్, 'ఎ' గ్రేడ్ కళాకారులు తమ సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ఆకాశవాణి సంగీత సమ్మేళన్ ప్రతిష్ఠాత్మక వేదికను అందిస్తుంది. ఆకాశవాణి నిర్వహించే ఇటువంటి ప్రతిష్ఠాత్మక కచేరీ వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడానికి పరిమిత అవకాశాలు మాత్రమే అందుబాటులో ఉన్న గుర్తింపు గల యువ కళాకారులకు ప్రత్యేక వేదికను అందించే లక్ష్యంతో 'ఎయిర్ రైజింగ్ స్టార్స్' కార్యక్రమాన్ని రూపొందించారు.

ఎయిర్ రైజింగ్ స్టార్స్ ద్వారా భారత శాశ్వత సంగీత సంప్రదాయాలకు, యువతకు మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తూనే, తదుపరి తరం సంగీతకారుల కోసం విలక్షణ జాతీయ వేదికను రూపొందించడం ఆకాశవాణి లక్ష్యం. భారత సుసంపన్న సాంస్కృతిక, సంగీత వారసత్వాన్ని ప్రోత్సహించే సంస్థగా, వర్ధమాన సంగీత ప్రతిభను తీర్చిదిద్దే వేదికగా ఆకాశవాణి సుదీర్ఘ పాత్రను ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2336713) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Khasi , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam