నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 6:41PM by PIB Hyderabad
|
·సదస్సులో 130కి పైగా దేశాలు పాల్గొనే అవకాశం... ప్రపంచ నేతలు, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తీసుకురానున్న సదస్సు
సదస్సులో భాగస్వామ్య దేశాలుగా ఆస్ట్రేలియా, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, బ్రిటన్
పునరుత్పాదక ఇంధన రంగంలో తమ సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలు, తయారీ రంగపు బలాలను సదస్సులో ప్రదర్శించనున్న ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
పునరుత్పాదక ఇంధన సాంకేతికతలను ప్రదర్శించనున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు.. ప్రధాన ఆకర్షణలుగా జాతీయ హ్యాకథాన్, పునరుత్పాదక ఇంధన క్విజ్, రీజెన్ పెవిలియన్
|
భారత ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026 నవంబర్ 2 నుంచి 5 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు, ప్రదర్శన (బీఆర్ఈఎస్ఈ) - 2026 నిర్వహించనున్నారు. నవంబర్ 2న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు.
భారత ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంతోష్ సారంగి ఈ రోజు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “భారత్ స్వచ్ఛ ఇంధన మార్పు దిశగా కీలక దశలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం శిలాజేతర ఇంధన వనరుల నుంచి 308 గిగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో, 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా దృఢంగా ముందుకు సాగుతున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే 2027 నుంచి 2030 మధ్య సుమారు 220 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు అవసరం. దీనితోపాటు ఇంధన నిల్వ వ్యవస్థల విస్తరణను వేగవంతం చేయడం, విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడం కూడా అవసరం. భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు, ప్రదర్శన -2026 ప్రపంచ పెట్టుబడులు, సాంకేతికత, పారిశ్రామిక నైపుణ్యాలను భారత్‌లో పెరుగుతున్న స్వచ్ఛ ఇంధన అవకాశాలతో అనుసంధానించేందుకు కీలక వేదికగా నిలుస్తుంది. తద్వారా పెట్టుబడుల అవకాశాలను ప్రాజెక్టులు, భాగస్వామ్యాలు, ప్రగతిగా మలచేందుకు దోహదపడుతుంది” అని పేర్కొన్నారు.
‘పెట్టుబడి పెట్టండి.. ఆవిష్కరించండి.. స్ఫూర్తినివ్వండి’ అనే ఇతివృత్తంతో నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 130కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. మంత్రులు, విధాన రూపకర్తలు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు, తయారీదారులు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, బహుళపక్ష సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) అసెంబ్లీ 9వ సమావేశం, నాలుగో అంతర్జాతీయ హరిత హైడ్రోజన్ సదస్సు (ఐసీజీహెచ్)తో పాటు ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈ మూడు కార్యక్రమాలు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధన వినియోగ విస్తరణపై చర్చించేందుకు ఉమ్మడి వేదికగా నిలవనున్నాయి.
ఆస్ట్రేలియా, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, బ్రిటన్ ఈ సదస్సులో భాగస్వామ్యు దేశాలుగా పాల్గొంటాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడుల సమీకరణ, హరిత హైడ్రోజన్, ఇంధన నిల్వ, స్వచ్ఛ ఇంధన తయారీ, సాంకేతిక అభివృద్ధి వంటి రంగాల్లో పరస్పర సహకార అవకాశాలను అన్వేషించేందుకు పలు ఇతర దేశాల ప్రతినిధి బృందాలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నాయి.
భారత్‌లోని 13 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా ఈ సదస్సులో పాల్గొని, పునరుత్పాదక ఇంధన రంగంలో తమ సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలు, విధానపరమైన కార్యక్రమాలు, తయారీ రంగ బలాలను ప్రదర్శించనున్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ వేదికపై వివరించనున్నాయి.
