ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వినియోగదారుల భద్రత పట్ల నిబద్ధతను స్పష్టం చేస్తూ... తేయాకులో పురుగుమందుల అవశేషాలపై శాస్త్రీయ ఆధారిత పరిమితులను ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
తేయాకులో ఎసిటామిప్రిడ్, ఇమిడాక్లోప్రిడ్ గరిష్ఠ అవశేష పరిమితులను ప్రతిపాదిస్తూ ముసాయిదా సవరణను ప్రకటించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ, భాగస్వాముల నుంచి అభిప్రాయాల ఆహ్వానం
జపాన్లో 30 పీపీఎం, అమెరికాలో 50 పీపీఎం పరిమితుల కంటే తక్కువగా తేయాకులో ఎసిటామిప్రిడ్ అవశేష పరిమితిని 20 పీపీఎంగా ప్రతిపాదించిన భారత్
ఆహార భద్రతపై నిరంతర దృష్టిని ప్రతిబింబించేలా గత నియంత్రణ చర్యల్లో భాగంగా అధిక విషపూరితమైన 13 పురుగుమందులను జాబితా నుంచి తొలగింపు
ప్రపంచ సగటు హెక్టారుకు 2.38 కిలోల కన్నా తక్కువ, భారత్లో హెక్టారుకు 0.5 కిలోల కన్నా తక్కువగా సగటు పురుగుమందుల వినియోగం
వినియోగదారుల భద్రతతో పాటు సమర్థవంతమైన తెగుళ్ల నియంత్రణ, సుస్థిర వ్యవసాయ పద్ధతుల మధ్య సమతుల్యత సాధించేలా ప్రతిపాదిత ప్రమాణాలు
నాడు పోస్టు చేయడమైనది:
17 OCT 2026 3:26PM by PIB Hyderabad
శాస్త్రీయ ఆధారిత ఆహార భద్రతా నియంత్రణను, వినియోగదారుల రక్షణను ప్రోత్సహించేందుకు చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా తేయాకులో ఎసిటామిప్రిడ్, ఇమిడాక్లోప్రిడ్... రెండు పురుగుమందుల గరిష్ఠ అవశేష పరిమితులను (ఎంఆర్ఎల్) ప్రతిపాదిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ముసాయిదా సవరణలను ప్రకటించింది. శాస్త్రీయ అంచనాలు, సంబంధిత అంతర్జాతీయ పద్ధతులు, భారతీయ వ్యవసాయ అవసరాల దృష్ట్యా పురుగుమందుల అవశేష ప్రమాణాలను సమీక్షించే దిశగా ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుసరిస్తున్న విధానాన్ని ఈ ప్రతిపాదన తెలియజేస్తుంది.
అక్టోబర్ 16, 2026న భారత గెజిట్లో ప్రచురించిన ముసాయిదా ప్రకారం... తేయాకులో ఎసిటామిప్రిడ్కు 20 మి.గ్రా పర్ కిలో (20 పీపీఎం), ఇమిడాక్లోప్రిడ్కు 50 మి.గ్రా పర్ కిలో (50 పీపీఎం) ఎంఆర్ఎల్ ఉండాలని ఆహార భద్రత, ప్రమాణాల (కలుషితాలు, విష పదార్థాలు, అవశేషాలు) సవరణ నిబంధనలు-2026 ప్రతిపాదిస్తుంది. నిబంధనల తుది ఆమోదానికి లోబడి ఆహార భద్రతా అవసరాల పాటింపు, పర్యవేక్షణ, అమలును సులభతరం చేస్తూ పురుగుమందుల అవశేషాలకు స్పష్టంగా నిర్వచించిన నియంత్రణ ప్రమాణాలను అందించటం ఈ ప్రతిపాదిత పరిమితుల ఉద్దేశం.
జపాన్లో 30 పీపీఎం, అమెరికాలో 50 పీపీఎం సంబంధిత పరిమితుల కన్నా తేయాకులో ఎసిటామిప్రిడ్ కు ప్రతిపాదించిన 20 పీపీఎం ఎంఆర్ఎల్ తక్కువగా ఉంది. అంతర్జాతీయ కోడెక్స్ ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకుని ఇమిడాక్లోప్రిడ్ ప్రతిపాదిత పరిమితిని కూడా రూపొందించారు. భారత ఆహార భద్రతా ప్రాధాన్యతలను, దేశీయ వ్యవసాయ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూనే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నియంత్రణ పద్ధతులకు ఇస్తున్న ప్రాధాన్యతను ఇవి ప్రతిబింబిస్తున్నాయి.
పురుగుమందుల అవశేష ప్రమాణాల సమీక్ష, సవరణ దిశగా ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుసరిస్తున్న విస్తృత నియంత్రణ విధానంలో ఈ తాజా ప్రతిపాదన ఒక భాగం. అందుబాటులో ఉన్న శాస్త్రీయ సమాచారం, అంతర్జాతీయ పద్ధతుల ఆధారంగా ఎంఆర్ఎల్ లను సమీక్షించిన ఆహార భద్రత, ప్రమాణాల (కలుషితాలు, విష పదార్థాలు, అవశేషాలు) సవరణ నిబంధనలు-2024... ఈ ప్రక్రియలో కీలక ముందడుగుగా నిలిచాయి. తగిన నియంత్రణ రక్షణ చర్యలు, వినియోగదారుల భద్రతపై నిరంతర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ గతంలో చేపట్టిన నియంత్రణ చర్యల్లో భాగంగా అధిక విషపూరితమైనవిగా గుర్తించిన 13 పురుగుమందులను జాబితా నుంచి తొలగించారు.
