సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతదేశం కేవలం ప్రపంచ కంటెంట్ మార్కెట్‌గానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే మీడియా, వినోద సంస్థలను సృష్టించే దిశగా పయనించాలి: సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2026లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి
భారతీయ మీడియా, వినోద రంగాన్ని 100 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లేందుకు రోడ్‌మ్యాప్‌ను అందిస్తూ శ్వేతపత్రం విడుదల చేసిన 'సీఐఐ'
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 4:16PM by PIB Hyderabad
భారతదేశాన్ని సృజనాత్మక కంటెంట్, సాంకేతికత, ప్రతిభ, అంతర్జాతీయంగా పోటీపడే మీడియా సంస్థలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మీడియా, వినోద పరిశ్రమ కేవలం విస్తరణకే పరిమితం కాకుండా సొంత మేధో సంపత్తి, సుస్థిర వ్యాపార నమూనాలు, ప్రపంచ మార్కెట్ విస్తరణపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ నేడు పిలుపునిచ్చారు.
"ది న్యూ ఎకనామిక్స్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్: బిల్డింగ్ ఇండియాస్ ఫ్యూచర్ గ్లోబల్ మీడియా కంపెనీస్" అనే ఇతివృత్తంతో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న 'సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2026' ప్రారంభోత్సవ సదస్సును ఉద్దేశించి శ్రీ చంచల్ కుమార్ మాట్లాడారు. తన సుసంపన్నమైన కథా కథన సంప్రదాయాలు, సాంస్కృతిక వైవిధ్యం, సృజనాత్మక నైపుణ్యాలను శాశ్వత ఆర్థిక, సాంస్కృతిక విలువలుగా మలచుకునే సువర్ణ అవకాశం భారతదేశానికి ఉందని పేర్కొన్నారు.
నవకల్పన, నమ్మకం రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేవ్స్ 2025 దార్శనికత అయిన "క్ర్రియేట్ ఇన్ ఇండియా, క్ర్రియేట్ ఫర్ ది వరల్డ్" ఆలోచనతో ఈ సదస్సు ఇతివృత్తాన్ని ఆయన అనుసంధానించారు. దేశంలో సృజనాత్మక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ.. వేవ్స్, వేవ్స్ బజార్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ), ఇండియా సినీ హబ్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను శ్రీ చంచల్ కుమార్ గుర్తుచేశారు. సృజనాత్మకత, మేధో సంపత్తిని పరిరక్షించడానికి బలమైన పైరసీ వ్యతిరేక ఫ్రేమ్‌వర్క్ ఆవశ్యకతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా.. "భారత్‌లో సృష్టించండి. భారత్‌లోనే హక్కులు కలిగి ఉండండి. భారత్ నుంచి విస్తరించండి. ప్రపంచ స్థాయికి తీసుకెళ్లండి" అనే దూరదృష్టితో కూడిన సూత్రాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సదస్సులో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) రూపొందించిన "ది న్యూ ఎకనామిక్స్ ఆఫ్ మీడియా- ఎంటర్టైన్మెంట్" అనే శ్వేతపత్రం కూడా విడుదలయింది. ఇది 2030వ దశాబ్దం ప్రారంభ నాటికి భారతీయ మీడియా, వినోద రంగాన్ని 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తోంది. ఈ రంగం అభివృద్ధిని వేగవంతం చేయడానికి వేగవంతమైన సంస్కరణలు, బలమైన ప్రాంతీయ మార్కెట్లు, కొలమాన ఆధారిత అమలు అవసరమని ఈ శ్వేతపత్రం పిలుపునిచ్చింది.
సదస్సు చైర్మన్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్- సీఈఓ శ్రీ గౌరవ్ బెనర్జీ.. వ్యాపార నమూనాలను ప్రాథమికంగా పునరాలోచించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. "భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఉండటం అనేది ముగింపు కాదు కేవలం ఒక ప్రారంభం మాత్రమే. అది స్వయంగా ఒక వ్యాపార నమూనా కాజాలదు" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేక్షకుల విలువ, ప్రకటనకర్తలకు స్పష్టమైన ఫలితాలు, పెట్టుబడిదారులకు సుస్థిరమైన రాబడులు అందించడంపై మరింత దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సదస్సు కో-చైర్మన్, యూట్యూబ్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి గుంజన్ సోని మాట్లాడుతూ.. సృజనాత్మకత, సంస్కృతిని "వికసిత్ భారత్" లక్ష్యానికి మద్దతు ఇచ్చే ఆర్థిక సామర్థ్యాలుగా అభివర్ణించారు. డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ యువ తరం క్రియేటర్లకు తమ ఊహాశక్తిని, స్థానిక సాంస్కృతిక మూలాలను ప్రపంచ స్థాయి సంస్థలుగా తీర్చిదిద్దడంలో సహాయపడతాయని ఆమె తెలిపారు.
సదస్సు కో-చైర్మన్, జెట్‌సింథసిస్ మేనేజింగ్ డైరెక్టర్- సీఈఓ శ్రీ రాజన్ నవాని మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకు సాగడానికి సాంకేతికత, ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. మానవ ఊహాశక్తికి, ఆలోచనలను నిజం చేసే సామర్థ్యానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని ఏఐ అత్యంత వేగంగా తగ్గిస్తోందని ఆయన అన్నారు.
150 మందికి పైగా పెట్టుబడిదారులు, ప్రాజెక్ట్ ప్రతిపాదకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్న 'వేవ్స్ గ్లోబల్ ఇన్వెస్టర్ అండ్ ఇన్వెస్టీ మీట్'ను శ్రీ చంచల్ కుమార్ ప్రారంభించారు. ఇది 'వేవ్ఎక్స్', 'వేవ్స్ బజార్' నుంచి దాదాపు 20 మంది భాగస్వాములను అనుసంధానించడం ద్వారా మూలధన ప్రదాతలకు, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక వ్యాపార సంస్థలకు మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2324186)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12