నాడు పోస్టు చేయడమైనది:
11 NOV 2026 3:05PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని నార్త్ అండ్ సౌత్ బ్లాక్ కాంప్లెక్స్‌లో యుగే యుగీన్ భారత్ మ్యూజియం (వైవైబీఎం) అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ) మదింపు ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,230 కోట్లు.
పాయింట్ల వారీగా వివరాలు
-
భారతదేశ భౌతిక, అమూర్త సాంస్కృతిక వారసత్వాన్ని సమగ్రంగా ప్రతిబింబిస్తూ... దేశ నాగరికత వైభవాన్ని, వైవిధ్యాన్ని, గొప్పదనాన్ని చాటిచెప్పే చారిత్రక నాగరిక ప్రదర్శనశాలగా ‘యుగే యుగీన్ భారత్ మ్యూజియం’ను రూపొందిస్తున్నారు.
-
చారిత్రకమైన నార్త్ అండ్ సౌత్ బ్లాక్ కాంప్లెక్స్ నిర్మాణ శైలిని, వారసత్వ ప్రాధాన్యాన్ని పరిరక్షిస్తూనే... ఈ సముదాయాన్ని ప్రజా సాంస్కృతిక సంస్థగా తీర్చిదిద్దడానికి పునర్వినియోగ పద్ధతిలో ఈ మ్యూజియంను అభివృద్ధి చేస్తారు.
-
సుమారుగా 1,78,509 చ.మీ.ల ప్రతిపాదిత నిర్మాణ విస్తీర్ణంలో ఈ యుగే యుగీన్ భారత్ మ్యూజియంను ఏర్పాటు చేస్తారు. సమకాలీన మ్యూజియం పద్ధతులు, ఇమర్సివ్ టెక్నాలజీలు, సందర్శకులకు అవసరమైన వివరణలు దీనిలో ఉంటాయి. అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పొందిన మ్యూజియంలకు దీటుగా ఈ మ్యూజియం రూపుదిద్దుకోనుంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్రదర్శనా విస్తీర్ణం కలిగిన మ్యూజియంగా నిలవనుంది.
-
భారతదేశ వైవిధ్యమైన సాంస్కృతిక సంప్రదాయాలు, విజ్ఞాన వ్యవస్థలు, కళా పద్ధతులు, వారసత్వాన్ని ఇతివృత్తం ఆధారంగా రూపొందించిన గ్యాలరీలు, ఎగ్జిబిషన్లు, వివరణల ద్వారా దేశ నాగరిక ప్రయాణాన్ని ఈ మ్యూజియం ప్రదర్శిస్తుంది.
-
గ్యాలరీ అభివృద్ధి, సేకరించిన వస్తువులను భద్రపరిచే, పరిరక్షించే సౌకర్యాలు, సందర్శకులకు సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలు–ఇమర్సివ్ అనుభవాల ఏకీకరణ, ల్యాండ్‌స్కేపింగ్, ఇంటిలిజెంట్ బిల్డింగ్ సిస్టమ్స్, సంబంధిత మౌలిక వసతులు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.
-
మ్యూజియం రూపకల్పన, వారసత్వ పరిరక్షణ, ఎగ్జిబిషన్ డిజైన్, సుస్థిరమైన సాంస్కృతిక నిర్వహణకు అనుగుణంగా, భారతదేశ వైవిధ్యమైన సాంస్కృతిక నేపథ్యానికి తగినట్టుగా ఈ మ్యూజియంను అభివృద్ధి చేస్తారు.
నేపథ్యం
యుగే యుగీన్ భారత్ మ్యూజియంను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి 2023 మే 18న ప్రకటించారు.
ప్రభుత్వ కార్యాలయాలను తరలించిన అనంతరం... ప్రజా సాంస్కృతిక ప్రయోజనం కోసం నార్త్, సౌత్ బ్లాక్ భవనాలను పునర్వినియోగించుకొనే అవకాశం లభించింది. ఈ ప్రసిద్ధ భవనాల నిర్మాణ శైలిని, వారసత్వ ప్రాభవాన్ని పరిరక్షిస్తూనే వాటికి నూతన సంస్థాగత రూపాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
ఈ ప్రతిపాదనను 2026 జులై 27న పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ) మదింపు చేసింది. బోర్డు చేసిన సిఫార్సులను సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆమోదించింది.
