హోం మంత్రిత్వ శాఖ
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జాతీయ పోలీసు స్మారకం వద్ద నివాళి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
·
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు
సిబ్బందికి నివాళులర్పించి, కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీ అమిత్ షా
·
‘మాదకద్రవ్యాలపై పోరాటం’ సందేశంతో దేశవ్యాప్త మోటార్‌సైకిల్ ర్యాలీని
ప్రారంభించిన అమిత్ షా
·
ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానంలో మన దేశం... ఈ ఘనతకు పునాది మన వీర
సైనికుల త్యాగం, అంకితభావమే.
·
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందించిన 'నషా ముక్త్ భారత్'
(మాదకద్రవ్య రహిత భారత్) ఆచరణాత్మక ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు
చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలన్నీ పూర్తి స్థాయిలో కృషి చేయాలి
·
మాదకద్రవ్యాల దుర్వినియోగంపై సమష్టిగా పోరాడి, 2029 డిసెంబర్ 31 నాటికి దేశాన్ని మాదకద్రవ్యరహితంగా మారుద్దాం
·
2026
సంవత్సరం భారత పోలీసు వ్యవస్థకు అత్యంత కీలకం – 2026 మార్చి 31న మనం నక్సలిజం నుంచి విముక్తి సాధించాం.
·
దేశవ్యాప్తంగా ప్రజలందరికీ గౌరవప్రదమైన, స్ఫూర్తిదాయకమైన
పుణ్యస్థలంగా మారిన పోలీసు అమర వీరుల స్మారక స్థలం
·
అంతర్గత భద్రతకు పోలీసు సిబ్బందే తొలి, తుది రక్షణ శ్రేణి
·
ఎన్నికలు,
పండుగలు, సరిహద్దు భద్రత.. ఏ సందర్భమైనా
కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) సిబ్బంది ప్రతి రంగంలోనూ సేవలు అందించేందుకు
నిరంతరం అప్రమత్తం
·
దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలోనైనా, ప్రజాస్వామ్య ప్రక్రియలు
సజావుగా సాగేటట్లు చూడటంలోనైనా కేంద్ర సాయుధ పోలీసు బలగాల సహకారం లేకుండా ఈ
రెండింటినీ సాధించగలమని ఊహించలేం
·
ప్రభుత్వ సేవలన్నింటిలో పోలీసు శాఖలో విధులు అత్యంత సవాళ్లతో
కూడుకున్నవి. పండుగల సమయంలోనూ పోలీసు సిబ్బందికి సెలవులు ఉండవు. అప్పుడు కూడా వారు
విధుల్లోనే ఉంటూ, తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తారు.
·
కేంద్ర సాయుధ పోలీసు బలగాల కృషి వల్లే ఇటీవల పశ్చిమ బెంగాల్లో
జరిగిన ఎన్నికలు ఒక్క మరణం కూడా సంభవించకుండా ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల హింస
నుంచి దేశానికి విముక్తి
· మూడు ప్రధాన ప్రాంతాలు - కాశ్మీర్, ఈశాన్య భారతం, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు - దశాబ్దాలుగా దేశ అంతర్గత భద్రతకు సవాళ్లుగా నిలిచాయి. నేడు ఈ మూడు ప్రాంతాల్లోనూ శాంతి వెల్లివిరుస్తోంది. అభివృద్ధి దిశగా అవి
నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 1:41PM by PIB Hyderabad
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘మాదకద్రవ్యాలపై పోరాటం’ అనే సందేశంతో చేపట్టిన దేశవ్యాప్త మోటార్‌సైకిల్ ర్యాలీని కూడా హోం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి, శ్రీ రాజీవ్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ మహేష్ దీక్షిత్, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ శ్రీ శత్రుజీత్ కపూర్ ఇతర కేంద్ర సాయుధ పోలీసు బలగాల డైరెక్టర్ జనరళ్లు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందికి నివాళులర్పించేందుకు జాతీయ పోలీసు స్మారక స్థలం వద్ద తామంతా సమావేశమైనట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు గడిచిన అనంతరం నేడు భారత్ ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘనతకు పునాది మన వీర సిబ్బంది చేసిన త్యాగాలేనని స్పష్టం చేశారు. దేశ అంతర్గత భద్రతను కాపాడటంతో పాటు సరిహద్దుల రక్షణ కోసం ఆ సిబ్బంది తమ ప్రాణాలను అత్యున్నతంగా త్యాగం చేయకపోయి ఉంటే, నేడు మన దేశం ఏ స్థితిలో ఉండేదో ఎవరూ ఊహించలేరని కేంద్ర మంత్రి అన్నారు.