ఆహార భద్రతా నియంత్రణలో గరిష్ఠ అవశేష పరిమితులు అత్యంత కీలకం. ఆహార పదార్థాల్లో చట్టబద్ధంగా అనుమతించే పురుగుమందుల అవశేషాల గరిష్ఠ సాంద్రతను ఇవి నిర్దేశిస్తాయి. పురుగుమందుల అవశేషాల సమాచారం, ఆహారం ద్వారా శరీరంలోకి చేరే పరిమాణం, సంబంధిత భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ అంచనాల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. పురుగుమందుల అవశేషాలను పర్యవేక్షించేందుకు, నిర్దేశిత ఆహార భద్రతా అవసరాల అమలును నిర్దారించేందుకు ఈ ప్రమాణాలు కొలమానాల నియంత్రణ ప్రాతిపదికను అందిస్తాయి.
వ్యవసాయ ఉత్పత్తిలో సమర్థవంతమైన తెగుళ్ల నియంత్రణ ప్రాముఖ్యతను కూడా ప్రతిపాదిత ప్రమాణాలు గుర్తిస్తున్నాయి. నిర్దేశిత పద్ధతులకు అనుగుణంగా, తగిన రీతిలో పురుగుమందులను ఉపయోగించినప్పుడు తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకునేందుకు, పంట నష్టాన్నితగ్గించుకునేందుకు, వ్యవసాయ ఉత్పాదకతను నిలబెట్టుకునేందుకు రైతులకు సహాయపడతాయి. సరైన పంట రక్షణ చర్యలు అందుబాటులో ఉండటం వల్ల తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయ పద్ధతులకూ మద్దతు లభిస్తుంది. వినియోగదారుల భద్రతే అత్యున్నత ప్రాధాన్యతగా వ్యవసాయ ఉత్పత్తి అవసరాలను సమతుల్యం చేయటానికి ఈ నియంత్రణ విధానం ప్రయత్నిస్తుంది.
మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో పురుగుమందుల సగటు వినియోగం తక్కువగా ఉండటం... దేశ వ్యవసాయ పద్ధతులపై కీలక దృక్పథాన్ని అందిస్తుంది. హెక్టారుకు 0.5 కిలోల కంటే తక్కువగా ఉన్న భారత సగటు పురుగుమందుల వినియోగం... ప్రపంచ సగటు అంచనా హెక్టారుకు 2.38 కిలోల కన్నా చాలా తక్కువ. కొలంబియా, బ్రెజిల్, అమెరికాతో సహా పలు దేశాల్లో నమోదైన స్థాయిల కంటే కూడా ఇది తక్కువే.
అంతర్జాతీయంగా అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు... పంటలు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ అవసరాలకు తగినట్లుగా విస్తృత శ్రేణిలో పురుగుమందులను జాబితా చేశాయి. అదే తరహాలో భారత నియంత్రణ విధానం కూడా శాస్త్రీయంగా నిర్ణయించిన అవశేష పరిమితుల ద్వారా వినియోగదారులకు తగిన రక్షణ కల్పిస్తూనే, దేశీయ పంట రక్షణ అవసరాలను పరిగణనలోకి తీసుకోవటానికి కృషి చేస్తోంది.
తేయాకు రంగానికి సంబంధించి.. సాగుదారులు, ప్రాసెసర్లు, ఆహార వ్యాపార సంస్థలు, పరీక్షించే ప్రయోగశాలలు, అమలు చేసే అధికారులకు మరింత నియంత్రణ స్పష్టతను అందించటం ఈ ప్రతిపాదిత పరిమితుల ఉద్దేశం. నిరంతర పర్యవేక్షణకు, బాధ్యతాయుతమైన పురుగుమందుల నిర్వహణకు, ఆహార భద్రతా అవసరాలకు కట్టుబడి ఉండటానికి స్పష్టంగా నిర్వచించిన ప్రమాణాలు వీలు కల్పిస్తాయి. అదే సమయంలో భారత తేయాకు నాణ్యత, భద్రతపై విశ్వాసాన్ని పెంపొందిస్తాయి.
ఆధారాలతో కూడిన నియంత్రణ, వినియోగదారుల రక్షణ, బాధ్యతాయుతమైన వ్యవసాయ పద్ధతులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిరంతర దృష్టిని ఈ ముసాయిదా సవరణ ప్రతిబింబిస్తుంది. శాస్త్రీయ అంచనా, అంతర్జాతీయ నియంత్రణ అంశాలు, భాగస్వాముల సంప్రదింపులను జోడించటం ద్వారా పారదర్శక, బాధ్యతాయుత ఆహార భద్రతా నియంత్రణ వ్యవస్థను నిర్వహించాలనే భారత విస్తృత లక్ష్యానికి సహకరిస్తూనే ఆహార భద్రతా ప్రాధాన్యతలను తేయాకు సాగు ఆచరణాత్మక అవసరాలతో సమతుల్యం చేసేందుకు ఈ ప్రతిపాదిత విధానం కృషి చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2324790)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8