వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ ఎగుమతిదారులకు నూతన అవకాశాలు: విజయదశమి పర్వదినాన 2026 అక్టోబర్ 20 నుంచి అమల్లోకి రానున్న భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ

న్యూజిలాండ్ మార్కెట్‌కు లభించనున్న 100 శాతం పన్ను రహిత ప్రవేశం.. భారతీయ ఎంఎస్‌ఎంఈలు, హస్తకళాకారులు, రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలకు గొప్ప అవకాశాలు: శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య- పరిశ్రమల శాఖ మంత్రి

భారత్ నుంచి న్యూజిలాండ్‌కు మొట్టమొదటి జేసీబీ మెషిన్ ఎగుమతిని ప్రారంభించిన భారత్

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ కింద భారత్‌లోకి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సుగమం చేసేందుకు అంగీకరించిన న్యూజిలాండ్

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2026 7:27PM by PIB Hyderabad

విజయం, నూతన ప్రారంభాలకు ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినమైన 2026 అక్టోబర్ 20 నుంచి 'భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' (ఎఫ్‌టీఏ) అమల్లోకి రానున్నట్లు కేంద్ర వాణిజ్య- పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య- పెట్టుబడుల శాఖ మంత్రి సన్మాన్య డాడ్ మెక్‌క్లేలు నేడు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడిగా ప్రకటించారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్, న్యూజిలాండ్‌లు తమ దైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, విస్తరించడం కొనసాగిస్తున్నాయి. 'వికసిత్ భారత్ 2047' దృక్పథానికి అనుగుణంగా మార్కెట్ యాక్సెస్ అందించే, ఉపాధి అవకాశాలను సృష్టించే, యువత- మహిళలు- ఎంఎస్‌ఎంఈలకు సాధికారత కల్పించే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంలో భారత ఆకాంక్షలకు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) నిదర్శనంగా నిలుస్తోంది.

 

ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య- పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. “మైదానంలోనూ, బయట కూడా మనది విజయవంతమైన భాగస్వామ్యం. ఈ ఒప్పందం విజయం అనేది ఇది కల్పించే అవకాశాలు.. న్యూజిలాండ్, భారత ప్రజల జీవితాల్లో తెచ్చే మార్పు ఆధారంగా ఉంటుంది. భారత్ విషయానికి వస్తే న్యూజిలాండ్ మార్కెట్‌లోకి 100 శాతం సుంకాల రహిత ప్రవేశం లభించడం మన ఎగుమతిదారులకు.. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు, హస్తకళాకారులు, రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలకు గణనీయమైన నూతన అవకాశాలను అందిస్తుంది. మన రైతుల కోసం ఈ ఒప్పందం నూతన అవకాశాలతో పాటు తగిన సంరక్షణ చర్యలను మేళవిస్తుంది. యాపిల్, కివీఫ్రూట్, తేనె వంటి పంటల కోసం కార్యాచరణ ప్రణాళికలు, 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' స్థాపనతో కూడిన 'వ్యవసాయ ఉత్పాదకత భాగస్వామ్యం' మెరుగైన తోటల నిర్వహణను ప్రోత్సహిస్తుంది.. కోత అనంతర నష్టాలను తగ్గిస్తుంది.. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి, దేశవ్యాప్తంగా రైతు ఆదాయాలను మరింత బలపరుస్తుంది. భారత్ తన 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే సమయానికి పోటీతత్వం, వినూత్నత, ఉత్పాదక సామర్థ్యం, సమ్మిళిత సమృద్ధి పునాదిగా రూపుదిద్దుకునే అభివృద్ధి చెందిన, సుసంపన్న భారత్ నిర్మించాలనే మన ప్రధానమంత్రి 'వికసిత్ భారత్ 2047' దృక్పథానికి కూడా ఈ ఒప్పందం సరైన రీతిలో అనుసంధానమవుతుంది.” అని పేర్కొన్నారు.

