నాడు పోస్టు చేయడమైనది:
04 NOV 2026 11:51AM by PIB Hyderabad
ఆరోగ్యాన్ని కాపాడుకోవడాన్ని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రధానంగా ఉండే ఆరోగ్యసంరక్షణను ధన్తేరస్ వేడుకలలో ఓ భాగం చేసుకోవలసిందిగా ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ పౌరులకు పిలుపునిచ్చారు. పండుగ ప్రాధాన్యాన్ని మంత్రి ప్రస్తావిస్తూ, కుటుంబాలు ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవాలని, వ్యాధుల నివారణకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అవగాహనతో కూడిన పెట్టుబడులు పెట్టాలన్నారు.
‘ధన్తేరస్’కు ధన్వంతరి జయంతితో అనుబంధం ఉంది. సముద్ర మథన కాలంలో అమృత కలశాన్ని చేత పట్టుకొని వచ్చిన భగవాన్ ధన్వంతరిని ఈ పర్వదినం గుర్తుచేస్తుంది. దేవతల వైద్యునిగా భగవాన్ ధన్వంతరిని ఆరాధిస్తారు. భారతదేశంలో సాంప్రాదాయిక జీవన విధానానికి, ఆరోగ్య విజ్ఞానశాస్త్రానికి పట్టుగొమ్మ అయిన ఆయుర్వేదంతో భగవాన్ ధన్వంతరికి సన్నిహిత అనుబంధం ఉంది. ఈ సందర్భం.. వ్యక్తిగత, కుటుంబ సభ్యుల సౌభాగ్యానికి పునాది రూపంలో స్వస్థతకు ఉన్న ప్రాధాన్యాన్ని సమీక్షించుకొనేందుకు కూడా ఓ అవకాశాన్ని ఇస్తుంది.
సమృద్ధికి ప్రతీకలైన వెండి, బంగారు, గృహోపకరణాలను ధన్తేరస్ నాడు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోందని, అయితే మనిషి మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే భౌతిక సంపదకు అసలు విలువ అని ఈ పండుగ రోజు గుర్తుచేస్తుందని శ్రీ జాదవ్ అన్నారు. కుటుంబాలు రాబోయే రోజులలో తమ సౌభాగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని చూసినట్లే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సమాన ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
వ్యాధుల నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణ దృక్పథాన్ని అనుసరించాలని మంత్రి చెప్పారు. ఎవరైనా అస్వస్థత పాలయిన తరువాతనే తరచుగా ఆరోగ్య సంరక్షణ తో ముడిపడిన చర్చలు మొదలవుతాయని ఆయన గుర్తుకు తెచ్చారు. స్వస్థ జీవనశైలిని అలవరుచుకొని రోగాలకు అడ్డుకట్ట వేయడంపై ధ్యాస పెట్టాలన్నారు. ‘‘స్వస్థస్య స్వాస్థ్య రక్షణమ్’’ అంటున్న ఆయుర్వేద సూత్రాన్ని మంత్రి ప్రస్తావిస్తూ, ఇది ఆరోగ్యవంతులైన వ్యక్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం గురించి వివరిస్తుందన్నారు. ఒకరి నుంచి మరొకరికి సోకని వ్యాధులు, ఒక చోటుకు అంటుకుపోయి ఉండే జీవన సరళులు, శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి కావడం వంటి అంతకంతకు పెరిగిపోతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఇలాంటి దృష్టికోణానికి సందర్భ శుద్ధి ఉందని మంత్రి అన్నారు.
