శాంతి, స్థిరత్వం, సంక్షేమం, స్వేచ్ఛ, సమ్మిళిత్వంతో కూడిన ఇండో–పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆసియాన్ స్పష్టమైన ఆసక్తులను కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. భారతదేశం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం, సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్), మహాసాగర్ (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్) దార్శనికతల గురించి ఆయన వివరించారు. ఇవి స్వేచ్ఛాయుతమైన, బహుళ ధ్రువ సహకారాన్ని ప్రోత్సహిస్తాయన్నారు. ఇండో-పసిఫిక్ దార్శనికతకు కేంద్రమైన ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాల ద్వారా వాటిని దేశం సమన్వయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వ్యూహాత్మక పోటీ, సముద్రప్రాంతంలో ఒత్తిడి, అనిశ్చితి పెరుగుతున్నాయి. వీటికి అదనంగా ఉగ్రవాదం, సైబర్ నేరాలు, పైరసీ, అక్రమరవాణా, అక్రమే చేపలవేట, వాతావరణ సంబంధిత ప్రమాదాలు, కీలకమైన సరఫరా వ్యవస్థలకు ముప్పులు ఎదురవుతున్నాయి. ఏ ఒక్క దేశమూ ఒంటరిగా ఈ సవాళ్లను ఎదుర్కోలేదు అని రక్షణ మంత్రి అన్నారు.
విబేధాలు వివాదాలుగా మారకముందే వాటిని పరిష్కరించేందుకు శాంతియుతంగా చర్చించుకోవాల్సిన అవసరం గురించి శ్రీ రాజనాథ్ సింగ్ వివరించారు. అలాగే ఏ పక్షం వహించాలనే ఒత్తిడి లేకుండా కలసి పనిచేయగలిగే ప్రాంతీయ వ్యవస్థ కోసం ఆయన పిలుపునిచ్చారు. ‘‘దేశాలు ఉమ్మడిగా తమ సామర్థ్యాన్ని పెంపొందించుకుని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించి, చర్చల ద్వారా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నప్పుడు భద్రత బలోపేతం అవుతుందని భారతదేశం విశ్వసిస్తుంది’’ అని ఆయన తెలియజేశారు.
భారత్, ఆగ్నేయాసియా మధ్య శతాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి అన్నారు. వీటి మూలాలు ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, వాణిజ్యం, ఆలోచనల్లో ఉన్నాయని తెలిపారు. సమాన భాగస్వామిగా ఈ ప్రాంతంతో కలసి పనిచేసే దీర్ఘకాలిక నిబద్ధతే యాక్ట్ ఈస్ట్ విధానం అని స్పష్టం చేశారు. ‘‘ఇండో–పసిఫిక్పై భారతదేశ విధానం, ఆసియాన్ దృక్పథం ఒకదానికొకటి పరస్పరం ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రాంతీయ వేదికల మధ్య పోటీని సృష్టించడం కాకుండా సహకారాన్ని మనం బలోపేతం చేయాలి’’ అని సూచించారు.
వాణిజ్యం, ఇంధనం, ప్రజలు, నిత్యావసర వస్తువుల నౌకావాణిజ్యానికి సంబంధించి కీలకమైన ప్రాంతంలో ఉన్న హిందూ మహాసముద్రం, ఆగ్నేయాసియా జలాలను సురక్షితంగా ఉంచడం ఉమ్మడి బాధ్యత అని శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. స్థిరమైన, నియమాధారిత నౌకా వాణిజ్య వ్యవస్థను అందించడానికి సముద్ర వాణిజ్య రంగంపై అవగాహన, పరస్పర కార్యాచరణ సామర్థ్యం, సముద్ర అంతర్భాగంపై అవగాహనలో సహకారాన్ని పెంపొందిచడం ముఖ్యమని ఆయన అన్నారు.
ఆసియాన్–ఇండియా సముద్ర సహకార సంవత్సరంగా 2026ను ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆసక్తులను కార్యాచరణరూపంలోకి తీసుకురావడానికి ఇది ఓ అవకాశమని రక్షణమంత్రి తెలియజేశారు. ‘‘నౌకావాణిజ్య సమాచారాన్ని పంచుకోవడం, మన నౌకదళాలు, తీరరక్షక దళాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితులకు ఉమ్మడిగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా పైరసీ, అక్రమ రవాణా, అక్రమ చేపల వేట, ఇతర ముప్పులకు వ్యతిరేకంగా కూడా మనం పనిచేయాలి” అని ఆయన అన్నారు.
రక్షణ సాంకేతికతను మరో కీలక రంగంగా శ్రీ రాజనాథ్ సింగ్ పేర్కొన్నారు. సాపేక్షంగా తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు ఖరీదైన రక్షణ వ్యవస్థలకు సవాలు విసరగలవని ఇటీవలి సంఘర్షణలు నిరూపించడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, సైబర్ సామర్థ్యాలు, అంతరిక్ష ఆధారిత వ్యవస్థలకు రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు. ఆచరణాత్మకమైన, చవకైన, అనుకూలమైన పరిష్కారాలతో స్పందించాల్సిన అవసరాన్ని వివరించారు.
