హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్టోబర్ 21, 2026 బుధవారం రోజున పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద అమరవీరులకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు

‘మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు’ ఇతివృత్తంతో దేశవ్యాప్త బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి

ర్యాలీలో భాగంగా అక్టోబర్ 31, 2026న జరిగే ఏక్తా పరేడ్‌ లో పాల్గొనేందుకు గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు అన్ని రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర బలగాలకు చెందిన పోలీసు రైడర్లు

అక్టోబర్ 21, 1959న లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద భారీ ఆయుధాలతో చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది వీర పోలీసులు

ఈ అమరవీరులతో పాటు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరి స్మారకార్థం అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవం నిర్వహణ

పోలీసు సిబ్బంది చేసిన త్యాగాలకు, జాతీయ భద్రత, సమగ్రతను కాపాడటంలో వారు పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగా 2018లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున జాతీయ పోలీసు స్మారకాన్ని జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2026 5:50PM by PIB Hyderabad

అక్టోబర్ 21, 2026 బుధవారం రోజున పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద అమరవీరులకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు అర్పిస్తారు.

 

వివిధ రాష్ట్రాలు, యూటీలు (జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ), కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ, ఎన్ఎస్‌జీ), పలు కేంద్ర పోలీసు సంస్థల (ఆర్‌పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐఏ)కు చెందిన సుమారు 90 మంది పోలీసు రైడర్లతో కూడిన బైక్ ర్యాలీని హోంమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. ‘మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు’ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న దేశవ్యాప్త ర్యాలీలో ఇదొక భాగం. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర బలగాలకు చెందిన పోలీసు రైడర్లు అక్టోబర్ 31, 2026న జరిగే ఏక్తా పరేడ్‌లో పాల్గొనేందుకు గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు చేరుకుంటారు.

 

అక్టోబర్ 21, 1959న లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా ఆర్మీ భారీ ఆయుధాలతో ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈ ఘటనలో పది మంది వీర పోలీసులు ప్రాణాలను అర్పించారు. అప్పటి నుంచి ఏటా అక్టోబర్ 21వ తేదీని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పోలీసు సిబ్బంది చేసిన త్యాగాలకు, జాతీయ భద్రత, సమగ్రతను పరిరక్షించటంలో పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగా 2018లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున న్యూఢిల్లీలోని చాణక్యపురిలో నిర్మించిన జాతీయ పోలీసు స్మారకాన్ని (ఎన్‌పీఎం) ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.

ఈ స్మారకం పోలీసు బలగాలకు జాతీయ గుర్తింపు, గర్వం, లక్ష్య సాధనలో ఐక్యత, ఉమ్మడి చరిత్ర, గమనాన్ని అందించటమే కాక, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని రక్షించాలనే నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. ఈ స్మారకంలో ఒక ప్రధాన శిల్పం ‘వాల్ ఆఫ్ వాలర్’, మ్యూజియం ఉన్నాయి. 30 అడుగుల ఎత్తైన ఏకశిలా గ్రానైట్ స్మారక స్తూపమైన ఈ ప్రధాన శిల్పం.. పోలీసు సిబ్బంది బలం, దృఢత్వం, నిస్వార్థ సేవకు ప్రతీక. అమరవీరుల పేర్లు చెక్కిన వాల్ ఆఫ్ వాలర్... స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బంది ధైర్యసాహసాలకు, త్యాగానికి గుర్తింపుగా నిలుస్తోంది. భారతదేశంలో పోలీసు వ్యవస్థపై చారిత్రక, పరిణామక్రమ ప్రదర్శనగా మ్యూజియాన్ని రూపొందించారు. పోలీసు సిబ్బందికి, పౌరులకు ఈ స్మారకం ఒక పవిత్ర తీర్థయాత్రా స్థలంగా, గౌరవనీయ ప్రదేశంగా నిలుస్తోంది. సోమవారం మినహా అన్ని రోజుల్లో ప్రజల సందర్శనార్థం ఎన్‌పీఎం తెరిచి ఉంటుంది. ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం సూర్యాస్తమయానికి ఒక గంట ముందు నుంచి ఎన్‌పీఎం వద్ద కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) బ్యాండ్ ప్రదర్శన, పరేడ్, రీట్రీట్ వేడుకలను నిర్వహిస్తాయి.

 

గతంలో మాదిరిగానే పోలీసు అమరవీరులకు నివాళులర్పించేందుకు అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రధాన కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద నిర్వహిస్తారు. అక్కడ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), ఢిల్లీ పోలీసుల సంయుక్త పరేడ్ జరుగుతుంది. ఆనవాయితీ ప్రకారం కేంద్ర హోంమంత్రి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రులు, పోలీసు నేపథ్యం ఉన్న ఎంపీలు, సీఏపీఎఫ్, సీపీఓల అధిపతులు తదితరులు కూడా అమరవీరులకు నివాళులర్పిస్తారు. పదవీ విరమణ చేసిన డీజీలు, పోలీసుశాఖలోని అధికారులు, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

 

పోలీసు అమరవీరులకు నివాళులర్పించటంతో పాటు సభను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి ప్రసంగిస్తారు. హాట్ స్ప్రింగ్స్ అమరవీరులకు అంకితమిచ్చిన స్మారక పీఠం వద్ద కేంద్ర హోంమంత్రి నివాళులర్పించటంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయటంతో పాటు పోలీసు వెబ్‌సైట్లలోనూ, ఏఐఆర్, ఇతర మీడియా మాధ్యమాల్లోనూ ప్రసారం చేస్తారు.

 

ఈ సంస్మరణల్లో భాగంగా అక్టోబర్ 22 నుంచి 30 వరకు ఎన్‌పీఎం వద్ద సీఏపీఎఫ్, సీపీఓలు వివిధ స్మారక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అమరవీరుల కుటుంబసభ్యుల సందర్శనలు, పోలీసు బ్యాండ్ ప్రదర్శన, బైక్ ర్యాలీలు, అమరవీరుల కోసం పరుగు, రక్తదాన శిబిరాలు, పిల్లల కోసం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, పోలీసు సిబ్బంది త్యాగం, శౌర్యం, సేవలను చాటిచెప్పే వీడియో చిత్రాల ప్రదర్శన వంటి కార్యక్రమాలుంటాయి. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని పోలీసు బలగాలు ఇదే తరహా కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

న్యూఢిల్లీలోని చాణక్యపురిలో జాతీయ పోలీసు స్మారకం

***


(రిలీజ్ ఐడి: 2325347) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam