హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా న్యూఢిల్లీలో ‘రన్ ఫర్ యూనిటీ’ని ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రీయ ఏక్తా దివాస్‌గా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి

చరిత్రను మార్చటమే కాక, భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని పునర్నిర్మించిన సర్దార్‌ సాబ్‌... దేశీయ సంస్థానాలను ఏకం చేసి, నేటి సమైక్య భారతాన్ని ఆవిష్కరించిన సర్దార్ పటేల్

భారతదేశ భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక సమైక్యతకు విజయవంతమైన ప్రయత్నాలు చేయటమే కాక దేశాన్ని ఐక్యతతో ఏకతాటిపై నిలిపిన సర్దార్ సాబ్

కేవలం 1,218 రోజుల్లోనే అఖండ భారతదేశాన్ని ఆవిష్కరించిన సర్దార్ సాబ్... ఎంతోమంది నాయకులు జీవితకాలంలో సాధించలేని విజయాలను సాధించిన సర్దార్ పటేల్

ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజం నుంచి విముక్తి పొంది, డ్రగ్స్ రహిత దేశంగా ముందుకు సాగుతున్న భారత్

2029 డిసెంబర్ 31 నాటికి దేశాన్ని పూర్తిగా డ్రగ్స్ రహితంగా మార్చటమే లక్ష్యం... డ్రగ్స్ రహిత భారతదేశమే వికసిత్ భారత్‌కు తొలి మెట్టు

డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే దేశ యువతకు, వారి భవిష్యత్తుకు ఉత్తమ బహుమానం

దేశంలోని భాషా, సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యమే మన అత్యుత్తమ బలం

సోమనాథ ఆలయ పునర్నిర్మాణం ద్వారా నాగరికత, జాతీయ పునరుజ్జీవనం... ఆలయ పునర్నిర్మాణ కలలుగన్న సర్దార్ సాబ్‌

సర్దార్ సాబ్ కృషికి తగిన గౌరవం ఇవ్వకుండా ఎన్నో ఏళ్ల పాటు ఆయన్ని విస్మరించేందుకు, మరిచేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షాలు... సూర్యరశ్మిని మేఘాలతో కప్పి పెట్టలేరని వ్యాఖ్య

యావత్ దేశానికి సర్దార్ సాబ్ అత్యున్నత వ్యక్తిత్వాన్ని చాటి చెప్పిన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'... గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో శంకుస్థాపన చేసిన మోదీజీ

'రాష్ట్రీయ ఏక్తా దివాస్' సందర్భంగా దేశ ప్రజలతో ఏక్తా ప్రతిజ్ఞ చేయించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా

దేశవ్యాప్తంగా పోలీసు బలగాల కవాతు వందనాన్ని స్వీకరించి, ప్రసంగించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 31 OCT 2026 2:09PM by PIB Hyderabad

ఇవాళ సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన 'రన్ ఫర్ యూనిటీ'ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి దేశ ప్రజలతో 'ఏక్తా ప్రతిజ్ఞ' చేయించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్‌జిత్ సింగ్ సంధు, కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రులు శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ బండి సంజయ్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ... దేశ ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని 'రాష్ట్రీయ ఏక్తా దివస్'గా నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు సర్దార్ సాహెబ్ 151వ జయంతి. ఆయన కేవలం భారత చరిత్రను మార్చటమే కాక, దేశ భౌగోళిక స్వరూపాన్ని తీర్చిదిద్దిన మహనీయులు అని అన్నారు. అనేక సంస్థానాలను, రాజ్యాధీనుల భూభాగాలను ఏకం చేసే కఠినమైన బృహత్కార్యాన్ని చేపట్టి, నేడు మనం చూస్తున్న సమైక్య భారతదేశ పటాన్ని సర్దార్ సాహెబ్ ఆవిష్కరించినట్లు వెల్లడించారు. భారత్‌కు భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక ఏకీకరణను సాధించటంలోనే కాక, దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చి సమైక్య శక్తిగా నిలపటంలో విజయవంతమైన కృషి చేశారని పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశం ముక్కలైపోతుందని ప్రపంచం జోస్యం చెప్పిందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కేవలం 1,218 రోజుల్లోనే అసాధ్యమని భావించిన దాన్ని సుసాధ్యం చేసి, ఐక్య భారతదేశాన్ని సర్దార్ పటేల్ ఆవిష్కరించారని తెలిపారు. నేడు సర్దార్ పటేల్ కలలుగన్న భారత్... ప్రపంచం ఎదుట గర్వంగా నిలబడిందని తెలిపారు.

ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందిందని, ఇప్పుడు డ్రగ్స్ రహిత దేశంగా ముందుకు సాగుతోందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత 'వికసిత్ భారత్' సాధనలో డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం కీలక ముందడుగని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయాంలో కాశ్మీర్‌ను శాశ్వతంగా భారత్‌లో విలీనం చేసే ఆర్టికల్ 370 రద్దు, నక్సలిజం నిర్మూలన, సమగ్ర పన్ను విధానం అమలు వంటి ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలను సాధించామని వెల్లడించారు. దేశ యువతకు, భవిష్యత్తుకు ఎంతో మేలు చేసే డ్రగ్స్ రహిత భారత్ ఆవిష్కరణే అన్నింటికంటే గొప్ప విజయమని శ్రీ అమిత్ షా అన్నారు.

దేశ భాషా, సాంస్కృతిక, సంప్రదాయ వైవిధ్యం బలహీనత కాదని... అదే మన బలమని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. సర్దార్ పటేల్ సందేశం ఇదేనని, మనం అనుసరించాల్సిన మార్గం కూడా ఇదేనని పేర్కొన్నారు. మన భాషా, సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యమే మన శక్తి అని తెలిపారు. చర్చలు, పరస్పర విశ్వాసం, సమ్మిళిత దృక్పథం ద్వారా 80 ఏళ్లలో మనం ఉమ్మడి జాతీయ గుర్తింపును సాధించుకున్నామని చెప్పారు. మన భాషలు, వస్త్రధారణ, సాంస్కృతిక విశ్వాసాలు, మతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, దేశం ఎప్పుడూ ఐక్యంగానే నిలిచిందని అన్నారు.

సోమనాథ ఆలయ పునర్నిర్మాణం... నాగరికతా, జాతీయ పునరుజ్జీవన అనుభవమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. సోమనాథ ఆలయ నిర్మాణం గురించి సర్దార్ పటేల్‌ కలలుగన్నారని గుర్తు చేశారు. నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.

సర్దార్ సాహెబ్ దేశానికి చేసిన సేవలకు, ఆయన చేసిన కృషికి ఎన్నో ఏళ్లపాటు తగిన గుర్తింపు లభించలేదని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ సర్దార్ సాహెబ్ జ్ఞాపకాలను చెరిపేసేందుకు ప్రయత్నించాయని చెప్పారు. సూర్యకాంతిని ఎలాగైతే దాచలేమో, ఆయన వారసత్వాన్ని కూడా అణచివేయలేమని తెలిపారు. శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' అత్యున్నత స్మారకాన్ని నిర్మించారని, సర్దార్ సాహెబ్ గొప్ప వ్యక్తిత్వాన్ని యావత్ దేశానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. జాతీయ ఐక్యతా సందేశాన్నిస్తూ... అక్కడి నుంచి నేడు దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాల పరేడ్ గౌరవ వందనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీకరిస్తారని శ్రీ అమిత్ షా తెలిపారు.

****


(రిలీజ్ ఐడి: 2331360) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , Khasi , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam