నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 3:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా భారత సైన్యంతో కలిసి తొలిసారిగా సంయుక్త శిక్షణ కార్యక్రమం ద్వారా దేశంలో పటిష్ఠమైన పౌర రక్షణ వ్యవస్థను భారత్ ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పౌర రక్షణ మాస్టర్ ట్రైనర్లకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు.
ఎర్రకోట నుంచి 2026 ఆగస్టు 15న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. మారుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆధునిక వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, సమకాలీన సన్నద్ధత సామర్థ్యాలతో కూడిన పటిష్ఠమైన పౌర రక్షణ వ్యవస్థను నిర్మించాలనే దార్శనికతను ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్ఎస్‌సీడీహెచ్‌జీ), భారత సైన్యంతో సమన్వయం చేసుకుంటూ తొలిసారిగా ఒక ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా భారత సైన్యం ద్వారా పౌర రక్షణ మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ అందించి, పౌర రక్షణ వ్యవస్థ సన్నద్ధతను బలోపేతం చేయనున్నారు.
మొదటి దశలో భాగంగా 600 మంది పౌర రక్షణ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందులో పాల్గొనే ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి 50 మంది చొప్పున ఎంపిక చేస్తారు. నవంబర్ 2026 రెండో వారం నాటికి భారత సైన్యానికి చెందిన నిర్దేశిత శిక్షణ కేంద్రాల్లో మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ద్వారా వీరికి శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు: జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, మేఘాలయ, సిక్కిం, అస్సాం, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు.
ప్రస్తుత భద్రతా ముప్పులు, ప్రతికూల పరిస్థితులు, అత్యవసర సందర్భాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా పౌర రక్షణ సిబ్బంది సన్నద్ధతను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ శిక్షణ ప్రధానంగా మూడు అంశాలపై ఉంటుంది.
1. ముప్పులపై అవగాహన: ఆధునిక, హైబ్రిడ్ యుద్ధ విమానాలు, డ్రోన్ల అవగాహన, వైమానిక దాడుల ముప్పుల గురించి శిక్షణ.
2. రక్షణ, అత్యవసర స్పందన: కీలక మౌలిక సదుపాయాల రక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ, రసాయన, జీవ, రేడియోలాజికల్, అణు (సీఎన్ఆర్ఎన్) ముప్పులపై అవగాహన, క్షతగాత్రుల నిర్వహణ, గాలింపు, రక్షణ చర్యలపై శిక్షణ.
3. కమ్యూనికేషన్, సమన్వయం: అత్యవసర సమాచార వ్యవస్థలు, సైబర్ భద్రతకు సంబంధించిన ప్రాథమిక జాగ్రత్తలు, డిజిటల్ వ్యవస్థల స్థిరత్వం, పౌర-సైనిక సమన్వయం, ఘటనల నిర్వహణపై శిక్షణ
క్రమబద్ధమైన మాస్టర్ ట్రైనర్ విధానం ద్వారా శిక్షణను విస్తృత స్థాయికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రత్యేక శిక్షణ అనంతరం ప్రతి మాస్టర్ ట్రైనర్ తమ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో మరో 100 మంది పౌర రక్షణ వాలంటీర్లకు శిక్షణ అందిస్తారు. ఈ విధానం ద్వారా దశలవారీగా శిక్షణను విస్తరించడం ద్వారా పాల్గొనే 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 60,000 మంది పౌర రక్షణ వాలంటీర్లకు ప్రత్యేక సన్నద్ధత నైపుణ్యాలను అందించే అవకాశం ఉంది. తద్వారా ఈ కార్యక్రమ పరిధి, ప్రభావం గణనీయంగా విస్తరించనుంది.
భారత సైన్యం కార్యాచరణ అనుభవాన్ని, పౌర రక్షణ స్వచ్ఛంద సేవకుల వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా పౌర-సైనిక సమన్వయాన్ని, సంస్థాగత సన్నద్ధతను బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం కీలక ముందడుగుగా నిలుస్తుంది. కొత్తగా తెలెత్తే ప్రమాదాలను ఎదుర్కోవడం, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో స్పందించడం, కీలక మౌలిక సదుపాయాలను పరిరక్షించడం వంటి అంశాల్లో సన్నద్ధతను పెంపొందిస్తుంది. ప్రయోగాత్మక దశలో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా దశలవారీగా విస్తరించాలని భావిస్తున్నారు. తద్వారా పటిష్ఠమైన, తక్షణమే స్పందించగల, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే పౌర రక్షణ వ్యవస్థను నిర్మించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు.
***