న్యూజిలాండ్ వాణిజ్య- పెట్టుబడుల శాఖ మంత్రి సన్మాన్య తోడ్ మెక్‌క్లే మాట్లాడుతూ.. “భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడం అనేది మన ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలలో ఒక కీలక మలుపు. న్యూజిలాండ్ ఎగుమతిదారుల విషయంలో ఈ ఎఫ్‌టీఏ 140 కోట్ల మంది వినియోగదారులకు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత మార్కెట్‌కు ద్వారాలు తెరుస్తుంది. భారతదేశానికి జరుగుతున్న న్యూజిలాండ్ ప్రస్తుత ఎగుమతులు టారిఫ్‌ల రద్దు లేదా గణనీయమైన టారిఫ్ తగ్గింపుల ద్వారా ప్రయోజనం పొందుతాయి. అదే సమయంలో భారతీయ వస్తువులన్నీ పన్ను రహితంగా న్యూజిలాండ్‌లోకి ప్రవేశించగలవు. ఇది భారతీయ ఎగుమతిదారులకు నూతన అవకాశాలను సృష్టిస్తూ న్యూజిలాండ్ ఇతర ఎఫ్‌టీఏ భాగస్వాములతో సమానమైన అవకాశాలను అందిస్తుంది. ఈ ఒప్పందం విజయం అనేది చివరికి ఇది కల్పించే అవకాశాలు, మన వ్యాపార రంగాలు దీనిని ఏ మేరకు వినియోగించుకుంటాయనే అంశం ఆధారంగానే ఉంటుంది” అని పేర్కొన్నారు.

 

వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. “స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశాల మధ్య లోతైన ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినవి. ఈ ఎఫ్‌టీఏలో భాగంగా ఈ భాగస్వామ్యం భారత్‌లోకి న్యూజిలాండ్ నుంచి పెద్దయెత్తున పెట్టుబడులను తీసుకువస్తుందని మనం భావిస్తున్నాం. పసిఫిక్ ప్రాంతంలోని మిగతా అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు న్యూజిలాండ్‌తో మరింత లోతైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నాయి. భారత్, న్యూజిలాండ్‌ల మధ్య దైపాక్షిక వాణిజ్యానికి మనం కూడా ప్రధాన దోహదకారిగా మారగలమనే అవకాశాన్ని ఈ ఎఫ్‌టీఏ కల్పించింది. ఈ అవకాశాన్ని మన ప్రజలకు వాస్తవ ప్రయోజనాలుగా మలచడమే ఇప్పుడు మన ముందున్న ప్రధాన బాధ్యత. ఈ సందేశాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాకు తీసుకువెళ్లేందుకు మేం అన్ని పరిశ్రమలు, పారిశ్రామిక సంఘాలతో కలిసి పనిచేస్తున్నాం” అని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో భారత్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సేవలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, వ్యవసాయం వంటి రంగాల్లో ఈ ఒప్పందం కల్పించే నూతన అవకాశాల గురించి వారు మాట్లాడారు. 

 

ఈ సందర్భంగా భారత్ నుంచి న్యూజిలాండ్‌కు మొట్టమొదటి జేసీబీ యంత్రం ఎగుమతిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ప్రారంభించారు. ఒప్పందం అమల్లోకి వచ్చే రోజున (అక్టోబర్ 20) వ్యవసాయం, రత్నాలు- ఆభరణాలు, ఇంజనీరింగ్, క్రీడా పరికరాలు, పాదరక్షలు, తోలు ఆధారిత ఉత్పత్తుల విభాగాల్లో వివిధ ఉత్పత్తుల ఎగుమతుల ప్రారంభోత్సవాలను కూడా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాలు.. భారతీయ తయారీదారుల నమ్మకాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులకు ఈ ఒప్పందం కల్పిస్తున్న నూతన అవకాశాలను తెలియజేస్తున్నాయి. 

భారతీయ ఎగుమతులకు సంబంధించిన అన్ని టారిఫ్ లైన్లపై న్యూజిలాండ్ కస్టమ్స్ సుంకాలను పూర్తిగా రద్దు చేసింది, దీనివల్ల గరిష్ఠంగా ఉన్న 10 శాతం వరకు టారిఫ్‌లు తొలగిపోనున్నాయి. వస్త్రాలు, దుస్తులు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రత్నాలు- ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్స్- ఆటో విడిభాగాలు, రసాయనాలు, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి పొందనున్నాయి. చెక్క దుంగలు, కోకింగ్ కోల్, లోహ వ్యర్థాలు లేదా స్క్రాప్‌లపై పన్ను రహిత సదుపాయం లభించడం వల్ల తయారీ రంగానికి, ఎంఎస్‌ఎంఈ సరఫరా గొలుసులకు మరింత బలం చేకూరనుంది. క్రమబద్ధీకరించిన నిబంధనల వల్ల ఫార్మాస్యూటికల్, వైద్య పరికరాల పరిశ్రమలు విశేష ప్రయోజనం పొందనున్నాయి.

 

సేవా రంగంలో ఇతర దేశాల వాణిజ్య ఒప్పందాలన్నింటికంటే ఉత్తమమైన వాటిని న్యూజిలాండ్ ఈ ఒప్పందంలో అందించింది. ఇందులో భాగంగా దాదాపు 118 రంగాల్లో మార్కెట్ యాక్సెస్, సుమారు 139 ఉప-రంగాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం హోదా నిబంధనలను కల్పించింది. ఆయుర్వేద, యోగా, ఇతర ఆయుష్ వ్యవస్థలకు వర్తిస్తూ ఆరోగ్య, సాంప్రదాయ వైద్య సేవల్లో ప్రత్యేక అవకాశాలను మొదటిసారిగా కేటాయించింది.

 

భారతీయ యువత, నిపుణుల కోసం ప్రతి సంవత్సరం 5,000 తాత్కాలిక ఉపాధి వీసాలు, 1000 వర్కింగ్ హాలిడే వీసాల కోటాను కేటాయిస్తారు. భారతీయ విద్యార్థుల సంఖ్యపై ఎటువంటి పరిమితి ఉండదు. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు మూడేళ్ల వరకు, డాక్టోరల్ స్కాలర్లకు నాలుగేళ్ల వరకు కోర్సు తదనంతర పని హక్కులు లభిస్తాయి.

 

'వ్యవసాయ ఉత్పాదకత భాగస్వామ్యం' అనేది ఈ ఒప్పందంలో ఒక అత్యంత కీలకమైన భాగం. ఇది కేవలం సుంకాల మినహాయింపులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి సాంకేతికతను, శిక్షణను, అత్యుత్తమ విధానాలను భారతీయ రైతులకు అందించేలా సహకారాన్ని విస్తరిస్తుంది. ఇందులో కివీఫ్రూట్, యాపిల్, తేనె ఉత్పత్తి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు ఉన్నాయి. ఉద్యానవన రంగం, అటవీ రంగం, పశుసంవర్ధకం, మత్స్య పరిశ్రమ రంగాలకు కూడా ఈ పరస్పర సహకారం విస్తరిస్తుంది.

 

కివీఫ్రూట్, యాపిల్స్, తేనె ఉత్పత్తుల కోసం 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటుచేయటానికి న్యూజిలాండ్ సాంకేతిక సాయం అందిస్తోంది. 'కివీఫ్రూట్ కార్యాచరణ ప్రణాళిక' కింద మొదటి విడత స్థలాలను నాగాలాండ్‌లోని ఫుట్సేరో, ఉత్తరాఖండ్‌లోని మగ్రాలలో గుర్తించారు. యాపిల్స్ కోసం మరొక రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా 'తేనె కార్యాచరణ ప్రణాళిక' ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటును ప్రతిపాదిస్తోంది. ఇవి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, మెరుగైన సాగు పద్ధతులు, ఉత్పాదకత పెంపుదల ద్వారా రైతులకు మద్దతుగా నిలవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

 

యాపిల్స్, కివీఫ్రూట్, మనుకా తేనెకు సంబంధించిన అన్ని 'టారిఫ్ రేట్ కోటాలు' 'జాయింట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కౌన్సిల్' పర్యవేక్షణలో కార్యాచరణ ప్రణాళికల అమలుతో అధికారికంగా అనుసంధానమయ్యాయి. ఇది మార్కెట్ యాక్సెస్‌ను నేరుగా రైతుల సంక్షేమంతో అనుసంధానిస్తుంది.

 

భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సుగమం చేసేందుకు న్యూజిలాండ్ కట్టుబడి ఉంది. ఈ పెట్టుబడులు 'భారత్‌లో తయారీ' దార్శనికత కింద వ్యవసాయం, తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, అంకురాలకు లబ్ధి చేకూర్చడంతో పాటు ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఉపాధి కల్పనకు మద్దతుగా నిలుస్తాయని భావిస్తున్నారు.