సంతులిత పోషణ, క్రమం తప్పక శారీరక కార్యకలాపాలు, తగినంత నిద్ర, ఒత్తిడిని నివారించుకోవడం వంటి రోజువారీ అలవాట్లు సమగ్ర స్వస్థతను కాపాడుకోవడంలో కీలక పాత్రను పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఇంటి వంటను, పోషకాహారాన్ని భుజించడాన్ని ప్రోత్సహించాలని, జంక్ ఫూడ్‌కు తరచు మొగ్గు చూపకుండా ఉండాలని, రోజూ శారీరక కార్యకలాపాలను చేపడుతూ ఉండాలని, ముసలి వారైన కుటుంబ సభ్యుల పట్ల తగిన శద్ధాసక్తులతో నడుచుకోవాలని కుటుంబాలను ఆయన కోరారు. మానివేయకుండా యోగా
భ్యాసం సాగించాలని, సకాలంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా ముందు జాగ్రత్త చర్యలతో కూడిన ఆరోగ్య సంరక్షణలో కీలకమని వివరించారు.
వ్యాధుల నివారణ ప్రధానంగా ఉండే, చికిత్స పూర్వక ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రోత్సహించడంలో ఆయుష్ వ్యవస్థలు అందిస్తున్న తోడ్పాటును శ్రీ జాదవ్ వివరిస్తూ, ఆయుష్ ఆధారిత ఆరోగ్యసంరక్షణ సేవలను సమాజం చెంతకు చేర్చడానికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల వంటి కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయన్నారు. దేశ ఆరోగ్య సేవల సంబంధిత మౌలిక సదుపాయాలకు భారత సాంప్రదాయిక వైద్య వ్యవస్థలు బాధ్యతాయుత తోడ్పాటును అందించగలిగేలా శాస్త్రీయ పరిశోధన, నాణ్యతా ప్రమాణాలు, ఫలితాలపై ఆధారపడిన పద్దతులకు ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సివుందని కూడా ఆయన అన్నారు.
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఫిట్ ఇండియా’ దార్శనికతను మంత్రి ప్రస్తావిస్తూ, జీవనశైలి సంబంధిత వ్యాధులను నివారించుకోవడానికి గాను నిత్య జీవనశైలిలో కొద్దిపాటివే అయినప్పటికీ అర్థవంతమైన మార్పుచేర్పులను చేసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శరీర పటుత్వం ఒక్క వ్యక్తిగత అంశం మాత్రమే కాదని, అది ఆరోగ్యవంతమైన, సమృద్ధమైన సమాజానికి అనివార్య పునాది అని స్పష్టం చేశారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించే దిశగా దేశం పయనిస్తున్న క్రమంలో, ఆరోగ్యవంతులు, ఆరోగ్యసంరక్షణ పట్ల జాగరూకత కలిగిన పౌరులు దేశ ప్రగతి ప్రస్థానంలో కీలక పాత్రను పోషించగలుగుతారని మంత్రి అన్నారు.
ఈ ధన్తేరస్ రోజున వ్యాధినివారణ ప్రధాన ఆరోగ్యసంరక్షణ విధానాలను అనుసరించడానికి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కట్టుబడి ఉండాలని శ్రీ జాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కుటుంబంలో వయసు మళ్లిన వారు, మహిళలు, పిల్లల ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని, సకాలంలో వైద్య సలహాలను, సూచనలను పొందుతూ ఉండాలని, ఆరోగ్యప్రద జీవన విధానాన్ని ఉమ్మడి కుటుంబ బాధ్యతగా మలచుకోవాలని ఆయన అన్నారు.
ఈసారి ధన్తేరస్ రోజు, పౌరులు సాంప్రదాయిక సౌభాగ్య చిహ్నాల కన్నా ఆరోగ్యవంతమైన అలవాట్లను పెంపొందించుకోవాలని, తమ ప్రియతముల పట్ల శ్రద్ధ తీసుకోవాలని, కుటుంబ సభ్యుల భవితను దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్తలతో కూడిన ఆరోగ్య సంరక్షణకు పునాదులు వేసుకోవాలని మంత్రి అన్నారు. ‘‘ఆరోగ్యమే మహాభాగ్యమ’’న్న శాశ్వత సిద్ధాంతాన్ని ఆయన మరో సారి గుర్తు చేశారు.
***