పునరుత్పాదక ఇంధనం, సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలోనూ, పవన విద్యుత్ సామర్థ్యంలో నాలుగో స్థానంలోనూ ఉంది. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతోంది. బ్లూమ్బర్గ్ఎన్ఈఎఫ్ గణాంకాల ప్రకారం 2024 జూలై నుంచి 2026 జూన్ వరకు భారత పునరుత్పాదక ఇంధన రంగంలో 63.7 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడులను సమీకరించడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, గ్లోబల్ సౌత్ దేశాల్లో పునరుత్పాదక ఇంధన వినియోగ విస్తరణకు ఈ సదస్సు ప్రాధాన్యమివ్వనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఉన్నతస్థాయి ప్లీనరీ సమావేశాలు, మంత్రుల చర్చలు, సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశాలు, దేశాలు, రాష్ట్రాల ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. వీటిలో పెట్టుబడుల సమీకరణ, విధానాలు, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, తయారీ, ఇంధన నిల్వ, నైపుణ్య మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాలు చర్చల్లో చోటుచేసుకోనున్నాయి. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, విస్తృత స్థాయిలో అమలు చేయగల పరిష్కారాల రూపకల్పనతో పాటు, ప్రపంచ ఇంధన మార్పులో మహిళల భాగస్వామ్యాన్ని, నాయకత్వ పాత్రను మరింత పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఇదే వేదికపై నిర్వహించనున్న అంతర్జాతీయ సౌర కూటమి ( 9వ అసెంబ్లీ, గ్లోబల్ సౌత్ దేశాలకు విజయవంతమైన విధానాలు, సాంకేతికతలు, అమలు నమూనాలను విస్తరించడం ద్వారా సౌర ఇంధన రంగంలో భారత ప్రపంచ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఐఎస్ఏ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన ఈ అసెంబ్లీలో సభ్యత్వం పొందిన, ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల మంత్రులు, ప్రతినిధులు పాల్గొంటారు. సౌర ఇంధన విస్తరణ, ఆర్థిక వనరుల సమీకరణ, సామర్థ్య పెంపు వంటి అంశాల్లో ప్రాధాన్యాలను నిర్ణయించి, ఉమ్మడి కార్యాచరణకు ఈ సమావేశం మార్గనిర్దేశం చేయనుంది. పీఎం - కుసుమ్, పీఎం సూర్య ఘర్ వంటి కీలక కార్యక్రమాల ద్వారా భారత్ సాధించిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, వివిధ దేశాలు నిరూపిత పరిష్కారాలను తమ అవసరాలకు అనుగుణంగా స్వీకరించి, విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు అంతర్జాతీయ సౌర కూటమి సహకరిస్తోంది. దేశాల నేతృత్వంలోని కార్యక్రమాలు, పెట్టుబడుల సమీకరణ, సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తంగా ఆచరణాత్మక ప్రయోజనాలుగా మారేందుకు తోడ్పడుతోంది.
ఈ సదస్సుతో పాటు నిర్వహించే ప్రదర్శనలో భారత్‌తో పాటు విదేశాలకు చెందిన 400కు పైగా ప్రముఖ తయారీ సంస్థలు, ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థలు, సాంకేతిక పరిజ్ఞాన సేవల సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, పరిశోధనా సంస్థలు పాల్గొంటాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, పరిష్కారాలను ఇందులో ప్రదర్శిస్తారు. వ్యాపార సంబంధాల అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణకు సహకారం, సాంకేతిక భాగస్వామ్యాల ఏర్పాటుకు ఈ ప్రదర్శన అవకాశాలను కల్పించనుంది.
సదస్సులో భాగంగా భారత్ పునరుత్పాదక ఇంధన హ్యాకథాన్ - 2026 విజేతలను గుర్తించి, పురస్కారాలు అందచేస్తారు. సదస్సుకు ముందస్తు కార్యక్రమంగా నిర్వహించిన ఈ హ్యాకథాన్‌లో విద్యార్థులు, అంకుర సంస్థలు, పరిశోధకులు, ఆవిష్కర్తలు పాల్గొన్నారు. ప్రారంభ దశ, వృద్ధి దశ అనే రెండు విభాగాల్లో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన పది వాస్తవిక సవాళ్లకు పరిష్కారాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ రౌండ్ల ద్వారా నిర్వహించిన 'ఆర్ఈ నేషనల్ రినోవబుల్ ఎనర్జీ క్విజ్ 2026' పోటీలు భారత్ మండపంలో జరగనున్న గ్రాండ్ ఫినాలేతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న 'ఆర్ఈజెన్ పెవిలియన్' విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు తమ నూతన ఆలోచనలను ప్రదర్శించడానికి, పరిశ్రమ రంగానికి చెందిన ప్రముఖులతో నేరుగా సంభాషించడానికి ఒక ప్రత్యేక వేదికను అందించనుంది.
ఈ సదస్సులో బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. పెట్టుబడిదారులు, తయారీదారులు, సాంకేతిక సేవలందించేవారు, ప్రభుత్వ ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలు, ప్రాజెక్టుల అభివృద్ధిపై చర్చించేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయి.
మరిన్ని వివరాలకు www.bresummit.in వెబ్‌సైట్‌ను సందర్శించండి:


***