 

రైతులు, పాడి పరిశ్రమ ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, గ్రామీణ వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడానికి... పాడి ఉత్పత్తులు, చక్కెర, వంటనూనెలు, కీలకమైన వ్యవసాయ సరుకులు వంటి కీలక ఉత్పత్తులను రాయితీల పరిధి నుంచి మినహాయించారు. మూలాలకు సంబంధించిన బలమైన నిబంధనలు, దైపాక్షిక రక్షణ యంత్రాంగం, అక్రమ మార్గాల నిరోధక నిబంధనలు ఈ ఒప్పంద ప్రయోజనాలు కేవలం అసలైన భారతీయ ఎగుమతిదారులకు మాత్రమే అందుతాయని హామీ ఇస్తాయి.

 

ఈ ఒప్పందం భారత్‌కు చెందిన ఎంఎస్‌ఎంఈలు, మహిళా నాయకత్వంలోని పరిశ్రమలు, అంకురాలు, హస్తకళాకారులు, తొలితరం పారిశ్రామికవేత్తలకు అధునాతన విదేశీ మార్కెట్‌ను తెరుస్తుంది. సున్నా సుంకాలు, వేగవంతమైన కస్టమ్స్ ప్రక్రియలు ఎగుమతి వ్యయాన్ని తగ్గించి వారి వినియోగదారుల పరిధిని విస్తరిస్తాయి. క్రమబద్ధీకరించిన పరస్పర సహకారం వాణిజ్య సంబంధిత సమాచారాన్ని మెరుగ్గా అందుబాటులోకి తెచ్చేందుకు, న్యూజిలాండ్ ఎస్ఎమ్ఈ వ్యవస్థతో సంబంధాలను ఏర్పరచడానికి దోహదపడుతుంది. ఇది ప్రత్యేకించి మహిళలు, యువత యజమాన్యంలోని సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

 

భారతీయ భౌగోళిక సూచికల నమోదును సుగమం చేసేందుకు కూడా న్యూజిలాండ్ కట్టుబడి ఉంది. ఇది గ్రామీణ హస్తకళాకారులు, సాంప్రదాయ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులకు రక్షణ కల్పించే మార్గాలను తెరుస్తుంది.

 

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 'వికసిత్ భారత్ 2047' దృక్పథంలో రూపుదిద్దుకున్న ప్రజాకేంద్రీకృత సమ్మిళిత భాగస్వామ్యం. ఇది రైతులు, ఎంఎస్‌ఎంఈలు, మహిళా నేతృత్వంలోని సంస్థలు, పారిశ్రామికవేత్తలు, హస్తకళాకారులు, యువత, నిపుణులకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఈ ఒప్పంద చర్చలు 2025 మార్చి 16న ప్రారంభమై కేవలం తొమ్మిది నెలల్లోనే 2025 డిసెంబర్ 22 నాటికి పూర్తయ్యాయి. అనంతరం ఈ ఒప్పందంపై 2026 ఏప్రిల్ 27న సంతకాలు జరిగాయి. ఇది 'భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: రోడ్‌మ్యాప్ టూ 2030'కి మద్దతుగా నిలుస్తుంది. ఇది 2030 నాటికి వస్తువులు, సేవలలో దైపాక్షిక వాణిజ్యాన్ని 7 బిలియన్ల న్యూజిలాండ్ డాలర్లకు (రూ. 35,000 కోట్లు) రెట్టింపు చేయాలనే ఆశాజనక లక్ష్యాన్ని నిర్దేశించింది.

 

భారత్-న్యూజిలాండ్ ఫ్యాక్ట్‌షీట్ లింక్ - https://www.commerce.gov.in/files/2026-04/final_0.pdf

 

తరచుగా అడిగే ప్రశ్నల లింక్ - https://www.commerce.gov.in/files/2026-04/FAQs%20-%20India-New%20Zealand%20FTA.pdf

 

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏపై సంతకాల లింక్ - https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2255914&reg=3&lang=1

 

అమలులోకి వచ్చే తేదీ ప్రకటన లింక్ - https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2313143&reg=48&lang=1

***


(రిలీజ్ ఐడి: 2325346) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Marathi , Gujarati , Malayalam