‘‘కేవలం కొన్ని పెద్ద సంస్థలకు మాత్రమే ఆవిష్కరణలు పరిమితం కాకూడదని భారత్ విశ్వసిస్తోంది. అంకుర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, చిన్న సంస్థలు అన్నీ సహకారం అందించగలవు. భారత్ అమలు చేస్తున్న ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్), టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (టీడీఎఫ్) లాంటి కార్యక్రమాలు మన రక్షణ అవసరాల కోసం ఆవిష్కర్తలతో కలసి పనిచేయడానికి ఓ మార్గాన్ని అందించాయి’’ అని రక్షణమంత్రి అన్నారు. కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, సైబర్ డిఫెన్స్, సముద్ర నిఘా, విపత్తు స్పందన లాంటి స్పష్టంగా నిర్వచించిన సమస్యలపై ఆవిష్కర్తలతో కలసి పనిచేయడానికి మార్గాలను అన్వేషించాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, పరీక్షల కోసం ఉమ్మడి అవకాశాలు, యువ పరిశోధకుల మధ్య ఆదానప్రదానాలు, జాగ్రత్తగా రూపొందించిన ఆవిష్కరణ సవాళ్లకు శ్రీ రాజనాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఇలాంటి సహకారం సున్నితమైన సమాచారాన్ని పరిరక్షించాలని, మేధో సంపత్తిని గౌరవించాలని, సాంకేతికతను బాధ్యతాయుతంగా పంచుకొనేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ‘‘మన దేశాల మధ్య విశ్వసనీయతను బలోపేతం చేస్తూనే ఉపయోగకరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉండాలి’’ అని మంత్రి అన్నారు.
రక్షణ పారిశ్రామిక సహకారం గురించి రక్షణ మంత్రి వివరించారు. నిఘా నౌకలు, రాడార్లు, ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు, తదితర రంగాల్లో ఆయా దేశాల అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆసియాన్ భాగస్వాములతో సహకారాన్ని అన్వేషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై ‘ఆత్మనిర్భర భారత్’ కార్యక్రమం దృష్టి సారిస్తుందని ఆయన తెలియజేశారు. అయితే స్వావలంబన సాధించడం అంటే ఒక్కరే పనిచేయడం కాదన్నారు. విశ్వసనీయ భాగస్వాములు కలిసి పరికరాలను రూపకల్పన చేయడానికి, నిర్మించడానికి, నిర్వహించడానికి, మెరుగుపరచడానికి ఇది అవకాశాలను సృష్టించగలదన్నారు.
సహ-అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి, నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ, శిక్షణ, దీర్ఘకాలిక సాంకేతిక సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని శ్రీ రాజనాథ్ సింగ్ తెలియజేశారు. ఈ తరహా ఏర్పాట్లు స్థానికంగా నైపుణ్యాలను పెంపొందిస్తాయని, పరిశ్రమలకు ఊతమిస్తాయని, సరఫరా వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ తరహా భాగస్వామ్యాలు విజయవంతం కావడానికి ఎలాంటి అంశాలు దోహదపడతాయో పరిశోధకులు అధ్యయనం చేయాలి. స్పష్టమైన అవసరాలు, అమ్మకాల అనంతరం అందించే విశ్వసనీయమైన సేవలు, సరైన సాంకేతిక భద్రత, బాధ్యతలు-ప్రయోజనాల్లో న్యాయమైన పంపకాలు, స్థానికంగా ఉన్న సంస్థలకు, నైపుణ్యం కలిగిన కార్మికులకు అవకాశాలు కల్పించడం దీనిలో కీలకం. మన లక్ష్యం ఒకే ఒక్క లావాదేవీకి మాత్రమే పరిమితం కాకూడదు. ఎల్లకాలం నిలిచి ఉండే శాశ్వతమైన భాగస్వామ్యాలను నిర్మించుకోవడమే మన ధ్యేయం కావాల’’న్నారు.
ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సహకారాన్ని మరింత విస్తరించాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. తుఫానులు, వరదలు, సముద్ర మట్టాలు పెరగడం, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు మొదలైనవి ఓడరేవులను దెబ్బతీసి, వాణిజ్యాన్ని స్తంభింపజేయడమే కాకుండా ప్రజల ప్రాణాలకు, జీవనోపాధికి ముప్పు కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. అందుకే రక్షణ రంగ చర్చల్లో మానవతా సాయం, విపత్తు ఉపశమనం (హెచ్ఏడీఆర్) క్రమం తప్పని భాగంగా ఉండాలని స్పష్టం చేశారు. ‘‘సంక్షోభం తలెత్తడానికి ముందే మనం ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవచ్చు. ఉత్తమ విధానాలను పంచుకోవచ్చు. పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుచుకోవచ్చు’’ అని చెప్పారు.