అమలు వ్యూహం, లక్షణాలు
ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి ఆర్థిక సంవత్సరం 2030–31 నాటికి దశలవారీ విధానంలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. అలంకరణ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసే మొదటి గ్యాలరీని ప్రజల సందర్శనార్థం 2027 ద్వితీయార్థంలో నార్త్ బ్లాకులో ప్రారంభించాలని యోచిస్తున్నారు. మరిన్ని గ్యాలరీలను చేర్చడానికి వీలుగా మాడ్యులర్ విధానాన్ని రూపొందిస్తున్నారు. దీని కోసం సమాచారంతో పాటు సేకరించిన కళాఖండాల విశ్లేషణ జరుగుతోంది. వైవైబీఎంలో ప్రదర్శించడం కోసం జాతీయ మ్యూజియం, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని మ్యూజియంలు, 52 ఏఎస్ఐ నిర్వహణలోని మ్యూజియంలు, వివిధ రాష్ట్రాలకు చెందిన మ్యూజియంలు, ప్రైవేటు సేకరణల నుంచి సుమారుగా 1.8 మిలియన్ల వస్తువులను గుర్తించారు.
నిర్మాణ శైలి–నగర దృశ్యాలు, గణితం–ఖగోళశాస్త్రం, భాష–రాతప్రతులు, విశ్వాసం–ఆధ్యాత్మికత, భారత్ కనెక్ట్స్–వాణిజ్యం– ఆలోచనలు, తదితర ఇతివృత్తాలతో మిగిలిన గ్యాలరీలను తీర్చిదిద్దుతారు.
సమన్వయ ప్రాజెక్టు నిర్వహణ, రూపకల్పన, సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యతా హామీ, క్రమం తప్పని పర్యవేక్షణ ద్వారా దీనిని అమలు చేస్తారు.
ఉపాధి కల్పన సామర్థ్యంతో సహా ప్రధాన ప్రభావం
సాంస్కృతిక, విద్య, ఆర్థిక, ఉపాధికి సంబంధించి గణనీయమైన అవకాశాలను యుగే యుగీన్ భారత్ మ్యూజియం అందిస్తుందని అంచనా వేస్తున్నారు.
-
నాగరికత వారసత్వ పరిరక్షణ: భారతదేశ నాగరికతా పరిణామ క్రమం, పరంపర, వైవిధ్యాలను ప్రతిబింబించే సమగ్ర సంస్థాగత వేదికను ఇది అందిస్తుంది. అలాగే భౌతిక, అమూర్త వారసత్వ సంపద పరిరక్షణను, వాటికి విస్తృత ప్రచారాన్ని బలోపేతం చేస్తుంది.
-
వారసత్వ భవనాల పునర్వినియోగం: చరిత్రాత్మకమైన నార్త్, సౌత్ బ్లాక్ భవనాలకు విస్తృతమైన సాంస్కృతిక ప్రయోజనాన్ని అందిస్తూనే... వాటి నిర్మాణ శైలిని, వారసత్వ లక్షణాలను ఈ ప్రాజెక్టు పరిరక్షిస్తుంది.
-
సాంస్కృతిక పర్యాటకం, అంతర్జాతీయ భాగస్వామ్యం: దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించే ప్రధాన సాంస్కృతిక గమ్యస్థానంగా ఈ మ్యూజియం అభివృద్ధి చెందుతుందని, అంతర్జాతీయ సాంస్కృతిక ఉనికిని, కళాశక్తిని బలోపేతం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
-
విద్య, పరిశోధన: ప్రజల విజ్ఞానార్జనకు, విద్యా సంబంధిత పరిశోధనలకు, విజ్ఞాన వినిమయానికి, భారతదేశ బహుళ సాంస్కృతిక సంప్రదాయాలు, జ్ఞాన వ్యవస్థలతో అనుసంధానం కావడానికి మంచి అవకాశాలను కల్పిస్తుంది.