2026 సంవత్సరం భారత పోలీసు వ్యవస్థకు అత్యంత కీలకమైనదని, దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న నక్సలిజం నుంచి 2026 మార్చి 31న భారత్ విముక్తి సాధించిందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. 1981 నుంచి 2026 మార్చి వరకు నక్సలిజం కారణంగా దేశం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొందని తెలిపారు. ఈ కాలంలో ఎంతోమంది ధైర్యవంతులైన భద్రతా సిబ్బంది, అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఐదు
దశాబ్దాల నాటి సమస్యను అధిగమించి దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న తరుణంలో,
ఆ పురోగతికి 3,600 మంది సిబ్బంది చేసిన త్యాగాలే మూలస్తంభాలని హోం మంత్రి స్పష్టం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాణ త్యాగం చేసిన వీరుల లోటును ఏనాటికీ భర్తీ చేయలేమని, అయినప్పటికీ వారి కుటుంబాలు కనబరిచిన నిబద్ధతకు, చేసిన త్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని హోం మంత్రి తెలిపారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ చరిత్రను గుర్తుచేస్తూ, 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని మారుమూల, అత్యంత క్లిష్టమైన హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిని ధైర్యంగా ప్రతిఘటిస్తూ 10 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణత్యాగం చేశారని శ్రీ అమిత్ షా తెలిపారు. హాట్ స్ప్రింగ్స్ ఘటనను పరిశీలిస్తే, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో యుద్ధం జరిగినప్పుడు దాని ఫలితం దాదాపు ముందే నిర్ణయమై ఉంటుందని స్పష్టమవుతుందని అన్నారు. అయినప్పటికీ, దేశ భూభాగంలో ఒక్క అంగుళం నేల కూడా విదేశీయుల చేతుల్లోకి వెళ్లకూడదన్న దృఢ సంకల్పంతో ఆ అమర వీరులు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అత్యున్నతంగా త్యాగం చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బంది గౌరవార్థం న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018లో ప్రారంభించారని అమిత్ షా గుర్తుచేశారు. పోలీసు సిబ్బంది తమ బాధ్యతల పట్ల అంకితభావంతో వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండేలా భావితరాలకు స్ఫూర్తినివ్వడమే ఈ స్మారకం ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ పోలీసు స్మారక స్థూపం దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు ఒక పవిత్ర నివాళి కేంద్రంగా మారిందని ఆయన తెలిపారు. విధుల నిర్వహణలో ప్రాణాలర్పించిన 36,852 మంది పోలీసు సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించేందుకు, వారి అమూల్యమైన సేవలకు, త్యాగానికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ప్రాంతాన్ని దర్శిస్తున్నారని పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల సేవలతో పోలిస్తే పోలీసు శాఖలో
విధులు అత్యంత సవాళ్లతో కూడుకున్నవని శ్రీ అమిత్ షా అన్నారు. దేశంలోని ప్రతి
పౌరుడు రక్షాబంధన్, హోలీ, దీపావళి, ఈద్ వంటి పండుగలను ఆనందంగా జరుపుకుంటారని, అయితే పోలీసు సిబ్బందికి మాత్రం ఈ పండుగలను జరుపుకునేందుకు తరచూ సెలవులు కూడా ఉండవని పేర్కొన్నారు. ప్రజలు తమ కుటుంబాలతో కలిసి పండుగలను ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో పోలీసు సిబ్బంది అంతర్గత భద్రతను కాపాడటం, ట్రాఫిక్‌ను నియంత్రించడం, ప్రజల ప్రాణాలకు, భద్రతకు రక్షణ కల్పించడం వంటి విధుల్లో నిమగ్నమై ఉంటారని తెలిపారు. జీవితంలో అత్యంత విలువైన యువ ప్రాయాన్ని కుటుంబానికి దూరంగా ఉంటూ దేశ సేవకు అంకితం చేయడం గొప్ప సేవ అని హోం మంత్రి అన్నారు.
దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బంది అసాధారణ సహనం, సంయమనం, క్రమశిక్షణ, ధైర్యసాహసాలు, అంకితభావంతో వ్యవహరిస్తూ దేశ అంతర్గత భద్రతను మరింత పటిష్ఠం చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని శ్రీ అమిత్ షా అన్నారు. అంతర్గత భద్రతకు పోలీసు సిబ్బందే మొదటి, చివరి రక్షణ కవచమని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ, దేశ అంతర్భాగంలో భద్రతా బాధ్యతలు చేపడుతున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ, ఎన్నికలు, పండుగలు, నిరసనలు, సరిహద్దుల భద్రత వంటి ప్రతి సందర్భంలోనూ ఈ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేస్తున్నారని అన్నారు. దేశ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వారు నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలోనైనా, ప్రజాస్వామ్య ప్రక్రియలు సజావుగా సాగేందుకు భరోసా కల్పించడంలోనైనా కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవలు లేకుండా ఈ లక్ష్యాలను సాధించడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికల హింసను అరికట్టడంలో భారత్ విజయం సాధించిందని, అయితే పశ్చిమ బెంగాల్లో చాలా కాలంగా ఎన్నికల హింస కొనసాగుతూ వచ్చిందని శ్రీ అమిత్ షా అన్నారు. ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మరణం కూడా సంభవించకుండా ఎన్నికలు పూర్తయ్యేలా భద్రతా సిబ్బంది కృషి చేయడం గణనీయమైన విజయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పాయని తెలిపారు. దేశంలో ఎన్నికల హింసకు ముగింపు పలికిన విషయాన్ని ఇప్పుడు యావత్ దేశం గుర్తిస్తోందని ఆయన అన్నారు.
గత కొన్నేళ్లుగా దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందని, వాటిలో మూడు సమస్యలు దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చాయని శ్రీ అమిత్ షా అన్నారు. మూడు ప్రధాన సమస్యాత్మక ప్రాంతాలైన కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు శాంతి నెలకొందని, ఈ ప్రాంతాల్లో అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, దేశంలోని ఇతర ప్రాంతాలతో అభివృద్ధిలో పోటీపడేందుకు అవి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో గణనీయమైన విజయం సాధించామని శ్రీ షా అన్నారు. పలు ఒప్పందాలు కుదరడం, వేలాది మంది ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవడంతో ఈశాన్య భారతం మొత్తం శాంతి మార్గంలో ముందుకు సాగిందని తెలిపారు.అనేక రాష్ట్రాలకు విస్తరించిన, ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న నక్సలిజం సమస్యను పూర్తిగా నిర్మూలించే దిశగా పోలీసు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది కీలక విజయం సాధించారని అన్నారు. నక్సలిజం నిర్మూలనలో విశేషంగా కృషి చేసిన సీఆర్పీఎఫ్, దాని కోబ్రా బెటాలియన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ పోలీసుల ధైర్యసాహసాలను కూడా ప్రశంసించారు.
దేశం ఇంకా అన్ని సమస్యల నుంచి పూర్తిగా
విముక్తి పొందలేదని, అనేక సవాళ్లు మిగిలే ఉన్నాయని శ్రీ అమిత్ షా అన్నారు. మాదకద్రవ్యాల
మహమ్మారిపై సమష్టిగా పోరాడి, 2029 డిసెంబర్ 31 నాటికి దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలని కేంద్ర హోం మంత్రిత్వ
శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు. 2026లో మిగిలిన
కాలంతో పాటు రాబోయే మూడేళ్లు - 2027, 2028, 2029లో ఈ పోరాటాన్ని
మరింత ఉధృతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇది దేశానికి అత్యంత కీలకమైన లక్ష్యమని
స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా
భావితరాల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థపై
అనవసర భారం మోపుతాయని, దేశ వ్యతిరేక ఉద్దేశాలు కలిగిన సంస్థలకు
తరచుగా ఆర్థిక సహకారం అందిస్తాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాయకత్వంలో రూపొందించిన ‘నషా ముక్త్ భారత్’ (మాదకద్రవ్య రహిత భారత్) కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు దేశవ్యాప్తంగా
అన్ని పోలీసు బలగాలు సంపూర్ణ అంకితభావంతో ముందుకు రావాలని హోం మంత్రి పిలుపునిచ్చారు. భావితరాల భవిష్యత్తును కాపాడేందుకు ఈ పోరాటంలో
చురుగ్గా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
నేడు కేంద్ర హోం మంత్రి ప్రారంభించిన
మోటార్‌సైకిల్ ర్యాలీలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 90 మంది రైడర్లు పాల్గొంటున్నారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్,
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా,
చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల నుంచి వచ్చిన
రైడర్లతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలైన సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్,
బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ,
ఎన్ఎస్జీ సిబ్బంది, కేంద్ర పోలీసు సంస్థలైన
ఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐఏ
ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ‘మాదకద్రవ్యాలపై పోరాటం’ అనే సందేశంతో దేశవ్యాప్తంగా
నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ చేపట్టారు. దేశంలోని అన్ని
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర
సాయుధ బలగాలకు చెందిన మోటార్‌సైకిల్ రైడర్లు గుజరాత్‌లోని ఏక్తా నగర్‌కు చేరుకుని
ఏక్తా పరేడ్ - 2026లో పాల్గొననున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2326018)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8