మేధావులు పోషించే కీలకపాత్ర గురించి కూడా శ్రీ రాజనాథ్ సింగ్ వివరించారు. మంచి విశ్లేషణలతో పాటు ఆచరణ సాధ్యమైన ఆలోచనలు కూడా ప్రభుత్వాలకు అవసరమని ఆయన అన్నారు. ఈ ఫోరం నుంచి కొన్ని ఆచరణాత్మకమైన ఆలోచనలను వెలికితీయాలని సూచించారు. నౌకావాణిజ్య భద్రత, సైబర్ ముప్పులు, ఆధునిక సాంకేతికతలు, విపత్తు ప్రతిస్పందన- రక్షణ పరిశ్రమ సహకారంపై ఇండియా-ఆసియాన్ సంయుక్త పరిశోధన అజెండాను రూపొందించాలని సూచించారు. దీంతో పాటు యువపరిశోధకులు, ఫెలోషిప్పులు, పర్యటనలు, సంయుక్త ప్రచురణలతో సహా పరిశోధకుల మధ్య క్రమం తప్పని చర్చలు ఉండాలని సూచించారు. అలాగే సముద్ర విపత్తులపై ముందస్తు సన్నద్ధత, కౌంటర్ డ్రోన్ పరిష్కారాలపై ఉమ్మడి అధ్యయనం. లేదా నౌకావాణిజ్య సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంపై పరిశోధనా ప్రాజెక్టు లాంటి పైలట్ ప్రాజెక్టులను గుర్తించాలన్నారు. అధికారికంగా చేపట్టే సమావేశాల మధ్య పరిశోధకులు, క్షేత్రస్థాయి నిపుణులు, విధానరూపకర్తలు తమ చర్చలను కొనసాగించుకొనేందుకు వీలుగా ట్రాక్ 1.5, ట్రాక్ 2 చర్చలను ప్రోత్సహించాలని చెప్పారు. సంక్షిప్తమైన సిఫార్సులను సిద్ధం చేయాలని, వాటిని ముందుకు తీసుకెళ్లగలిగిన సంస్థలను గుర్తించాలని, భవిష్యత్తులో చేపట్టే సమావేశాల్లో పురోగతిని సమీక్షిచాలని సూచించారు.
ఎంపీ-ఐడీఎస్ఏ డైరెక్టర్ జనరల్ అంబాసిడర్ సుజన్ ఆర్ చినోయ్ స్వాగతోపన్యాసం చేశారు. ఆసియాన్తో భారతదేశ రక్షణ, భద్రత భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో రక్షణ మంత్రి అందిస్తున్న దార్శనికతకు, తోడ్పాటుకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం పదకొండు ఆసియాన్ దేశాలకు, భారత్కు చెందిన ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఆసియాన్-భారత్ రక్షణ భాగస్వామ్య పురోగతిలో సాధించిన సంస్థాగత విజయంగా ఈ ఫోరంను ఆయన వర్ణించారు.
భారత్, ఆసియాన్ వ్యూహాత్మక వర్గాల మధ్య కొనసాగుతున్నచర్యలను ఈ ఫోరం వ్యవస్థీకృతం చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే పటిష్టమైన రక్షణ, భద్రత సహకారంలో ఆచరణాత్మక రంగాలను గుర్తించడంలో సహాయపడుతుందని కూడా ఆకాంక్షించారు.
ఆసియాన్-ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరం గురించి
2026 అక్టోబర్ 14, 15 తేదీల్లో ఈ సదస్సు జరుగుతుంది. భారత్-ఆసియాన్ మధ్య వ్యూహాత్మక చర్చలను బలోపేతం చేయడం, ఉమ్మడి విశ్లేషణలను ప్రోత్సహించడం, రక్షణ-భద్రతా రంగాల సహకారాన్ని విస్తరించేందుకు ఆచరణాత్మక మార్గాలను గుర్తించడమే ఈ వేదిక లక్ష్యం. 12వ ఏడీఎంఎం-ప్లస్ సదస్సు నేపథ్యంలో 2025 అక్టోబర్ 31న కౌలాలంపూర్లో జరిగిన రెండో ఆసియాన్-భారత్ రక్షణ మంత్రుల అనధికారిక సమావేశంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వ్యూహాత్మక స్థిరత్వం, ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు, నౌకావాణిజ్య భద్రత, గ్రే-జోన్ సవాళ్లు, హెచ్ఏడీఆర్, సముద్ర పరిధిపై అవగాహన, రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ, సైబర్ భద్రత, అంతరిక్షం, మానవరహిత వ్యవస్థలు, రక్షణ పరిశ్రమల భాగస్వామ్యం, పటిష్టమైన సరఫరా వ్యవస్థలపై ఈ వేదిక సమగ్రంగా చర్చిస్తుంది. ఈ చర్చలు మరింత దృఢమైన, భవిష్యత్ కార్యాచరణతో కూడిన ఆసియాన్-భారత్ రక్షణ భాగస్వామ్యానికి దోహదపడతాయని భావిస్తున్నారు.
***