-
ఉపాధి కల్పన: నిర్మాణం, కార్యకలాపాల దశల్లో ఈ ప్రాజెక్టు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. చేతివృత్తుల వారు, కళాకారులు, పరిశోధకులు, మ్యూజియాలజిస్టులు, డిజైనర్లు, ప్రదర్శకులు, ఇతర సృజనాత్మక నిపుణులకు అవకాశాలను సృష్టిస్తుందని, ఆతిథ్య, పర్యాటక రంగాల్లో జీవనోపాధికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.
-
మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం: నిర్మాణాత్మకమైన అమ్మకందారు అభివృద్ధి కార్యకలాపాల ద్వారా అంతర్జాతీయ స్థాయి మ్యూజియం సామగ్రి, ఉత్పత్తుల తయారీని ఈ ప్రాజెక్టు ప్రోత్సహిస్తుంది. అలాగే భారతీయ కళాకారులు, తయారీదారులు, పరిరక్షణ నిపుణులు, సాంకేతిక ప్రదాతలకు అవకాశాలను కల్పిస్తుంది.
-
సందర్శకులకు అనుకూలమైన, సమ్మిళితమైన మౌలికవసతులు: ప్రజాభాగస్వామ్యాన్ని, మొత్తంగా మ్యూజియం సందర్శన అనుభవాన్ని సమకాలీన మ్యూజియం సాంకేతిక పరిజ్ఞానాలు, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన వసతులు పెంపొందిస్తాయి.
వ్యయ అంచనా
సంబంధిత సంస్థలు చేపట్టిన సాంకేతిక మదింపుతో పాటు సమగ్ర నిర్మాణ, ప్రదర్శన రూపకల్పన, ఇంజనీరింగ్, మ్యూజియం ప్రణాళిక అవసరాల ఆధారంగా ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రూ. 3,230 కోట్లుగా అంచనా వేశారు.
టిక్కెట్ అమ్మకాలు, ఆహారం, పానీయ సౌకర్యాలు, ప్రత్యేక కార్యక్రమాలు, వేదిక అద్దెలు, డిజిటల్ కార్యక్రమాలు, గైడెడ్ టూర్లు, రిటెయిల్ అవుట్‌లెట్లు, సందర్శకులకు అందించే ఇతర సౌకర్యాల ద్వారా మ్యూజియంకు నిరంతర ఆదాయం సమకూరుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఏడాదికి కోటి మంది సందర్శించేందుకు అనుగుణంగా మ్యూజియంను తీర్చిదిద్దుతున్నారు.
లబ్ధిదారుల సంఖ్య
సాధారణ ప్రజలు, విద్యార్థులు, పరిశోధకులు, పండితులు, సాంస్కృతిక రంగ ప్రతినిధులు, స్వదేశీ, విదేశీ పర్యాటకులతో పాటు ఇతర సందర్శకుల అవసరాలకు అనుగుణంగా... ఈ మ్యూజియాన్ని జాతీయ స్థాయి ప్రజా సాంస్కృతిక సంస్థగా తీర్చిదిద్దుతున్నారు.
ఒక ప్రజా సాంస్కృతిక, విద్యా సంస్థగా... అవగాహన, పరిశోధన, సాంస్కృతిక అనుసంధానంతో పాటు భారత నాగరికతా వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చక్కని అవకాశాలను కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టుకు నిర్దిష్ట లబ్ధిదారుల సంఖ్య అనే పరిమితి వర్తించదు.
ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు/జిల్లాలు
న్యూఢిల్లీలోని నార్త్, సౌత్ బ్లాక్ కాంప్లెక్స్ వద్ద మ్యూజియం ఏర్పాటవుతుంది. ఈ మ్యూజియం భౌతికంగా దేశ రాజధానిలో ఉన్నప్పటికీ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులకు సైతం సేవలు అందించేలా తీర్చిదిద్దుతారు.
***